TSC కమిటీ కార్యదర్శి మృతి: మావోయిస్టులు
12 మంది చనిపోయారు: పోలీసులు
దిశ దశ, దండకారణ్యం:
తెలంగాణ, సరిహద్దు అటవీ ప్రాంతంలో మూడు రోజుల క్రితం మొదలైన ఎదరు కాల్పుల్లో మావోయిస్టు పార్టీ ముఖ్య నాయకత్వం ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది, పూజారి కంకేర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్ కౌంటర్ లో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి (TSC) బడే దామోదర్ అలియాస్ చొక్కారావుతో పాటు మొత్తం 18 మంది మరణించారని సౌత్ జోనల్ కమిటీ ఇంఛార్జి గంగా పేరిట ఒక ప్రకటన విడుదల అయింది. అయితే బస్తర్ రేంజ్ పోలీసు అధికారులు మాత్రం ఈ ఘటనలో 12 మంది చనిపోయారని వారిలో 10 మందిని గుర్తించామని ప్రకటించారు.
రెండు రోజులుగా…
ఈ నెల 16 నుండి 17 నుండి పూజారి కంకేర్ అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు జరిగాయి. 16వ తేది ఉధయం 9 గంటలకు ప్రారంభం అయిన ఎదురు కాల్పులు అడపాదడపా కొనసాగుతూ 17వ తేది వరకు కొనసాగాయని తెలుస్తోంది. ఈ అటవీ ప్రాంతంలో మూడు రాష్ట్రాలకు చెందిన సరిహధ్దు కమిటీలు, కీలక నాయకులు, సెంట్రల్ మిలటరీ కమిషన్ (CMC) సమావేశం అయినట్టుగా సమాచారం అందుకున్న బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు మరణించినట్టుగా పోలీసులు ప్రకటించారు. పోలీసులు విడుదల చేసిన జాబితాలో CRC కంపెనీ నం. 02/CyPC టెక్నికల్ టీమ్ సభ్యుడు నరసింహారావు (తెలంగాణ)కు చెందిన వ్యక్తితో పాటు చత్తీస్ గడ్ రాష్ట్రానికి చెందిన వారు ఉన్నారని ప్రకటించారు. 12 మందిలో 10 మంది నక్సల్స్ ను గుర్తించామని, మిగతా ఇద్దరిని గుర్తించాల్సి ఉందని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ పి మీడియాకు వెల్లడించారు.
బడే దామోదర్…
అయితే ఎదురు కాల్పుల ఘటనలో మావోయిస్టు పార్టీ సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీ కార్యదర్శి గంగా పేరిట విడుదల అయిన లేఖలో మాత్రం మొత్తం 18 మంది నక్సల్స్ మరణించారని వెల్లడించారు. ఈ ఘటనలో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే దామోదర్ అలియాస్ చొక్కారావు ఉన్నారని వెల్లడించారు. ఎన్ కౌంటర్ జరుగుతున్న క్రమంలో గాయాల పాలైన మావోయిస్టు పార్టీ నాయకులను ఘటనా స్థలం నుండి తరలిస్తున్న క్రమంలో చనిపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు. మరో వైపున చనిపోయిన విప్లవ నాయకుల మృత దేహాలను తరలించి పార్టీ లాంఛనాలతో అంతిమ సంస్కారం నిర్వహించేందుకు షిప్ట్ చేసి ఉంటారని కూడా భావిస్తున్నారు. ఏది ఏమైనా ఈ ఘటనలో తెలంగాణ రాష్ట్రానికి ఇద్దరు మరణించినట్టుగా తెలుస్తోంది. పోలీసు అధికారలు విడుదల చేసిన జాబితాలో నర్సింహరావు చనిపోయారని, మావోయిస్టు పార్టీ చేసిన ప్రకటనలో బడే దామోదర్ ఉన్నాడని వెల్లడించింది.
హిడ్మా మిస్..?
మావోయిస్టు పార్టీ మిలటరీ కమిషన్ లో కీలక బాధ్యతలో ఉన్న హిడ్మా టార్గెట్ గా చత్తీస్ గడ్ బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టినట్టుగా తెలుస్తోంది. పూజారి కంకేర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు భారీ సమావేశం ఏర్పాటు చేశారని, ఇందులో హిడ్మా కూడా పాల్గొంటున్నాడన్న సమాచారం అందుకున్న బలగాలు కూంబింగ్ చేపట్టినట్టుగా స్పష్టం అవుతోంది. 2010 నుండి మోస్ట్ వాంటెడ్ నక్సల్స్ జాబితాలో హిడ్మా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. దండకరాణ్యంలో మైన్ ప్రూఫ్ వాహనాల్లో ప్రయాణిస్తున్న 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను మట్టుబెట్టిన ఘటనలో కీలకంగా వ్యవహరించింది హిడ్మానే. బస్తర్ అటవీ ప్రాంతంపై పూర్తిస్థాయిలో పట్టున్న హిడ్మా బలగాలను మట్టుబెట్టడంలో చాలా సార్లు సక్సెస్ అయ్యారు. కవ్వింపు చర్యలకు పాల్పడి బలగాలను మట్టుబెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. తన స్వస్థలం అయిన పువ్వర్తి ప్రాంతంలోని జీనగూడ అటవీ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న బలగాలను చుట్టు ముట్టి హతమార్చిన ఘటనకు వ్యూహ రచన చేసి అమలు చేసింది కూడా హిడ్మానే కావడం గమనార్హం. హిడ్మాను పట్టుకోవడమో లేక ఎన్ కౌంటర్ చేయడమో అన్న లక్ష్యంగా బలగాలు ప్రతికారం కోసం ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే హిడ్మా స్వస్థలం అయిన పువ్వర్తిలో కేంద్ర పారా మిలటరీ బలగాల క్యాంపు ఏర్పాటు చేసిన పోలీసు అధికారులు తమ సక్సెస్ లో కీలకమైన అడుగు వేశామన్న రీతిలో ప్రకటనలు చేశారు. ఇప్పటికే పలు సంఘటనల్లో తప్పించుకున్న హిడ్మా లక్ష్యంగానే పూజారి కంకేర్ అటవీ ప్రాంతంలో సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించాయి. అయితే ఈ ఘటనలో కూడా హిడ్మా తప్పించుకోగా, తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే దామోదర్ మరణించారు.