అటు పారా మిలటరీ… ఇటు సి60 బలగాల ఆపరేషన్…

దండకారణ్యంలో నక్సల్స్ ఏరివేత కోసం ప్రత్యేక వ్యూహం…

వానాకాలంలో వనాల నడుమ కొనసాగుతున్న కూంబింగ్

దిశ దశ, దండకారణ్యం:

వానాకాలం ప్రారంభం అయినా దండకారణ్యంలో మావోయిస్టుల ఏరివేత చర్యలు మాత్రం ఆగడం లేదు… వేసవి కాలం దాటే వరకూ స్వీయ రక్షణ చర్యలు తీసుకుంటే ఏడాది వరకు సేఫ్ గా జీవించవచ్చన్న నక్సల్స్  అంచనాలను తారుమారు చేస్తున్నాయి బలగాలు. చత్తీస్ గడ్, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో విస్తరించిన దండకారణ్య అటవీ ప్రాంతంలో వేళ్లూనుకున్న మావోయిస్టు పార్టీని ఏరివేసేందుకు బలగాలు కీకారణ్యాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. అయితే ఆకు రాలే కాలం అయిన ఎండకాలంలో బలగాల కంట పడకుండా సేఫ్ జోన్ లో ఉంటే చాలని భావించినప్పటికీ వానాకాలం కూడా వారిని కోసం  వేటకొనసాగిస్తున్నట్టుగానే కనిపిస్తోంది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఇరు రాష్ట్రాలు చేపట్టిన జాయింట్ ఆపరేషన్లతో మావోయిస్టులు తీరని నష్టాన్ని చవి చూస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలోని గడ్చరోలి జిల్లా వన్డోలి అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మరణించినట్టు పోలీసులు వెల్లడించారు. బుధవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో వన్దోలి అటవీ ప్రాంతంలో సి60 బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టగా మద్యాహ్నం ప్రాంతంలో మావోయిస్టులు తారసపడడంతో సాయంత్ర 6 గంటల వరకు ఎదురుకాల్పులు కొనసాగాయని తెలిపారు. చత్తీస్ గడ్ సరిహద్దుల్లో మావోయిస్టులు సమావేశం అయ్యారన్న సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు సి 60 బలగాలచే గాలింపు చర్యలు చేపట్టిన క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసు అధికారులు వివరించారు. ఈ ఎన్ కౌంటర్ లో తిప్పగడ్డ దళ ఇంఛార్జి డీవీసీఎం లక్ష్మణ్ ఆత్రం అలియాస్ విశాల్ కూడా ఉన్నాడని పోలీసు వర్గాలు ధృవీకరించాయి. ఎదురు కాల్పుల్లో సీ 60 బెటాలియన్ కు చెందిన పీఎస్సై సతీష్ పాటిల్ తో పాటు మరో జవానుకు గాయాలు కాగా ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం హెలిక్యాప్టర్ ద్వారా వారిని నాగపూర్ కు తరలించారు. ఘటనా స్థలం నుండి 12 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని, ఏడు ఆధునిక ఆయుధాలు స్వాధీనం చేసుకన్నామని వీటిలో మూడు ఎకె 47, రెండు ఇన్సాస్, ఒక కార్బైన్, ఒక ఎస్ఎల్ఆర్ లు ఉన్నాయని తెలిపారు. గడ్చిరోలి జిల్లా అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ పై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ స్పందించారు. రాష్ట్ర సరిహద్దుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో 12 మంది మావోయిస్టులు చనిపోయారని ప్రకటించారు. ఈ ఎదురు కాల్పుల్లో పాల్గొన్న బలగాలకు రూ. 51 లక్షలు రివార్డు ప్రకటించారు. మృతుల్లో ఏడుగురు పురుషులు, ఐదుగురు మహిళలు ఉన్నట్టుగా సమాచారం. ఎన్ కౌంటర్ లో మరణించిన నక్సల్స్ ను గుర్తించినట్టుగా గడ్చిరోలి జిల్లా ఎస్పీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. మరణించిన వారిలో ఛోటగావ్ కసనాసూర్ ఎల్ఓఎస్ డీవీసీఎం యోగేష్ తుల్వి, కొర్చి, తిప్పగడ్డ ప్రాంత డీవీసీఎం లక్ష్మణ్ ఆత్రం అలియాస్ విశాల్, తిప్పగడ్డ ఏరియా ఇంఛార్జి ప్రమోద్ కచలామి, కసనాసూర్ డిప్యూటీ కమాండర్ మహ్రూ గవ్డే, తిప్పగడ్డ డిప్యూటీ కమాండర్ అనిల్ దారో, ఏసీఎం బిజు, సరిత పస్రా, రాజో, రోజా, సాగర్, చాందా, సీతా హవ్కే, సాగర్ లు ఉన్నారని పోలీసులు వివరించారు.

చత్తీస్ గడ్ లో పేలిన మందుపాతర…

మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టులు మరణించిన ఘటన నుండి తేరుకోకముందే చత్తీస్ గడ్ లో మందుపాతర పేలింది. సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న బలగాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు ఈ ఘటనకు పాల్పడినట్టుగా భావిస్తున్నారు. బీజాపూర్, దంతెవాడ, సుక్మా జిల్లాల సరిహద్దు ప్రాంతంలో దర్బా డివిజన్, వెస్ట్ బస్తర్ ఫారెస్ట్ ఏరియాలో బలగాలు జాయింట్ ఆపరేషన్ నిర్వహించాయి. కూంబింగ్ ఆపరేషన్ తరువాత తిరుగు ప్రయాణం అయిన బలగాలపై టెర్రమ్ అడవుల్లో మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో ఇద్దరు ఎస్టీఎఫ్ జవాన్లు మృత్యవాత పడగా, నలుగురు గాయాలపాలయ్యారు. మరణించిన వారిలో నారాయణపూర్ కు చెందిన భతర్ సాహూ, సత్యర్ సింగ్ కంగే ఉన్నారు. గాయపడిన జవాన్లకు ప్రాథమిక చికత్స అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని బస్తర్ పోలీసు అధికారులు వివరించారు.

You cannot copy content of this page