దిశ దశ, సిద్దిపేట:
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో మరో అరుదైన రికార్డు చోటు చేసుకుంది. దేశంలో అతి ఎక్కువ సార్లు పోటీ చేసిన వ్యక్తి ఇక్కడ బరిలో నిలుస్తున్నాడు. ఎలక్షన్ కింగ్ ఈ సారి ముఖ్యమంత్రిపై పోటీ చేసేందుకు నామినేషన్ వేశారు. తమిళనాడులోని సేలంకు చెందిన పద్మ రాజన్ (66) దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా అక్కడ పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఇప్పటి వరకు 236 ఎన్నికల్లో పోటీ చేసిన పద్మ రాజన్ గజ్వేల్ లో నామినేషన్ వేయడం విశేషం. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా పోటీ చేసేందుకు ఆసక్తి చూపే పద్మ రాజన్ ప్రత్యేకంగా ఈ సారి గజ్వేల్ పై దృష్టి సారించడం విశేషం. మొత్తం 237 సార్లు పోటీ చేసిన పద్మ రాజన్ హోమియో వైద్యుడు కాగా ఆయన పేరు ఇప్పటికే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో నమోదు అయింది.
రికార్డుల స్పెషలిస్ట్…
దేశంలో జరిగిన అతి ఎక్కువ ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తిగానే కాకుండా పద్మరాజన్ అతి ఎక్కువ సార్లు ఓడిపోయిన చరిత్ర కూడా సొంతం చేసుకున్నారు. ఇప్పటి వరకు ఆయన ఐదు రాష్ట్రపతి, ఐదు ఉప రాష్ట్రపతి, 32 లోక సభ, 50 రాజ్య సభ, 72 అసెంబ్లీ, 3 ఎమ్మెల్సీ, ఒక మేయర్, 3 ఛైర్మన్, 4 పంచాయితీ అధ్యక్షుల, 12 కౌన్సిలర్, 2 జిల్లా కౌన్సిలర్, 3 యూనియన్ కౌన్సిలర్, 6 వార్డు మెంబర్ ఎన్నికల్లో పోటీ చేసి దేశంలోని అత్యంత అరుదైన రికార్డు అందుకున్నారు.
ప్రముఖులపైనే…
పద్మ రాజన్ ప్రముఖులు పోటీ చేసిన స్థానాల్లోనే బరిలో నిలవడంలోనూ వెనుకంజ వేయరు. తమ రాష్ట్రానికే పరిమితమైన ఎన్నికలే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగే ప్రతి ఎన్నికలోనూ ఆయన బరిలో నిలిచేందుకు మొగ్గు చూపుతుంటారు. రాష్ట్రపతి అభ్యర్థులుగా పోటీ చేసిన కేఆర్ నారాయణన్, ఏపీజే అబ్దుల్ కలాం, ప్రతిభా పాటిల్, ప్రణభ్ ముఖర్జీలపై పోటీ చేశారు. ప్రధానులుగా బాధ్యతలు నిర్వర్తించిన పివి నరసింహరావు, అటల్ బిహారీ వాజపేయి లపై కూడా పోటీ చేసిన చరిత్ర పద్మ రాజన్ దక్కించుకున్నారు. అలాగే తమిళనాడుకు చెందిన ప్రముఖ నేతలు కరుణా నిధి, జయలలిత, ఫళని స్వామి, స్టాలిన్, కర్ణాటకకు చెందిన ఎస్ఎం కృష్ణ, యాడ్యూరప్పలపై పోటీ చేశారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై కూడా పోటీ చేసిన చరిత్ర ఆయనకు ఉంది. దేశంలోనే ప్రముఖులపై పోటీ చేసి చరిత్ర సృష్టించిన పద్మ రాజన్ కు ఆల్ ఇండియా ఎలక్షన్ కింగ్ అనే బిరుదు కూడా ఇచ్చారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై పోటీ చేసేందుకు నామినేషన్ వేసిన పద్మ రాజన్ తొలిసారి తెలంగాణ ఎన్నికల్లోకి ఎంట్రీ ఇచ్చారు.