దిశ దశ, న్యూఢిల్లీ:
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు రంగం సిద్దమైనట్టుగా ఉంది. కొద్ది సేపటి క్రితం ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ అధికారులు పెద్ద ఎత్తున న్యూ ఢిల్లీలోని కేజ్రీవాల్ ఇంటికి చేరుకున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాంలో అరవింద్ కేజ్రీవాల్ భాగస్వామ్యం ఉందని ఈడీ విచారించేందుకు రావాలని పలుమార్లు నోటీసులు ఇచ్చింది. అయితే 9 సార్లు ఇచ్చిన నోటీసులకు కూడా స్పందించలేదు. ఇటీవలే కోర్టును ఆశ్రయించి బెయిల్ కూడా తీసుకున్నారు. ఆ తరువాత మళ్లీ ఈడీ అధికారులు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన స్పందించలేదు. దీంతో మళ్లీ ఆయన కోర్టును ఆశ్రయించగా గురువారం మద్యాహ్నం హైకోర్టు మాత్రం అరెస్ట్ నుండి మినహాయింపు ఇవ్వాలని ఆధేశాలు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. దీంతో రాత్రి 7 గంటల ప్రాంతంలో ఈడీ అధికారులు ఢిల్లీ సీఎం ఇంటికి చేరుకున్నారు. ఆయన్ను అరెస్ట్ చేసేందుకే ఈడీ అధికారులు పెద్ద ఎత్తున చేరుకున్నారన్న ప్రచారం ఊపందుకుంది. దీంతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటి వద్ద భారీగా బలగాలను మోహరించారు.