దిశ దశ, దండకారణ్యం:
చత్తీస్ గడ్ లోని దండకారణ్య అటవీ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వరసగా జరుగుతున్న ఎదురు కాల్పుల ఘటనలతో అభూజామడ్ ప్రాంతం అంతా కూడా భయాంధోళన నెలకొంది. ఛోటేబేథియా అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో 29 మంది మావోయిస్టులు మరణించిన ఘటన మరవక ముందే మరో ఎన్ కౌంటర్ ఘటన చోటు చేసుకోవడం ఆందోళన కల్గిస్తోంది. లోకసభ ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు పార్టీని కట్టడి చేసేందుకు భారీగా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో్నే వరస ఘటనలు చోటు చేసుకుంటున్నట్టుగా సమాచారం. తాజాగా మంగళవారం నారాయణపూర్, కంకేర్ జిల్లాల సరిహద్దుల్లో డీఆర్జీ, ఎస్టీఎఫ్ జవాన్లు కూంబింగ్ చేపట్టాయి. ఉధయం 6 గంటల ప్రాంతంలో టెక్మెటా, కాకూర్ గ్రామాల అడవుల్లో ఎదురు కాల్పులు జరిగినట్టుగా అక్కడి పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మొత్తం ఏడుగురు నక్సల్స్ చనిపోగా ఇద్దరు మహిళా నక్సల్స్ ఉన్నట్టుగా వివరించారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతం నుండి ఒక ఏకె 47తో పాటు మందుగుండు సామాగ్రి, నిత్యవసర సరుకులు స్వాధీనం చేసుకున్నారు. అటవీ ప్రాంతంలో సెర్చింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగిస్తున్నట్టుగా పోలీసు వర్గాల సమాచారం. ఎదురు కాల్పుల్లో మరణించిన నక్సల్స్ ను గుర్తించే పనిలో నిమగ్నం అయినట్టుగా పోలీసులు వివరించారు.