సిఫార్సు లేఖల జాతర… నిబంధనల పాతర…

లూప్ లైన్ విధానానికే మంగళం…

దిశ దశ, హైదరాబాద్:

నిత్యం శాంతి భద్రతల పరిరక్షణలో తల మునకలయ్యే పోలీసు యంత్రాంగం అంతా కూడా మానసిక సంఘర్షణకు గురవుతోంది. గతంలో ఒకటి అరా పోస్టింగుల విషయంలో రాజకీయ జోక్యం ఉండేది కానీ స్వ రాష్ట్రం సిద్దించిన తరువాత పొలిటికల్ పోస్టుంగుల పరంపర కొనసాగింది. దీంతో పోలీసు యంత్రాంగం అనుకూల పోస్టింగుల కోసం పైరవీలు చేసేందుకే ఎక్కువ సమయం కెటాయించాల్సిన పరిస్థితి తయారైంది. లా అండ్ ఆర్డర్ అమలు చేయడం పక్కన పడేసి అధికార పార్టీ నాయకుల కొమ్ము కాయడానికే సమయమంతా వెచ్చించాల్సి వచ్చింది. సిఫార్సు లేఖల విధానం వల పోలీస్ స్టేషన్ లో లాఠీ కదలాలన్న… టోపీ జరగాలన్న అధికార పార్టీ నాయకుల ఆదేశాలు కంపల్సరీ అన్నట్టుగా మారిపోయింది. దీంతో పోలీసు అధికారులు కూడా స్టేషన్లలో కంటే అధికార పార్టీ ఎమ్మెల్యేల వద్దే డ్యూటీలు ఎక్కువగా చేశారన్న అభిప్రాయాలు ఉన్నాయి. దీనివల్ల పోలీసు వ్యవస్థ విలువలు పూర్తిగా పడిపోగా… సమాజంలో చులకన భావం కూడా పెరిగిపోయింది. లేఖల పుణ్యమా అని ఉన్నతాధికారులు నిబంధనలు కూడా తుంగలో తొక్కేశారన్న అపవాదును మూఠగట్టుకోవల్సి వచ్చింది. ప్రతి ప్రమోషన్ సమయంలో లూప్ లైన్ విభాగాల్లో డ్యూటీ చేయాలన్న నిభందన ఉన్నప్పటికీ ఆ విధానానికే స్వస్తి పలికేశారు. దీంతో పదోన్నతులు పొందిన పోలీసు అధికారులు లా అండ్ ఆర్డర్ డ్యూటీలు చేస్తూనే ఉన్నారు. లూప్ లైన్ డిపార్ట్ మెంట్స్ లోకి అలాట్ అయిన వారు అలాగే ఉండిపోయారు. లూప్ లైన్ వింగ్స్ లో డ్యూటీ చేయనివారు పదోన్నతులు పొందగానే యథావిధిగా శాంతిభద్రతల విభాగానికే పరిమితం అయిపోయారు. చట్టాలను కఠినంగా అమలు చేయాల్సిన పోలీసు విభాగంలోనే నిబంధనలు అమలు కాకపోవడంపై ఉన్నతాధికారులు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో లాబీయింగ్ చేసే వారికే పోస్టింగుల మోక్షం కల్గింది తప్ప సమన్యాయం మాత్రం జరగలేదు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా పొలిటికల్ పోస్టింగుల ప్రక్రియ ఉన్నప్పటికీ నిబంధనలు కూడా పక్కన పెట్టేయడం, సిఫార్సు లేఖలు కంపల్సరీ అన్న రూల్ లేదు. కానీ తెలంగాణ ఆవిర్భావం తరువాత రికమండేషన్స్ కే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల పోలీసు యంత్రాంగం అచేతనవస్థకు చేరిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

స్టడీ అవసరం…

జోన్ల విధానంతో కూడా పోలీసు వ్యవస్థకు తీరని నష్టమే కల్గిందని చెప్పకతప్పదు. కొన్ని రాష్ట్రాలలో రాష్ట్ర వ్యాప్తంగా బదిలీల ప్రక్రియ అమలు చేస్తున్నారు. కానిస్టేబుల్ నుండి ఏ స్థాయి అధికారి అయినా ఆ రాష్ట్ర రాజధానిలో అయినా మారుమూల మండలంలో అయినా పోస్టింగ్ అయ్యే విధానం ఉంది. మన రాష్ట్రంలో మాత్రం జోన్ల విధానంతో ఏ ప్రాంతానికి అలాట్ అవుతారో అదే ప్రాంతంలో రిటైర్ అయ్యే వరకు విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో విశాలంగా ఉన్న జిల్లాలు ఇప్పుడు చిన్నగా మారిపోవడంతో వారికి ఇబ్బంది తప్పడం లేదు. కొన్ని రాష్ట్రాలలో బదిలీల విషయంలో కఠినంగా వ్యవహరించే విధానం అమలు అవుతోంది. మూడేళ్ల పాటు లా అండ్ ఆర్డర్ పోస్టింగ్ పొందిన అదికారి తరువాత పోస్టింగ్ ఖచ్చితంగా లూప్ లైన్ విభాగంలో చేయాల్సిందేనన్న రూల్ అమలు చేస్తున్నారు. దీనివల్ల పోలీసు అధికారులు అందరూ కూడా అటు శాంతి భద్రతల విభాగంలో ఇటు లూప్ లైన్ విభాగంలో పనిచేసినట్టు అవుతోంది. వారికి సరైన గుర్తింపు కూడా వస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ తెలంగాణాలో మాత్రం ఇష్టారీతిన బదిలీల పరంపర కొనసాగుతుండడం విస్మయం కల్గిస్తోంది. దీనివల్ల పెత్తనం చెలాయించే వారు పెద్దలుగా… పలుకుబడి లేని వారు నామామాత్రంగా మిగిలిపోయిన పరిస్థితి తలెత్తింది.

సీఎంపైనే ఆశలు…

కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణలో అణిచివేతకు గురైన పోలీసు యంత్రాంగం ఆశలు పెట్టుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బదిలీల ప్రక్రియపై కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నారు. అయితే సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు..? ఎప్పటి నుండి అమలు చేస్తారు అన్న విషయాలపై క్లారిటీ లేకపోవడంతో పోలీసు విభాగంలో ఇదే అంశం గురించి చర్చ జరుగుతోంది. మరో వైపున అసెంబ్లీ ఎన్నిలకు ముందు జనవరి 31 వరకు మూడేళ్లు నిండే అవకాశం ఉన్న వారందరిని బదిలీలు చేశారు. అయితే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలయ్యే అవకాశాలు ఇంకా లేకపోలేదు. లోకసభతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో హడావుడిగా నిర్ణయం తీసుకుని బదిలీలు చేస్తే లోకసభ ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ నిబంధనలు అనుసరించి మళ్లీ బదిలీల ప్రక్రియ కొనసాగించే అవకాశం లేకపోలేదు. దీంతో కొత్తగా చేపట్టే బదిలీలు మళ్లీ మళ్లీ జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలపై పూర్తిస్థాయిలో స్టడీ చేసి తెలంగాణకు అనుకూలంగా ఉన్న విధానాన్ని అమలు చేస్తే బావుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసుల బదిలీలపై పకడ్భందీ విధానాన్ని అమలు చేస్తే ఇంతకాలం అన్యాయం అయిన వారికి కూడా సరైన న్యాయం జరుగుతుందని అంటున్నారు. సమగ్రమైన విదానంతో బదిలీల ప్రక్రియను అమలు చేయాలని పోలీసు యంత్రాంగం సీఎంను అభ్యర్థిస్తోంది.

You cannot copy content of this page