దిశ దశ, ఏపీ బ్యూరో:
తెలంగాణాలో జరిగిన ఎన్నికలు పొరుగు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిపోయాయి. రాష్ట్రంలో ఎవరు గెలుస్తారానన్న అంశం అక్కడ ప్రధాన చర్చనీయాంశంగా మారింది. మరో రెండు రోజుల్లో వెలువడనున్న ఎన్నికల ఫలితలకు ముందే ఏపీ అంతటా బెట్టింగ్ సాగుతోంది. రాష్ట్రంలో కారు షికారు చేస్తుందా..? చేయికి చేయూత నిచ్చారా అన్న విషయంపై ఆంధ్రప్రదేశ్ అంతటా తర్జనభర్జనలు సాగుతున్నాయి.
ఒకటికి పది… పదికి వంద…
గత వారం రోజులుగా ఆంధ్ర రాష్ట్రమంతా కూడా బెట్టింగులు సాగుతున్నాయి. ఒకటికి పది… పదికి వంద అంటూ పందెం కాస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి చోట కూడా తెలంగాణ ఎన్నికల గురించే బెట్టింగ్ కాస్తున్న పరిస్థితి తయారైంది. తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కొందరు, కారు హ్యాట్రిక్ కొడుతుందని మరి కొందరు బెట్టింగ్ వేసుకుంటున్నారు. ఈ వ్యవహారం కేవలం పట్టణాలకే పరిమితం కాకుండా మండలాలు, చిన్న చిన్న టౌన్లలోనూ పందెం కాస్తున్నారంటే తెలంగాణ ఎన్నికల గురించి ఏపీలో ఏ స్థాయిలో చర్చ సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. వందల కోట్ల రూపాయల్లో ఈ బెట్టింగులు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. పోలింగ్ ముగిసిన తరువాత అయితే బెట్టింగ్ మరింత తీవ్రంగా పెరిగినట్టుగా తెలుస్తోంది. కొన్ని చోట్ల అయితే రూపాయికి వంద రూపాయల బెట్టింగ్ కూడా సాగుతున్నట్టుగా ప్రచారం సాగుతోంది.
ఫోన్లే ఫోన్లు…
ఇకపోతే ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణాకు వస్తున్న ఫోన్ కాల్స్ కూడా తీవ్రంగా పెరిగిపోయాయి. నేరుగా పరిచయం ఉన్నవారితో రెగ్యూలర్ గా మాట్లాడుతూ… బెట్టింగ్ ను క్రమక్రమంగా పెంచుకుంటూ పోతున్నారని సమాచారం. ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్ లోని వారికయితే వేల సంఖ్యలో ఫోన్లు వస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడి పరిస్థితులను అంచనా వేసుకంటున్న పందెం రాయుళ్లు ఎప్పటికప్పుడు బెట్టింగ్ ను మరింత పెంచుకుంటూ పోతున్నట్టుగా తెలిసింది.
కారణం అదేనా…?
అయితే తెలంగాణాలో జరుగుతున్న ఎన్నికల ఫలితాల ఆదారంగా ఏపీలో వచ్చే ప్రభుత్వం ఏదో డిసైడ్ అయిపోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఏపీలో రెండో సారి వైఎస్ జగన్ అధికారంలోకి వస్తారా లేక చంద్రబాబు నాయుడు సీఎం అవుతారా అన్న విషయం తేలాలంటే తెలంగాణాలో వచ్చే ప్రభుత్వంపై ఆధారపడి ఉందన్న చర్చలు కూడా సాగుతున్నాయి. తెలంగాణాలో కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వచ్చినట్టయితే ఏపీలో వైసీపీ ప్రభుత్వమే కొనసాగుతుందని, కాంగ్రెస్ వచ్చినట్టయితే టీడీపీ అధికారంలోకి వస్తుందన్న ప్రచారం కూడా ఊపందుకుంది. ఈ కారణంగానే తెలంగాణ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ జోరుగా సాగుతున్నట్టుగా సమాచారం.