సినిమా ‘‘చెట్టు’’ పునరుజ్జీవం కోసం ప్రయత్నాలు…

దిశ దశ, సినిమా:

శతాబ్దంన్నర కాలం నాటి చెట్టు… శతాధిక సినిమా షూటింగులకు ఆశ్రయించిన ఆ చెట్టుకు పునరుజ్జీవం కల్పించే ప్రయత్నాలు సాగుతున్నాయి. గోదావరి నదిలో వచ్చిన వరదల కారణంగా నేలకూలిన ఈ చెట్టును మళ్లీ బ్రతికించాలని అధికారులు భావించారు. ఈ మేరకు క్షేత్ర స్థాయిలో పర్యటన చేసి పరిశీలించిన అధికార యంత్రాంగం ఈ నిద్ర గన్నేరు వృక్షానికి జీవం పోసే పనిలో నిమగ్నం అయింది. కొవ్వూరు మండలం కుమారదేవంలోని గోదావరి నది ఒడ్డున ఉన్న ఈ చెట్టు పరిసర ప్రాంతాల్లో వందకు పైగా సినిమా షూటింగులు జరిగాయి. ఆధునిక సాంకేతికతతో పాటు విదేశాల్లో మూవీలను తీసే సాంప్రాదాయానికి ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ చెట్టు గురించి సినీ పరిశ్రమ పట్టించుకోవడం మానేసింది. అయితే ఇటీవలే నేల వాలిన ఈ చెట్టు గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండడంతో రాజమహేంద్రవరం రోటరీ క్లబ్ ప్రతినిధులు దానికి జీవం పోసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. నేలకొరిగిన ఈ చెట్టును కలెక్టర్ పి ప్రశాంతి, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాస్తవ, జిల్లా అటవీ అధికారి నాగరాజులు పరిశీలించారు. కెమికల్ ట్రీట్ మెంట్ ద్వారా సినిమా చెట్టుకు జీవం పోయాలన్న యోచన చేస్తున్నారు. ఈ మేరకు రోటరీ క్లబ్ ఆప్ రాజమహేంద్రవరం ఐకాన్స్ చార్టర్ అధ్యక్షుడు రాజు ఈ చెట్టును తిరిగి బ్రతికించేందుకు శ్రమిస్తామని ప్రకటించారు.

You cannot copy content of this page