దిశ దశ, దండకారణ్యం:
ప్రశాంతంగా ఉన్న అటవీ ప్రాంతం అల్లకల్లోలంగా మారిపోయింది. కీకారణ్యాల్లోకి ఏనుగుల గుంపు వచ్చి చేరడంతో అక్కడి జనం భయం గుప్పిట జీవనం సాగిస్తున్నారు. అడవులతో మమేకమై జీవనం సాగిస్తున్న వారి పరిస్థితి మరీ దయనీయంగా మారింది. పూరి గుడిసెల్లో కాలం వెల్లదీసే సగటు జీవులపై ఏనుగులు ఎప్పుడు వచ్చి పడతాయోనన్న ఆందోళన మొదలైంది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో గజ రాజులు గజగజ వణికిస్తున్నాయి. జిల్లాలోని ఆర్మోరి, ఖుర్కెడ, ధానోరా, దేశాయి గంజ్ తాలుకా అటవీ ప్రాంతాల్లో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తోంది. ఒడిశా అటవీ ప్రాంతం నుండి చత్తీస్ గడ్ మీదుగా ఓ ఏనుగుల గుంపు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అటవీ ప్రాంతంలోకి ప్రవేశించినప్పటి నుండి అటు అటవీ అధికారులకు, ఇటు అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి కంటిమీద కునుకు లేకుండా పోయిందనే చెప్పాలి. పంట పొలాలను నాశనం చేయడంతో పాటు స్థానికులపై దాడులు చేస్తుండడంతో అటవీ శాఖ అధికారులు గజ రాజుల గుంపును పారదోలేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. శనివారం అటవీ ప్రాంతంలో గస్తీ చేసేందుకు వెళ్లిన అటవీ శాఖ ఉద్యోగి ఆత్రం హరిదాస్ (45)పై ఏనుగు దాడి చేసి హతమార్చాయి. పడాస్ గావ్, దొంగర్ గావ్ రోడ్డు మీదుగా వాహనంపై ఆత్రం హరిదాస్ డ్యూటీకి వెళ్లి వస్తుండగా రోడ్డుకు అడ్డంగా ఉన్న ఏనుగుల గుంపు అతని వాహనాన్ని ధ్వంసం చేసి హరిదాస్ ను తొక్కి చంపేశాయి. దీంతో అటవీ శాఖ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న వారు ఏనుగుల భయానికి కర్రలతో పాటు ఇతరాత్ర ఆయుధాలను వెంట తీసుకుని వెళ్లాల్సి వస్తోంది. ఇంతకాలం వన్య ప్రాణుల నుండి ఎలాంటి ముప్పు ఎదుర్కొని అటవీ గ్రామాల ప్రజలను ఇప్పుడు ఒడిశా గజ రాజులు గజగజలాడిస్తున్నాయి. వీటిని ఇక్కడి అటవీ ప్రాంతం నుండి పంపించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఆయా ప్రాంతాల వాసులు వేడుకుంటున్నారు.