ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత విషయంలో ఈడీ కూడా ఢీ అంటే ఢీ అనే రేంజ్ లోనే గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. 16న రెండో సారి జరిగే విచారణకు అటెండ్ కాకుండా మెయిల్ చేసిన తాను రాలేనని చెప్పారు. ఈడీ అడిగిన అంశాలకు సంబంధించిన వివరాలను బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ తో పంపించారు. అయితే ఈడీ మాత్రం తిరిగి 20న రావాలని కోరుతూ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇచ్చారు. ఈ వ్యవహారంలో ఈ నెల 15న కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించి ఈడీ విచారణపై స్టే ఇవ్వాలని కోరగా పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయం స్థానం ఈ నెల 24కు విచారణను వాయిదా వేసింది. అయితే తాను వేసిన పిటిషన్ సుప్రింకోర్టులో విచారణలో పెండింగ్ ఉన్నందున తాను విచారణకు రాలేనని చెప్పినప్పటికీ ఈడీ మాత్రం ఈ నెల 20న రావల్సిందేనని మరోసారి సమన్స్ జారీ చేసింది. దీంతో కవిత 24న ఢిల్లీలో జరిగే ఈడీ విచారణకు వెల్తారా లేదా అన్న చర్చే సాగుతోంది. ఈ 24న సుప్రీం కోర్టులో తాను వేసిన పిటిషన్ బెంచ్ పైకి రానున్నందున అటెండ్ కాకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటున్నారా అన్నదే అంతు చిక్కకుండా పోయింది. 16నాటి విచారణలో కవిత చివరి క్షణం వరకు ఉత్కంఠతను లేవనెత్తి సింపుల్ గా ఈడీ ఆఫీసుకు ఓ మెయిల్ చేసేశారు. ఓ వైపున మీడియా మరో వైపున పార్టీ శ్రేణులు ఆఫీసులో ఈడీ అధికారులు ఎదురు చూస్తుంటే మెయిల్ చేసి అందరిని చల్లబర్చారు.
ఈడీ వ్యూహం ఇదేనా..?
మరో వైపున ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ కూడా తన వ్యూహాలకు పదును పెడుతున్నట్టుగా తెలుస్తోంది. మనీ లాండరింగ్ యాక్టులో భాగంగా కవితను హాజరు కావాలని ఈడీ కోరుతోంది. అయితే ఈ విషయంలో కోర్టులు కూడా విచారణకు సహకరించాలని చెప్తాయని, ఖచ్చితంగా ఎంక్వైరీకి హాజరు కావల్సి ఉంటుందని సీబీఐ రిటైర్డ్ జాయింట్ డైరక్టర్ లక్ష్మీనారాయణ కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈడీ తన విశేష అధికారాలను ఉపయోగించి ఈడీ స్పెషల్ కోర్టులో పిటిషన్ వేసి కవిత విచారణకు హాజరయ్యే విధంగా డైరక్షన్ ఇవ్వాలని కోరే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. లేనట్టయితే కోర్టు అనుమతితో చట్టపరమైన చర్యలు తీసుకోవాలా అన్న తర్జన భర్జనలు కూడా చేస్తున్నట్టు సమాచారం. ఈడీ తన వ్యూహాలకు పదును పెట్టి కవిత ఎత్తులకు పై ఎత్తులు వేసే విధంగా స్కెచ్ వేస్తోందన్న ప్రచారం జరుగుతోంది. అయితే 20న కవిత విచారణకు అటెండ్ అయితే ఎలా వ్యవహరించాలి, లేనట్టయితే ఎలా అనే అంశంపై కులంకశంగా చర్చించిన ఈడీ బృందం తుది నిర్ణయాన్ని చేతల్లో చూపేందుకే సిద్దమవుతోందని అంటున్న వారూ లేకపోలేదు. ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి కంటే భిన్నమైన కోణాలు కవిత విషయంలో వెలుగులోకి వస్తున్నాయని చెప్పాలి. మహిళ కావడం వల్ల విచారణలో సడలింపులు ఇవ్వాలని కూడా కవిత చేస్తున్న డిమాండ్లలో ఒకటి కావడం గమనార్హం.