పట్టు నిరూపించుకున్నట్టేనా..? లోకసభ ఫలితాలపై మంత్రుల ప్రభావం…

దిశ దశ, కరీంనగర్:

లోకసభ ఎన్నికల ఫలితాలు వెలువడడంతో అందరి దృష్టి ఆ రెండు నియోజకవర్గాలపై పడింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆ రెండు చోట్ల ఎలాంటి ఫలితాలు అందించారు అన్న విషయంపై చర్చ సాగుతోంది. అయితే ఇద్దరు మంత్రులు కూడా అసెంబ్లీ ఎన్నిల ఫలితాలను మించి ఓట్లను సాధించడంలో సక్సెస్ అయ్యారు. పెద్దపల్లి జిల్లా మంథని నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు అసెంబ్లీ ఎన్నికల్లో 31,380 ఓట్ల మెజార్టీ వచ్చింది. అయితే లోకసభ ఎన్నికల్లో పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణకు ఈ సెగ్మెంట్ నుండి 45 వేలకు పైగా మెజార్టీ రావడం గమనార్హం. సిద్దిపేట్ జిల్లా హుస్నాబాద్ నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న పొన్నం ప్రభాకర్ అసెంబ్లీ ఎన్నికల్లో 19,344 ఓట్ల మెజార్టీ సాథించారు. లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు 23 వేల ఓట్ల మెజార్టీ వచ్చింది. అయితే ఇద్దరు మంత్రులు కూడా తాము పోటీ చేసినప్పటి కంటే ఎక్కువగా తమ ప్రభావాన్ని లోకసభ ఎన్నికల్లో చూపించినట్టయింది.

ఇంఛార్జీలుగా…

అయితే వీరిద్దరికి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం లోకసభ ఎన్నికల బాధ్యతలను అప్పగించింది. పెద్దపల్లి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు, కరీంనగర్ బాద్యతలు పొన్నం ప్రభాకర్ కు అప్పగించారు. అయితే పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ విజయాన్ని అందుకోగా కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు మాత్రం ఓటమి చవి చూశారు. ఇక్కడ రెండో స్థానంతోనే సరిపెట్టుకోవల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి. దీంతో సొంత నియోజకవర్గాల్లో తమ పట్టు నిలుపుకోవడంలో సఫలం అయిన మంత్రుల్లో శ్రీధర్ బాబు పెద్దపల్లి ఎంపీని గెలిపించుకోవడంలో సక్సెస్ అయ్యారు. పొన్నం మాత్రం పార్టీ అభ్యర్థిని గెలిపించడంలో సక్సెస్ కాలేకపోయారు.

You cannot copy content of this page