బీజాపూర్ జిల్లాలో బలగాల కూంబింగ్
దిశ దశ, దండకారణ్యం:
చత్తీస్ గడ్ లోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ ఫారెస్ట్ ఏరియాలో మళ్లీ ఎదురు కాల్పులు జరుగుతున్నట్టుగా సమాచారం. శనివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేత కోసం కూంబింగ్ నిర్వహిస్తున్న బలగాలకు, మావోయిస్టు పార్టీ నక్సల్స్ తారసపడడంతో ఎన్ కౌంటర్ జరుగుతున్నట్టుగా ప్రాథమికంగా తెలుస్తోంది. ఇంద్రావతి నది పరివాహ ప్రాంతంలోని భైరమ్ గడ్ సమీపంలో ఎస్టీఎఫ్, సీఆర్పీఎఫ్, డీఆర్జీ బలగాలు జాయింట్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. బీజాపూర్ ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో జరుగుతున్న ఎదురు కాల్పుల ఘటనను పర్యవేక్షిస్తున్నట్టుగా సమాచారం. ఇప్పటికే పలు మార్లు ఎదురు కాల్పులు జరగగా నక్సల్స్ ఏరివేతలో భాగంగా బలగాలు అటవీ ప్రాంతంలో సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ఎదురు కాల్పుల ఘటనపై పోలీసు అధికారులు మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.