రక్షాబంధన్ కు బంధనాలు… అనుబంధానికి అడ్డు లేదు…

దిశ దశ, మంచిర్యాల:

సోదర, సోదరిమణుల అప్యాయతకు నిబంధనలు అడ్డువస్తే ఆగిపోతామా..? అందునా ఏటా ఓ సారి వచ్చే వేడుకకు అభ్యంతరాలు చెప్పినా వెనక్కి తగ్గుతామా..? అక్కలిద్దరూ గురుకులంలో చదువుతుంటే తమ్ముడికి రాఖీ కట్టేదెవరూ..? పెద్ద సారు వద్దన్నంత మాత్రాన వారి మధ్య అనురాగాన్ని పంచే వేడుకను జరుపుకునే తీరుతామని అనుకున్నారా తల్లిదండ్రులు. అంతే గురుకులంలో ఉన్న తమ బిడ్డల ఆశీర్వాదాలు తమ్ముడికి అందించాలని తపన పడి వారు ఎంచుకున్న మార్గం అందరిని ఆశ్చర్యపర్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో గురించి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. రక్త సంబంధాల మధ్య అనురాగాన్ని పెంచే రాఖీ పౌర్ణమి రోజున ఆడపడుచులు సోదరులకు రాఖీలు కట్టే సాంప్రాదాయం తరతరాలుగా సాగుతోంది. తమ పూర్వీకుల నుండి వచ్చిన ఈ ఆనవాయితీని నేటికీ ఆచరిస్తున్నారు. అయితే మంచిర్యాల జిల్లాలో రాఖీ పండుగ వేడుకలు జరుపుకునేందుకు ప్రిన్సిపల్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ తల్లిదండ్రులు పడిన తపన అంతా ఇంతా కాదు. బిడ్డలు దాసరి ఆశ్విక. సహస్రలు రామకృష్ణాపూర్ గురుకుల పాఠశాలలో చదువుకుంటున్నారని… వారి తరువాత పుట్టిన తమ్మడు జితేంద్రకు అక్కలచే రాఖీ కట్టించాలని నిర్ణయించారు. ఇందుకోసం పేరెంట్స్  జిల్లాలోని భీమారం నుండి ప్రత్యేకంగా రామకృష్ణాపూర్ కు చేరుకున్నారు. అయితే పాఠశాల ప్రిన్సిపల్ మాత్రం రాఖీ వేడుకలు జరుపుకునేందుకు అనుమతించలేదు. దీంతో ఆ తల్లిదండ్రులు తమ బిడ్డలు చదువుకుంటున్న తరగతి గది గురించి ఆరా తీసి కిటీకి వద్దకు చేరుకున్నారు. తమ కొడుకును భుజాలపై ఎత్తకున్న తండ్రి కిటికీ నుండే బిడ్డలచే రాఖీ కట్టించి స్వీటు తినిపించారు. ఆనవాయితీగా వస్తున్న రాఖీ పండగ వేడుకను జరుపుకోవల్సిందేనని నిర్ణయించుకున్న ఆ తల్లిదండ్రులు చిన్నారుల మనసుల్లో అనురాగాన్ని పెంచి పోషించేందుకు శ్రమించిన తీరు అందరినీ అబ్బురపరిచింది. పాఠశాల ప్రిన్సిపల్ పర్మిషన్ ఇవ్వకపోయినా రాఖీ కట్టించి తీరాలని భావించిన పేరెంట్స్ తీసుకున్న చొరవపై నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. సోషట్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోపై గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ తీరుపై విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.

You cannot copy content of this page