ఢిల్లీలో ఏం జరుగుతోంది
దిశ దశ, న్యూ ఢిల్లీ:
మరి కొన్ని గంటల్లో లిక్కర్ స్కాం వ్యవహారంలో ఈడీ ఎదుట విచారణకు హాజరు కానున్న ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోనే మూడు రోజులుగా ఉంటున్నారు. అన్న కేటీఆర్, బావ హరీష్ రావులతో పాటు పెద్ద సంఖ్యలో వెల్లిన పార్టీ క్యాడర్ సమక్షంలో ఉదయం 7.30 గంటలకు బ్రేక్ ఫాస్ట్ చేస్తారు. పార్టీ శ్రేణులతో కొద్ది సేపు సమావేశం అయిన అనంతరం ఈడీ కార్యాలయానికి బయలుదేరుతారని తెలుస్తోంది. అయితే కవితలో మనో ధైర్యం నింపేదుకు మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ లు శుక్రవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఈడీ విచారణ సందర్భంగా కవిత మానసిక సంఘర్షణకు గురై పొంతనలేని సమాధానాలు చెప్పినట్టయితే ఈడీ అధికారులు ప్రశ్నల పరంపర కొనసాగిస్తూనే ఉంటారు. ఎక్కడో లాజిక్ దొరకబట్టి వారు ఇరుకున పెట్టే అవకాశాలు కూడా ఉంటాయని వీటన్నింటిపై కవిత ఇప్పటికే సంపూర్ణ అవగాహన పొందారని తెలుస్తోంది. సీబీఐ విచారణ సమయంలో ఎలా వ్యవహరించారో అదే విధానంతో ముందుకు సాగాలని కవితకు నిపుణులు సలహాలు ఇచ్చారని సమాచారం. 10వ తేదిన మహిళా బిల్లు ఆమోదం కోసం నిరసన దీక్ష చేపట్టనున్న క్రమంలో 9న హాజరు కావాలని కవితకు ఈడీ నోటీసులు పంపింది. అయితే తాను ముందస్తుగా ఫిక్స్ చేసుకున్న షెడ్యూల్ బిజీగా ఉన్నందున 11న అయితే వస్తానని ఈడీకి లేఖ రాశారు. దీంతో ఈడీ 11నాడు విచారణకు రావాలని పంపించారు. శుక్రవారం జరిగిన నిరసన దీక్షలో కేవలం బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులే కాకుండా దేశంలోని వివిధ పార్టీలకు చెందిన ప్రముఖులను రప్పించడంలో కవిత సక్సెస్ అయ్యారు. శనివారం ఈడీ ఎదుట హాజరైన తరువాత కవితను అరెస్ట్ చేస్తే జాతీయ స్థాయిలో ఉన్న ప్రాంతీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టే అవకాశాలు ఉంటాయని బీఆర్ఎస్ ముఖ్య నాయకత్వం భావిస్తోంది. ఇదే సమయంలో కవిత ఈడీ కార్యాలయానికి వెల్లే వరకూ కూడా పార్టీ క్యాడర్ అంతా కూడా అండగా నిలవాలన్న యోచనలోనే ఉన్నట్టు సమాచారం.