పోలీసు విభాగంలో హాట్ టాపిక్…
దిశ దశ, హైదరాబాద్:
రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే పోస్టింగుల కోసం పైరవీలు మొదలయ్యాయి. ఇంతకాలం బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్న కొంతమంది పోలీసు అధికారులు లా అండ్ ఆర్డర్ పోస్టింగులు పొందేందుకు తమవంతు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టుగా తెలుస్తోంది. తాజా ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలను, మంత్రులను మచ్చిక చేసుకుని ప్రాధాన్యత ఉన్న పోస్టింగుల కోసం పైరవీలు స్టార్ట్ చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది.
మళ్లీ వారేనా..?
ఇంతకాలం లా అండ్ ఆర్డర్ పోస్టింగుల్లో ఉన్న కొంతమంది పోలీసు అధికారులు అప్పుడే ప్లేట్ ఫిరాయించినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఎన్నికల సమయంలోనే ప్రజల్లో కాంగ్రెస్ కు అనుకూల వాతావరణం నెలకొనడంతో పోలీసు అధికారులు గెలుపు గుర్రాల పంచన చేరినట్టుగా ప్రచారం జరగగా, కొంతమంది అధికారులు అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఎన్నికల్లో ఫండింగ్ కూడా చేశారన్న ప్రచారం గుప్పుమంటోంది. పోలీంగ్ కు ముందే తమ పోస్టుల గురించి అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న విషయం గురించి పోలీసు విభాగంలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఫలితాల తరువాత అయితే అధికార పార్టీ నాయకుల వద్దకు క్యూ కడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇంతకాలం ఆ పార్టీతో సాన్నిహిత్యంగా మెదిలి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ పార్టీ నాయకుల పంచన చేరుతున్న తీరు గురించే ఆ విభాగంలో హాట్ టాపిక్ నడుస్తోంది.
లూప్ లైన్ కే పరిమితమా..?
ఇకపోతే 9 ఏళ్లుగా అధికార పార్టీ నాయకులను మచ్చిక చేసుకోలేకపోయిన చాలా మంది పోలీసు అధికారులు లూప్ లైన్ పోస్టింగులకే పరిమితం అయ్యారు. సిఫార్సు లేఖల కోసం ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేయలేక… లా అండ్ ఆర్డర్ పోస్టింగులు అందుకోలేక మధనపడిపోయిన వారంతా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తమకు లాభం జరుగుతుందని ఆశించారు. సిఫార్సు లేఖల విధానానికి మంగళం పాడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యోచిస్తున్నారన్న విషయం తెలిసిన వెంటనే చాలా మంది పోలీసు అధికారుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈ సారి తమకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని భావించిన పోలీసు అధికారులకు తాజాగా నెలకొన్న పరిణామాలు వారిలో ఆందోళనకు గురి చేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా వారే ప్రాధాన్యత పోస్టింగులు పొందేందుకు తీవ్రంగా పైరవీలు చేస్తుండడమే వారి ఆవేదనకు కారణం. ఇప్పుడు కూడా వారే తాము అనుకున్న పోస్టింగులు పొందినట్టయితే ఇక తమకు న్యాయం జరిగే అవకాశం ఉండదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే తమ పరిస్థితి ఏమవుతుందోనని కలవరపడుతున్నారు.
ప్రాధాన్యత పోస్టింగులకు డిమాండ్…
అయితే ప్రాధాన్యత ఉన్న ప్రాంతాల్లో పోస్టింగుల కోసం పోలీసు అధికారులు పైరవీలు చేస్తున్నారన్న ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుండడంతో కొన్ని చోట్ల డిమాండ్ కూడా బాగా పెరిగిపోయినట్టుగా తెలుస్తోంది. ఒక్కో స్థానానికి ముగ్గురు నలుగురు పోలీసు అధికారులు కూడా పోస్టింగ్ కోసం ప్రయత్నాలు చేస్తుండడం కూడా అధికార పార్టీ నాయకులకు తలనొప్పిగా మారిపోయింది. వీరిని ఎలా సర్దుబాటు చేస్తారోనన్న అంశం గురించి కూడా చర్చ సాగుతున్న క్రమంలో ఇంతకాలం లూప్ లైన్ పోస్టింగులతోనే సరిపెట్టిన అధికారుల భవితవ్యం ఏంటన్నదే అంతుచిక్కకుండా పోయింది.