దిశ దశ, హైదరాబాద్:
సీనియర్ పొలిటిషియన్స్ ఇద్దరు తమ వారసుల కోసం శ్రమించాల్సి వస్తోంది. ఫస్ట్ ఎంట్రీతోనే తమ పిల్లలు సక్సెస్ కావాలని తపన పడుతున్న ఆ ఇద్దర నేతలు టాప్ టూ బాటమ్ వరకు అన్ని తామై వ్యవహరించాల్సి వస్తోంది. రెండు రిజర్వేషన్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు తమ సక్సెసర్స్ కోసం తల్లడిల్లుతున్న తీరు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
పెద్దపల్లి నుండి వంశీ…
గడ్డం వెంకటస్వామి వారసత్వంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన వివేక్ తన తనయుడికి పెద్దపల్లి లోకసభ నుండి కాంగ్రెస్ టికెట్ ఇప్పించుకోవడంలో సక్సెస్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే జరిగిన ఒప్పందంలో భాగంగా వివేక్ చెన్నూరు ఎమ్మెల్యేగా, ఆయన తనయుడు వంశీకి పెద్దపల్లి టికెట్ ఖాయం అయిపోయింది. అయితే పెద్దపల్లి లోకసభ పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో ఐదు చోట్ల నుండి కూడా వంశీ అభ్యర్థిత్వంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అయినప్పటికీ అధిష్టానాన్ని ఒప్పించి మరీ తన కొడుక్కి టికెట్ ఇప్పించుకున్న వివేక్ స్థానిక నాయకత్వాన్ని మచ్చిక చేసుకునేందుకు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. పెద్దపల్లి పరిధిలోని మంథని నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కీ రోల్ కావడంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చే విధంగా మంతనాలు జరిపి సఫలం అయ్యారు. ఆ తరువాత మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నేతృత్వంలో మిగతా సెగ్మెంట్ల వారిని కూడా అనుకూలంగా మల్చుకోవడంపై ప్రత్యేకంగా చర్చలు జరిపి అందరి నోట వంశీకే మద్దతు అని అనిపించారు. ఇక్కడి కాంగ్రెస్ పార్టీ నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో వంశీ తొలి అడుగులోనే అడ్డంకులు ఎదురయ్యాయని భావించారు. కానీ అన్ని సద్దుకపోవడంతో గడ్డం వంశీ ప్రచారంలో దూసుకపోతున్నారు. ప్రత్యర్థి పార్టీల నాయకత్వం కూడా ఇక్కడ బలహీనంగా ఉండడం వల్ల వంశీ గెలుపు నల్లేరు మీద నడకలాగే కనిపిస్తోందని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు.
వరంగల్ లోగిలిలో…
ఇకపోతే వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యను పొలిటికల్ ఎంట్రీ ఇప్పించి సక్సెస్ చేయాలన్న తపనతో ఆమె తండ్రి కడియం శ్రీహరి ఉన్నారు. కొన్నేళ్లుగా కావ్యను రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ అనూకూలమైన వాతావరణం కనిపించ లేదు. తాజగా జరుగుతున్న లోకసభ ఎన్నికలు సరైన వేదికగా భావించిన కడియం శ్రీహరి తన కూతురికి టికెట్ ఇప్పించుకోవడంలో సఫలం అయ్యారు. మొదట బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరి వరంగల్ నుండి పోటీ చేస్తున్నారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కడియం కాంగ్రెస్ పార్టీలో చేరడం సచలనంగా మారగా అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ పార్టీల ద్వితీయ శ్రేణి నాయకత్వం కూడా కావ్య అభ్యర్థిత్వంపై కినుక వహిస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యరంగంలోకి దించేందుకు కడియం శ్రీహరి ప్రత్యేకంగా శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీఆర్ఎస్ నాయకులు మాత్రం యూనిటీగా శ్రీహరి వారసురాలిని తొలి ప్రయత్నంలో చట్టసభకు పంపించాలన్న ప్రయత్నాలకు బ్రేకులు వేయాలని భావిస్తోంది. దీనికి తోడు ఇక్కడి నుండి బీజేపీ అభ్యర్థి అరూరి రమేష్ గతంలో బీఆర్ఎస్ పార్టీ నుండి రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేయడంతో గట్టిపోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో కడియం శ్రీహరి ఇంటా బయటా కూడా అనుకూలమైన వాతవారణం తయారు చేసుకుని కూతురును పార్లమెంటుకు పంపించాల్సి ఉంది. వ్యతిరేకతను సానుకూలంగా మల్చుకోవడం ఓ వైపు… మరో వైపున ప్రజా క్షేత్రంలో ప్రచారంలో దూసుకపోయే విధంగా ప్రణాళికలు రూపొందించాల్సిన ఆవశ్యకత మరోవైపు ఉంది. అన్నింటికన్న ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చిన తరువాత కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి పోటీ చేస్తున్న తీరుపై ప్రజల్లో జరుగుతున్న చర్చకు పుల్ స్టాప్ పెట్టాలంటే… ఓటర్లు సంతృప్తి పడే విధంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది.
టార్గెట్ రీచ్ అవుతారా..?
అటు పెద్దపల్లి, ఇటు వరంగల్ నియోజకవర్గాల్లో తండ్రులు ఇద్దరూ కూడా వారసులను చట్టసభకు పంపించేందుకు సవాళ్లు ఎదుర్కొంటున్నారే చెప్పాలి. అయితే పెద్దపల్లి విషయానికి వస్తే గడ్డం వంశీకి సొంత పార్టీ నుండి అంతా సెట్ అయిపోయినట్టుగానే కనిపిస్తోంది. మరోవైపున వెంకటస్వామి మనవడు అన్న బ్రాండ్ కూడా కొంత కలిసివచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయన ఏఢు సెగ్మెంట్లను కూడా కవర్ చేసేశారు. వరంగల్ విషయానికి వస్తే కావ్యను గెలిపించుకునేందుకు కడియం శ్రీహరి అన్నీ తానై వ్యవహరించాల్సిన అవశ్యకత ఏర్పడింది. ఇంకా అంతర్గతంగా నెలకొన్న అసమ్మతిని చల్లర్చడంతో పాటు ప్రత్యర్థి పార్టీల నాయకులు కావ్య ఓటమి కోసం చేస్తున్న ప్రయత్నాలను తిప్పి కొట్టాల్సి ఉంది. ఏది ఏమైనా ఈ రెండు నియోజకవర్గాల్లో వారసుల ఎంట్రీ లాంఛనాన్ని ఎవరు గ్రాండ్ సక్సెస్ చేస్తారో అంటే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.