సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
ఐజీ రంగనాథ్ ఉత్తర్వులు…
దిశ దశ, భూపాలపల్లి:
తన కోర్కెలను తీర్చుకునేందుకు సబార్డినేట్లను వేధింపులకు గురి చేస్తున్న ప్రబుద్దుడికి తెలంగాణ పోలీసు అధికారులు సరైన గుణ పాఠం చెప్పారు. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే పోలీసు విభాగంలో అంతర్గతంగా జరిగే వేధింపులు సాధారణంగా బయటకు రావు. కానీ శృతి మించిన తీరుతో విసుగెత్తిన బాధితులు ఉన్నాతాధికారులను కలిసి తమ గోడు వెల్లబోసుకుంటారు. కాళేశ్వరం ఎస్సై భవాని సేన్ విషయంలోనూ ఇదే జరిగింది. అయితే ఎలాంటి ఒత్తిళ్లకు తావు లేకుండా పోలీసు అధికారులు బాధితురాలి వేదనను అర్థం చేసుకుని నివేదికలు పంపించడంతో ఆ కీచక అధికారికి, పోలీసు విభాగంతో బంధం తెగిపోయింది. కాళేశ్వరం ఎస్సై భవాని సేన్ ను సర్వీసు నుండి శాశ్వతంగా తొలగిస్తూ ఉత్తర్వులు వెలువడడం సంచలనంగా మారింది. మహిళా ఉద్యుగలను వేధింపులకు గురి చేసే వారికి ఎలాంటి పనిష్మెంట్లు ఉంటాయోనన్న విషయాన్ని తెలంగాణ పోలీసు అధికారులు ప్రాక్టికల్ గా చూపించారు.
ప్రొఫెషనల్ క్రిమినల్ లా…
అయితే భవాని సేన్ వ్యవహారం గురించి భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే జరిపించిన విచారణలో విస్తూపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రోఫెషనల్ క్రిమినల్ ను మరిపించే విధంగా భవానీ సేన్ తనలోని పైశాచికానందాన్ని ప్రదర్శించారని తేలింది. ఈ నెల 15న ఒక భవనంలో నివాసం ఉంటున్న తన సబార్డినేట్ అయిన మహిళా ఉద్యోగిని పట్ల భవానీ సేన్ వ్యవహరించిన తీరు పోలీసు శాఖకే తలవంపులు తెచ్చే విధంగా ఉంది. అర్థరాత్రి కిటికి ద్వారా సదరు మహిళ నివాసం ఉంటున్న ఇంట్లోకి చొరబడి అఘాయిత్యానికి పాల్పడి… ఈ విషయం బయటకు చెప్తే బావుండదంటూ సర్వీసు రివాల్వర్ తో బెదిరించిన తీరు విస్మయం కల్గిస్తోంది. అంతకుముందు కూడా మహిళా హెడ్ కానిస్టేబుల్ ను వశ పర్చుకునేందుకు వ్యూహం పన్నిన తీరు తెలిసిన ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకుంటున్నారు. బాధిత మహిళా ఉద్యోగికి ఫోన్ చేసి తాను కాలు జారి పడ్డానని తన గదికి రావాలని అభ్యర్థించాడు. దీంతో సదరు మహిళా హెడ్ కానిస్టేబుల్ ఎస్సై గదికి వెళ్లగా ఆమెను లైంగికంగా ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశాడు. అతని వ్యవహార శైలిని గమనించిన బాధితురాలు ఎస్సైని తోసి వేసి తన గదిలోకి పరిగెత్తుకుంటూ వెల్లి తలుపులు వేసుకున్నారు. మరో ముగ్గురిని కూడా ఇదే విధంగా వేదింపలుకు గురి చేసినట్టుగా పోలీసు అధికారులు విచారణలో తేలినట్టగా తెలుస్తోంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావును ఘటనపై విచారణకు ఆదేశించారు. ఈ మేరకు విచారణ జరిపిన డీఎస్పీ బృందం బాధితులు ఇచ్చిన ఫిర్యాదు నిజమేనని తేల్చి బుధవారం ఉదయం ఎస్సై భవానీ సేన్ పై క్రిమినల్ కేసుకు ఆదేశించారు. ఈ మేరకు కాళేశ్వరం పోలీస్ స్టేషన్ 449, 376, (2), (a), (b) 324, ,506 ఐపీసీ సెక్షన్లలో క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ మేరకు నిందితుడు ఎస్సై భవాని సేన్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చగా జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించాలని కోర్టు ఆదేశించింది. గతంలో ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెనలో ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న యువతికి స్టడీ మెటిరియల్ ఇప్పిస్తానని చెప్పి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై భవానీ సేన్ పై 354 -D IPC సెక్షన్ లో కేసు నమోదు కాగా ఆసిఫాబాద్ కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ ఘటనపై పోలీసు అధికారలు విచారణ జరిపి భవానీ సేన్ ను సస్పెండ్ చేశారు. అయితే ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కూడా సీరియస్ గా స్పందించారు, క్రమశిక్షణారాహిత్యంగా వ్యవహరిస్తున్న ఎస్సై భవానీ సేన్ ను ఉద్యోగం నుండి తొలగించాలని ఆదేశించారు. ఈ మేరకు మల్టీజోన్ ఐజీ రంగనాథ్ ఉత్తర్వులు కూడా జారీ చేస్తూ ఆర్టికల్ 311 ప్రకారం భవానీ సేన్ ను ఉద్యోగం నుండి శాశ్వతంగా తొలగిస్తున్నామని వెల్లడించారు.
ఆయన ఠాణాలో ఆయనే నిందితుడు…
నిందితులపై కేసులు పెట్టే ఠాణాకు బాసుగా వ్యవహరించిన ఎస్సై భవానీ సేన్ తాను విధులు నిర్వర్తిస్తున్న స్టేషన్ లోనే నిందితునిగా మారుతుండడం విడ్డూరం. ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం స్టేషన్లకు హౌజ్ ఆఫీసర్ గా పనిచేసిన భవాని సేన్ రెండు చోట్ల కూడా క్రిమినల్ చర్యలకు పాల్పడ్డారు. మహిళల పట్ల ఆయన వ్యవహరించిన తీరుతో ఆయన పనిచేస్తున్న ఠాణాల్లోనే ఆయనపై ఎఫ్ఐఆర్ లు జారీ అయ్యాయి. కాళేశ్వరం కేసు విషయాన్ని గమనిస్తే తన సబార్డినేట్లను హింసించినందుకు తనకన్న తక్కు స్థాయిలో ఉన్న మరో స్టేషన్ హౌజ్ ఆఫీసర్ జారీ చేసిన ఎఫ్ఐఆర్ లో నిందితుడు కావడం గమనార్హం. బాసుగా వ్యవహరించిన స్టేషన్ లోనే క్రిమినల్ హిస్టరీ నమోదు ఒక ఎత్తైతే తన సబార్డినేట్ సంతకం చేసిన ఎఫ్ఐఆర్ లో నిందితుడు కావడం మరో విచిత్రం. మరో వైపున నిందితులను పరుగులు పెట్టించాల్సిన ఎస్సై స్థాయిలో ఉన్న భవానీ సేన్ కోర్టు నుండి బయటకు వస్తున్న క్రమంలో మీడియా కెమెరాలకు చిక్కకుండా ఉండేందుకు పరిగెత్తుకుంటూ వెల్లి పోలీసు వాహనంలో కూర్చోవడం విచిత్రం.