దిశ దశ, హుజురాబాద్:
అగ్రనేతలతో సాన్నిహిత్యంగా ఉండే అన్న పార్టీకి సారథ్యం వహిస్తున్న సమయంలో రథ సారథిగా వ్యవహరించాడు తమ్ముడు. ఆయన బాటలోనే నడవాలని తపించిన తమ్ముడు అసెంబ్లీలోకి అడుగుపెట్టలేకపోయాడు. ఆ తరువాత జరిగిన పరిణామాలతో పార్టీ మారి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. అయితే ఇప్పుడాయన ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాకే ఇంఛార్జి మంత్రిగా తన అగ్రజుడు నియమకం అయ్యారు. అధికార, ప్రతిక్ష నాయకులుగా ఉన్న వీరిద్దరు సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఎలా వ్యవహరిస్తారన్నదే హాట్ టాపిక్ గా మారింది.
ఉత్తమ్… కౌశిక్…
పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించి… ఇరిగేషన్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెల్చిన పాడి కౌశిక్ రెడ్డిలు ఇద్దరు కూడా అక్కా చెల్లెల్ల తనయులు. అయితే మొదట ఉత్తమ్ కుమార్ రెడ్డి అడుగు జాడల్లో నడిచిన పాడి కౌశిక్ రెడ్డి 2021 హుజురాబాద్ బై పోల్స్ సమయంలో పార్టీ ఫిరాయించాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీని వీడిన కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరి ఎమ్మెల్సీ అయి మండలిలో విప్ గా కూడా పని చేశారు. అయితే తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజుర్ నగర్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుండి గెలవగా, కౌశిక్ రెడ్డి హుజురాబాద్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచారు. రాష్ట్రంలో మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెల్చుకోవడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి అయ్యారు. అయితే తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాలకు ఇంఛార్జి మంత్రులను నియమించారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లాకు ఉత్తమ్ కుమార్ రెడ్డికి బాధ్యతలు అప్పగించడంతో జిల్లాలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. దీంతో జిల్లా పర్యటనల్లో భాగంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న కౌశిక్ రెడ్డి విషయంలో మంత్రి ఉత్తమ్ ఎలా వ్యవహరిస్తారు..? కౌశిక్ రెడ్డి స్పందన ఎలా ఉంటుంది అన్నదే చర్చనీయాంశంగా మారింది.
సంక్షేమ పథకాల విషయంలో…
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇవ్వకుండా జాగ్రత్త పడ్డారు. అధికార పక్షానికి చెందిన ప్రజా ప్రతినిధులే లబ్దిదారులకు చెక్కుల పంపణీ వంటి కార్యక్రమాలను నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఓడిపోయిన చోట కూడా నియోజకవర్గ ఇంఛార్జీలుగా తమ పార్టీ నేతలే ఉంటారని వారి ద్వారానే ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగుతాయని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు ఏ మాత్రం ప్రాధాన్యత లేకుండా ఉండే విధంగా వ్యవహరించింది కూడా. దీంతో ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు సొంత నియోజకవర్గాల్లో నామమాత్రంగా మిగిలిపోయారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో అప్పటి ప్రభుత్వం వ్యవహరించినట్టుగానే వ్యవహరిస్తుందా లేక సాధారణంగానే ఉంటుందా అన్న తర్జనభర్జనలు సాగుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల హుజురాబాద్ నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేయాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నప్పటికీ ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకోవల్సి వచ్చింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వ ప్రతినిధులైన ఉమ్మడి జిల్లా మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ల నిర్ణయానికి అనుగుణంగా పనిచేయాలి అధికారులకు దిశేనిర్దేశం జరిగింది. దీంతో సర్కారు చేయూతనందించే సంక్షేమ పథకాల విషయంలో ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందన్న సంకేతాలు ఇచ్చినట్టయింది. అయితే తాజాగా ఉమ్మడి జిల్లా ఇంఛార్జి మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి నియామకం కావడంతో సోదరుడు కౌశిక్ రెడ్డి విషయంలో ఆయన ఎలా వ్యవహరించబోతున్నారన్న అంశంపై చర్చలు మొదలయ్యాయి. ఇంఛార్జి మంత్రిగా సోదర ప్రేమ చూపిస్తారా లేక ప్రతిపక్ష ఎమ్మెల్యేగానే కౌశిక్ రెడ్డిని పరిగణిస్తారా అన్న విషయంపై రాజకీయవర్గాలు డిస్కషన్ చేసుకుంటున్నాయి. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా టూర్ చేపట్టిన తరువాత అసలు విషయం తెలుస్తుందని కొందరు అంటుంటే… పార్టీ లైన్ లోనే ముందుకు సాగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని మరి కొందరు అంటున్నారు. అయితే అసలు విషయం తేలడానికి మరికొన్ని రోజులు ఆగాల్సిందేనన్న అభిప్రాయాలూ వ్యక్తం చేస్తున్న వారూ లేకపోలేదు.