బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో పాటు ఆయన సోదరుని ఇండ్లలో ఈడీ సోదాలు…

దిశ దశ, హైదరాబాద్:

ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ అధికారులు గురువారం తెలంగాణాలోని పలు ప్రాంతాల్లో దాడులు చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడు గూడెం మధుసూధన్ రెడ్డికి సంబంధించిన పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. గురువారం ఉదయం నుండే ప్రారంభించిన ఈ రైడ్స్ సంతోష్ గ్రానైట్స్ తో పాటు దీని అనుభంద సంస్థల కార్యాలయాలు, బినామీలకు చెందిన పలు ప్రాంతాల్లో సాగుతున్నాయి. గతంలో పటాన్‌చెరు పోలీసులు నమోదు చేసిన కేస్ ఆధారంగా ఈడీ రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. ఈ కేసు ఆధారంగా విచారణ చేపట్టిన ఈడీ మనీ లాండరింగ్ నిరోధక చట్టం(PMLA)లో భాగంగా సోదాలు నిర్వహిస్తున్నట్టుగా సమాచారం. గూడెం మధసూధన్ రెడ్డి అక్రమ మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలపై పటాన్‌చెరు పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. మైనింగ్ తవ్వకాలలో అక్రమాలకు పాల్పడడంతో పాటు మితి మీరిన తీరు ప్రదర్శించారంటూ అప్పటి మండల రెవెన్యూ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేశారు. కేంద్ర పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు పరిమితికి మించి చట్టాన్ని అతిక్రమించి తవ్వకాలు జరిపారని, గడువు ముగిసిన తరువాత కూడా మైనింగ్ కార్యకలాపాలు కొనసాగించారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీంతో సదరు క్వారీని కూడా సీజ్ కూడా చేశారు. అంతేకాకుండా అప్పటి సంగారెడ్డి కలెక్టర్ వల్లూరి క్రాంతి ఆధ్వర్యంలో ఆర్డీఓ రవిందర్ రెడ్డిలతో పాటు అధికారుల బృందంతో కూడిన విచారణ కమిటీ కూడా ఈ వ్యవహారంపై ఆరా తీసింది. లక్డారంలోని మధుసూధన్ రెడ్డికి చెందిన కంపెనీల్లో అక్రమ మైనింగ్ సాగుతోందన్న విషయాన్ని కూడా కమిటీ గుర్తించింది. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగి ఉంటుందని భావించిన ఈడీ గూడెం మధుసూధన్ రెడ్డితో పాటు అతని బంధువులు, బినామీలకు చెందిన పలు ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది.

You cannot copy content of this page