అధికారులపై విచారణ చేయాలన్న హై కోర్ట్…
రంగంలోకి దిగిన ఈడీ…
దిశ దశ, హైదరాబాద్:
భూదానోద్యమం ద్వారా సేకరించిన భూమిని అప్పనంగా నొక్కేశారా..? నకిలీ డాక్యూమెంట్లు క్రియేట్ చేసి ప్రభుత్వాన్నే మోసగించారా..? దేశంలో అత్యున్నతమైన సివిల్ సర్విసెస్ అధికారులు ఇందులో భాగస్వాములు అయ్యారా..? తెలంగాణలో మరో భారీ స్కాం వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం ఆదేశించిడంతో ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ అధికారులు రంగంలోకి దిగడంతో అసలు గుట్టు బట్టబయలు కానుంది. తెలంగాణాలో భూదానోద్యమంలో భాగంగా సేకరించిన భూముల క్రయవిక్రయాలు జరిగిన తీరుపై హైకోర్టు ఈడీ, సీబీఐలచే విచారణ జరిపించాలని కేంద్రానికి స్ఫష్టం చేయడం సంచలనంగా మారింది.
అత్యున్నతమైన స్థానంలో…
భూదాన్ ల్యాండ్స్ క్రయవిక్రయాల వ్యవహారంలో దేశంలోనే అత్యున్నతమైన సివిల్ సర్విసెస్ అధికారులు, వారి కుటుంబ సభ్యుల పేర్లు ఇందులో బయటకు రావడం గమనార్హం. చట్ట విరుద్దంగా భూదాన్ భూములను ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పేరిట వారి కుటుంబ సభ్యులు, మరికొంతమంది ఉన్నతాధికారుల పేరిట రిజిస్ట్రేషన్ కావడం విచిత్రం. నిరుపేదలకు కెటాయించాల్సిన ఈ భూములు అధికారుల పేరిట మార్పిడీ కావడం వెనక అసలేం జరిగింది అన్న కోణంలో విచారించేందుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ రంగంలోకి దిగింది. హై కోర్టు ఆదేశాలు అందుకున్న తరువాత ఈడీ అధికారులు సోదాలకు శ్రీకారం చుట్టారు. సోమవారం హైదరాబాద్ పాతబస్తీలోని పలువురి ఇండ్లలో ఈడీ అధికారుల బృందాలు సోదాలు చేపట్టాయి. దీంతో తెలంగాణాలోని భూదాన్ ల్యాండ్స్ ట్రాంజక్షన్స్ అక్రమాలు వెలుగులోకి రానున్నాయి. చట్టాలను, ప్రభుత్వ నిబంధనలను కఠినంగా అమలు చేయాల్సిన హోదాలో ఉన్న వారే వాటిని అతిక్రమించిన తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మేడ్చల్ జిల్లా నాగారంలోని 181, 182, 194, 195 సర్వే నంబర్లలోని భూమి అంతా కూడా భూదాన్ బోర్డు ఆధీనంలో ఉంది. ఈ భూములను ఐఏఎస్, ఐపీఎస్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు కొనుగోలు చేశారు.
అనుమతులు ఉన్నాయా..?
అయితే గవర్నమెంట్ సర్వీసులో ఉన్న వారు ఏ స్థాయి అధికారులు అయినా స్థిర, చరస్థుల కొనుగోళ్లు చేయాలంటే ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవల్సి ఉంటుంది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఏదైని ఆస్థులు కొన్నప్పడు సంబంధిత తమ ఉన్నతాధికారుల నుండి అనుమతి తీసుకోవల్సి ఉంటుందని తెలుస్తోంది. హైదరాబాద్ శివార్లలోని భూదాన్ బోర్టుకు చెందిన భూముల కొనుగోళ్లు చేసిన అధికారులు కొనుగోలు చేసినప్పుడు అనుమతులు తీసుకున్నారా లేదా అన్న విషయంపై కూడా ఈడీ అదికారులు దృష్టి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వారి ఇండ్లలో సోదాలు…
భూదాన్ భూముల వ్యవహారంపై విచారణ చేపట్టిన ఈడీ మొదట వీటిని విక్రయించిన వారి ఇండ్లలో సోదాలు చేపట్టింది. నాలుగు చోట్ల ఏక కాలంలో సోదాలు నిర్వహించిన అధికారులు లావాదేవీలకు సంబంధించిన వివరాలను ప్రాథమికంగా సేకరించినట్టుగా సమాచారం. వీరితో పాటు కొన్ని కంపెనీల భాగస్వామ్యం కూడా భూదాన్ భూముల వ్యవహారంలో ఉన్నట్టుగా నిర్దారించినట్టుగా తెలుస్తోంది. నకిలీ డాక్యూమెంట్లు క్రియేట్ చేసి నకిలీల పేరిట క్రయవిక్రయాలు జరిపినట్టుగా గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఈ లావాదేవీల్లో అధికార దుర్వినియోగం కూడా జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలోని ఓ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఫోటోలతో పాటు డాక్యూమెంట్లు కూడా ఉన్నట్టుగా నివేదికలో పేర్కొనట్టు సమాచారం. భూదాన్ భూముల లావాదేవీలలో రిజిస్ట్రేషన్ డాక్యూమెంట్లను కూడా సేకరించి ఇందుకు సంబంధించిన సమగ్ర వివరాలపై ఆరా తీసే పనిలో ఈడీ అధికారులు నిమగ్నం కానున్నట్టుగా తెలుస్తోంది. ధరణీ పోర్టల్ ద్వారా జరిగిన రిజిస్ట్రేషన్లకు సంబంధించిన ఆధారాలను కూడా సేకరిస్తున్నట్టుగా తెలుస్తోంది.