ENC అక్రమ ఆస్తుల చిట్టా ఇదే… ACB దాడులతో వెలుగులోకి…

దిశ దశ, హైదరాబాద్:

తెలంగాణ అవినీతి నిరోధక విభాగం అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక బాధ్యతల్లో పని చేసి, ప్రస్తుతం గజ్వేల్ నీటిపారుదల ENCగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న భూక్యా హరి రామ్ పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. ఏక కాలంలో 14 ప్రాంతాల్లో సోదాలు చేపట్టిన ఏసీబీ బృందాలు స్థిర, చరాస్థులను గుర్తించారు. శనివారం ఉదయం నుండి ప్రారంభం అయిన దాడులు రాత్రి వరకూ కొనసాగాయి. అనంతరం ENC హరి రామ్ ను ఆధాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ చేస్తున్నామని తెలంగాణ ఏసీబీ అధికారులు ప్రకటించారు.

వివరాలివే…

హరి రామ్ ఇంటితో పాటు ఆయన బంధువులకు సంబంధించిన 13 ప్రాంతాల్లో దాడులు నిర్వహించిన ఏసీబీ అధికారులు రెండు ఇండ్లు, షేక్ పేట, కొండాపూర్ లలో రెండు విల్లాలు, నిర్మాణంలో ఉన్న ఓ భవనం, రెండు ఓపెన్ ప్లాట్లు, 28.5 ఎకరాల వ్యవసాయ భూమి, ఫార్మ్ హౌజ్ నిర్మించుకున్న 6 ఎకరాల మామిడి తోట, ఏపీలోని అమరావతితో పాటు మరోచోట వాణిజ్య స్థలాలు, ఒక బీఎండబ్లూ వాహనంతో పాటు మరో వాహనం, బ్యాంకు నిల్వలు, బంగారు ఆభరణాలను గుర్తించినట్టుగా ఏసీబీ అధికారులు తెలిపారు. మార్కుక్, కొత్తగూడెం, కుత్బుల్లాపూర్, మిర్యాలగూడ, గాజుల రామారం, శ్రీనగర్, నార్సింగి, మాదాపూర్ వంటి అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో హరి రామ్ ఆస్తులను గుర్తించినట్టుగా తెలుస్తోంది.

ఇంజనీర్లలో దడ..?

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములు అయిన ఇంజనీరింగ్ అధికారులపై తెలంగాణ ఏసీబీ దృష్టి సారించడం సంచలనంగా మారింది. మేడిగడ్డ 7వ బ్లాకులో పిల్లర్లు కుంగిపోవడంతో NDSA రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ నేఫథ్యంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో నీటి నిలువలు ఉచకూడదని ఆదేశించిన ఎన్డీఎస్ఏ నిపుణులు ఇచ్చిన నివేదిక వెలుగులోకి వచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. కాళేశ్వరం వైఫల్యాలను ఎత్తి చూపుతూ ఇచ్చిన ఈ నివేదికపై మీడియాలో కథనాలు వస్తున్న క్రమంలోనే ఏసీబీ దాడులు చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఏకంగా ఈఎన్సీపైనే ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేయడంతో ఏసీబీ వద్ద ఉన్న చిట్టాలో ఎవరెవరి పేర్లు ఉన్నాయోనన్న చర్చ ఇరిగేషన్ విభాగంలో జరుగుతోంది. 3 లింకుల ద్వారా వివిధ స్థాయిలలో నిర్మాణం చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఇరిగేషన్ ఇంజనీర్లు సేవలు పెద్ద ఎత్తున వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరిగేషన్ ఉన్నతాధికారులు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములు అయ్యారు. అయితే ప్రాజెక్టు నిర్మాణంలో భారీగా అవకతవకలు జరిగాయిని ఆరోపణలు వచ్చినప్పటికీ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఎంలాంటి చర్యలు మాత్రం తీసుకోలేదే. జస్టిస్ ఘోష్ కమిషన్ ద్వారా కాళేశ్వరం అక్రమాలపై ప్రభుత్వం విచారణ చేయిస్తున్నది. ఈ కమిషన్ ఇచ్చే తుది నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయని భావించినప్పటికీ ఊహించని విధంగా ఈఎన్సీ హరి రామ్ పై అక్రమ ఆస్తుల కేసు నమోదు అయింది. దీంతో ఏసీబీ మరింతమంది ఇంజనీర్లపై దాడులు చేసే అవకాశాలు ఉంటాయన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. హరిరామ్ ఆస్తుల డాటా సేకరించినట్టుగానే ఏసీబీ అధికారులు మిగతా ఇంజనీర్ల ఆస్తుల వివరాలను సేకరించి ఉంటారన్న చర్చ అయితే సాగుతోంది. ఈఎన్సీ హరిరామ్ ఎపిసోడ్ ముగిసిన తరువాత కానీ ముందు కానీ దాడులు చేసేందుకు ఏసీబీ రంగం సిద్దం చేసుకుని ఉంటుందన్న ఆందోళన అయితే అవినీతికి పాల్పడిన వారిలో వ్యక్తం అవుతున్నట్టుగా తెలుస్తోంది.

You cannot copy content of this page