ఒడిషా, చత్తీస్ గడ్ సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్
20 మంది మావోయిస్టు పార్టీ నక్సల్స్ మృతి
దిశ దశ, దండకారణ్యం:
దండకారణ్యంలో కాల్పుల మోత మారుమోగింది. చత్తీస్ గడ్, ఒడిషా సరిహద్దు అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో మావోయిస్టు పార్టీ భారీ నష్టాన్ని చవి చూసింది. ఇప్పటి వరకు 18 మంది నక్సల్స్ మరణించినట్టుగా ఒడిషా పోలీసు అధికారులు ప్రకటించారు.ఈ ఎన్ కౌంటర్ లో ముఖ్య నాయకులు మరణించినట్టుగా పోలీసు వర్గాలు చెప్తున్నాయి. కేంద్ర కమిటీ సభ్యుడు రామచంద్రా రెడ్డి అలియాస్ ప్రతాప్ రెడ్డి, అలియాస్ అప్పారావు అలియాస్ రవి అలియాస్ రవి అలియాస్ చలపతి అలియాస్ జయరాం మరణించినట్టుగా ఒడిషా పోలీసు అధికారులు ప్రకటించారు.
నువాపాడ, గరియాబంద్ సరిహద్దుల్లో
ఒడిషా, చత్తీస్ గడ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు భారీ ఎత్తున షెల్టర్ తీసుకుని ఉన్నారన్న సమాచారం అందుకున్న రెండు రాష్ట్రాల బలగాలు అప్రమత్తం అయ్యాయి. జనవరి 19వ తేదిన చత్తీస్ గడ్, ఒడిషా రాష్ట్రాలకు చెందిన బలగాలు జాయింట్ ఆపరేషన్ కు శ్రీకారం చుట్టాయి. ఒడిషాలోని నువాపాడ జిల్లా సమీపంలోని 5 కిలో మీటర్ల దూరంలో కీకారణ్యాలు విస్లరించి ఉన్నాయి. చత్తీస్ గడో లోని గరియాబంద్ జిల్లా కులారిఘాట్ రిజర్వూ ఫారెస్ట్ ఉంటుంది. రెండు రాష్ట్రాల సరిహధ్దు ప్రాంతాలు కావడంతో పాటు దట్టమైన అడవులు విస్తరించి ఉండడంతో మావోయిస్టు పార్టీ ముఖ్య నాయకత్వం ఇక్కడ డెన్ ఏర్పాటు చేసుకుని ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ సమాచారం అందుకున్న రెండు రాష్ట్రాల బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో ఎదురు కాల్పులు జరగగా ఇద్దరు మహిళా నక్సల్స్ చనిపోగా, ఒక SLR ఆయుధంతో పాటు మందుగుండు సామాగ్రి, బ్లాస్టింగ్ మెటిరియల్ ను స్వాధీనం చేసుకున్నారు. కూంబింగ్ పార్టీలు అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు ముమ్మరం చేయడంతో మంగళవారం తెల్లవారు జామున మరోసారి ఎదురు కాల్పులు ప్రారంభం అయ్యాయి. ఈ ఘటనలో 18 మంది మావోయిస్టులు మరణించినట్టుగా ఒడిషా పోలీసు అధికారులు ప్రకటించారు. ఘటనా స్థలం నుండి ఒక ఏకే 47, SLR, INSASతో పాటు మరిన్ని ఆధునిక ఆయుధాలు లభ్యం అయినట్టు పోలీసు అధికారులు ప్రకటించారు.
కేంద్ర కమిటీ సభ్యుడు…
ఈ ఎదురు కాల్పుల ఘటనలో కేంద్ర కమిటీ సభ్యుడు రామచంద్రా రెడ్డి అలియాస్ చలపతి(61) మరణించినట్టుగా ఒడిషా, చత్తీస్ గడ్ రాష్ట్రాలకు చెందిన పోలీసు అధికారులు ధృవీకరించినట్టుగా జాతీయ మీడియా కథనం. చలపతి ఏపీలోన చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం ముత్యంపల్లి స్వగ్రామం. ఇతనిపై రూ. కోటి రివార్డు ఉన్నట్టుగా పోలీసు వర్గాలు తెలిపాయి. కులారిఘాట్ అటవీ ప్రాంతంలో ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని రాయ్ పూర్ ఐజీ అమ్రేష్ మీడియాకు వెల్లడించారు.