దిశ దశ, హైదరాబాద్:
నిధుల దుర్వినియోగం కేసులో ఏపీ మహేష్ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ప్రమోటర్లపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ అధికారులు దాడులు చేపట్టింది. హైదరాబాద్ లోని ఆరు చోట్ల ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఈ బ్యాంకుకు సంబంధించి కీలకంగా వ్యవహరించిన ముగ్గురిపై ప్రధాన దృష్టి సారించింది ఈడీ. రమేష్ కుమార్ బంగ్, ఉమేష్ చంద్ అసవా, పురుషోత్తమదాస్ మంధనల పాత్ర ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్నట్టుగా ఈడీ భావిస్తోంది. వీరితో పాటు సోలిపురం వెంకట్ రెడ్డితో పాటు మరో ఇద్దరు వ్యక్తులకు సంబంధంచిన ఆరు చోట్ల ఈ సోదాలు నిర్వహించింది ఈడీ. గతంలోనే హైదరాబాద్ పోలీసులు జారీ చేసిన ఎఫ్ఆర్ ఆధారంగా మనీలాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ తాజాగా దాడులు చేస్తున్నట్టుగా సమాచారం. ఊసీ మహేష్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకుకు సంబంధించిన ఉన్నతాధికారులపై ఇంతకుముందు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో రెండు కేసులు నమోదయ్యాయి. బ్యాంకు షేర్ హోల్డర్లు, అసోసియేషన్ కార్యదర్శి శ్యామ్ సుందర్ బియానీ ఫిర్యాదు మేరకు రమేష్ కుమార్ బంగ్, ఉమేష్ చంద్ అసావా, పురుషోత్తమదాస్ మంధానాలపై ఈ కేసులు నమోదయ్యాయి. బియానీ ఇచ్చిన ఫిర్యాదులో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బోర్డు సభ్యులు మోసానికి పాల్పడ్డారని, డిపాజిటర్లు, వాటాదారులకు సంబంధించిన నిధులను దుర్వినియోగం చేశారని పేర్కొన్నారు. నకిలీ డాక్యూమెంట్లు సృష్టించి రూ. 300 కోట్లకు పైగా రుణాలు మంజురు చేయడంతో పాటు రూ. 18.30 కోట్లు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు దర్యాప్తుపై గతంలో సుప్రింకోర్టు విధించిన స్టే కూడా ఎత్తివేసింది.