KARIMNAGAR BRS PARTY: పార్టీకి దూరం… పదవితోనే బంధం… అంతుచిక్కని ప్రథమ పౌరుని అంతరంగం…

బీఆర్ఎస్ పార్టీలో తర్జనభర్జన…

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీలో సరికొత్త చర్చ మొదలైంది. ఏ కార్యక్రమంలో అయినా ఖచ్చితంగా కనిపించే ఆ ఇద్దరు లీడర్లలో ఒకరు దూరం దూరంగా ఉంటున్నారు. ఉన్నట్టుండి ఆయనలో ఈ మార్పు రావడానికి కారణమేంటన్నదే అంతుచిక్కకుండా పోయింది.

సర్వత్రా చర్చ…

కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్ రావు కార్యకలాపాలను గమనిస్తున్న పార్టీ శ్రేణులు తర్జన భర్జనలో కొట్టుమిట్టాడుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఎమ్మెల్యే తరువాత అన్నీ తానై నడిపించిన ఆయన ఇప్పుడు పార్టీ కార్యకలాపాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారన్నదే మిస్టరీగా మారిపోయింది. మేయర్ అభ్యర్థి ప్రకటన విషయంలో అందరినీ కాదని సునీల్ రావుకు అండగా నిలిచిన పార్టీలోని ముఖ్య నాయకులను కూడా పట్టించుకోకపోవడం కార్యకర్తలను విస్మయ పరుస్తోంది. అప్పుడు గంగుల కమలాకర్ తన సన్నిహితుడు రాజేందర్ రావుకు మేయర్ పదవి కట్టబెట్టాలని ముమ్మరంగా ప్రయత్నించగా, సిట్టింగ్ మేయర్ గా ఉన్న సర్దార్ రవిందర్ సింగ్ కూడా కేసీఆర్ ఆశీస్సులు ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు. కానీ పార్టీ ముఖ్య నేత బోయినపల్లి వినోద్ కుమార్ పట్టుబట్టి మరీ సునీల్ రావును మేయర్ కుర్చిలో కూర్చోబెట్టడంలో సఫలం అయ్యారు. ఆ తరువాత గంగుల కమలాకర్ తో కలిసిపోయే ప్రయత్నం చేయడంతో ఆయన కూడా మద్దతునిచ్చారు. ఇద్దరు కూడా పార్టీ కార్యకలాపాలే అయినా, ప్రభుత్వ వ్యవహారాలే అయినా అన్నింటా కలిసి పనిచేసుకోవడంతో అంతా సవ్యంగానే ఉందని అనుకున్నారు.

సన్నిహితునితో…

అయితే సునీల్ రావుకు బాసటగా నిలుస్తూ తనకు అన్యాయం చేస్తున్నారని డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప హరిశంకర్ కూడా మదనపడ్డ సందర్భాలు లేకపోలేదు. గంగులకు కుడి భుజంగా ఉన్న తనపట్ల వివక్ష చూపుతున్నారన్న ఆవేదన కూడా వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇటీవల మేయర్ సునీల్ రావు అమెరికాకు వెల్లినప్పుడు ఫిర్యాదుల పరంపర కొనసాగిన సంగతి తెలిసిందే. మునిసిపల్ నిబంధనలకు విరుద్దంగా విదేశాలకు వెల్లడంతో పాటు ఆయన రిటర్న్ టికెట్ తీసుకున్న తేదీల వివరాలను కూడా వెల్లడించి డిప్యూటీ మేయర్ కు ఇంఛార్జి బాధ్యతలు అప్పగించకుండా వెల్లిపోయారన్న విషయంపై రసాభసా సాగింది. ఈ అంశంపై మొదట మార్షల్ ఫిర్యాదు చేయగా, ఆ తరువాత చల్ల హరిశంకర్ కూడా ఫిర్యాదు చేయడంతో పాటు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఈ అంశంలో గంగుల కమలాకర్ ‘చల్ల’నే తప్పు పట్టినట్టుగా పార్టీ శ్రేణులు చెవులు కొరుక్కున్నాయి. ఎమ్మెల్యే తనకు కాకుండా సునీల్ రావుకే మద్దతు ఇస్తున్నారేంటని సనిహితులు వద్ద చల్ల దంపతులు మదనపడ్డ సందర్బాలు కూడా ఉన్నాయి. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే పార్టీతో అంటీ ముట్టనట్టుగా మేయర్ వ్యవహరిస్తున్న తీరు అంతుచిక్కకుండా పోయిందని పార్టీ వర్గాలు అంటున్నాయి.

కార్యక్రమాలకు దూరం…

ఇటీవల పార్టీ తరుపున చేపట్టిన చాలా కార్యక్రమాలకు మేయర్ సునీల్ రావు దూరంగా ఉంటున్నారన్న విషయం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ అధిష్టానం ఇచ్చిన రైతు ధర్నాకు హాజరు కాకపోగా, తెలంగణా తల్లి విగ్రహానికి పాలభిషేకం కార్యక్రమానికి కూడా ఆయన దూరంగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో గాడ్ ఫాదర్ గా ఉన్న మాజీ ఎంపీ వినోద్ కుమార్ పర్యటించినా కూడా సునీల్ రావు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విషయంలో కూడా సునీల్ రావు దూరందూరంగానే ఉన్నారని, గంగుల మీడియా సమావేశంలో కనిపించకపోగా, సోమవారం రాత్రి పోలీస్ స్టేషన్ వద్దకు కూడా రాలేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఒకవేళ ఏదైనా ఆందోళనల్లో పాల్గొన్నా పార్టీ కండువా వేసుకోకుండానే కనిపిస్తున్నారు. దీంతో అసలు సునీల్ రావు ఎందుకిలా వ్యవహరిస్తున్నారన్న విషయంపై పార్టీ శ్రేణులు డిస్కషన్ చేసుకుంటున్నాయి. అయితే మేయర్ హోదాలో బల్దియా పరిధిలో జరుగుతున్న అధికారిక కార్యక్రమాలకు హాజరవుతున్న ఆయన పార్టీ ప్రోగ్రామ్స్ కు మాత్రం టచ్ మీ నాట్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. మరో్వైపున గంగుల కమలాకర్ కూడా సునీల్ రావు దూరంగా ఉంటున్న విషయాన్ని సీరియస్ గా తీసుకోకపోవడం పట్ల కూడా పార్టీ వర్గాల్లో విస్మయం వ్యక్తం అవుతోంది. తన అనుచరులు ఎవరైనా ఇలాగే వ్యవహరిస్తే ఆగ్రహంతో ఊగిపోయే ఎమ్మెల్యే సునీల్ రావు విషయాన్ని లైట్ గా ఎందుకు తీసుకుంటున్నారన్నది అంతుచిక్కకుండా పోతోందని బీఆర్ఎస్ నాయకులు కామెంట్ చేస్తున్నారు. నిన్నమొన్నటి వరకు ఎంపీగా, రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు విమర్శనాస్త్రాలు సంధించడంలో ముందు వరసలో ఉన్న మేయర్ సునీల్ రావు ఆయన కేంద్ర మంత్రి కాగానే పలుమార్లు వెల్లి కలుస్తుండడంతో అసలేం జరుగుతోందన్న విషయంపై కూడా పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

You cannot copy content of this page