సరిహద్దుల్లో మరో ఎన్ కౌంటర్… ముగ్గురు మావోయిస్టుల మృతి…

దిశ దశ, దండకారణ్యం:

కాల్పుల మోతతో దండకారణ్యం దద్దరిల్లిపోతోంది. వరస ఘటనలతో సరిహద్దు ప్రాంతాల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల బార్డర్ పారెస్ట్ ఏరియాలో చోటు చేసుకుంటున్న వరస ఎదురుకాల్పుల ఘటనలతో అట్టుడికిపోతోంది. లోకసభ ఎన్నికల వేళ మావోయిస్టులు, పోలీసుల మధ్య సాగుతున్న ప్రచ్ఛన్న యుద్దంతో సామాన్యులు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. చత్తీస్‌గఢ్ బీజాపూర్, సుక్మా, మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్ల్లాలతో పాటు మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ ప్రాంతంలో నిత్యం ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు పొరుగు రాష్ట్రాలకే పరిమితం అయిన మావోయిస్టుల కార్యకలాపాలు తాజాగా తెలంగాణ సరిహద్దులకు కూడా పాకినట్టుగా తెలుస్తోంది.గత నెలలో మహారాష్ట్రలోని ప్రాణహిత పరివాహక ప్రాంత అడవుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో మంగి ఏరియా కమిటీకి చెందిన మావోయిస్టులు మరణించారు. శనివారం తెల్లవారుజామున ములుగు జిల్లాలో మరో ఘటన చోటు చేసుకోవడం సంచలనంగా మారింది. జిల్లాలోని వెంకటాపురం మండలం కర్రెగుట్టల వద్ద పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగినట్టుగా తెలుస్తోంది. ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతానికి అవతలి వైపున చత్తీస్‌గఢ్ లోని పూజారి కాంకేర్ సరిహద్దు అటవీ ప్రాంతం ఉంటుంది. దండకారణ్య అటవీ ప్రాంతం పరిధి కావడంతో ఆ ప్రాంతం నుండి మావోయిస్టులు తెలంగాణ సరిహద్దుల్లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉంటాయని అంచనా వేసిన పోలీసు అధికారులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇటీవల బీజాపూర్ జిల్లా కోర్చోలి అటవీ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో మావోయిస్టు పార్టీకి అత్యంత కీలకమైన పీఎల్జీఏ రెండవ కంపెనీకి చెందిన నక్సల్స్ 13 మంది హతమయ్యారు. ఇటీవల కాలంలో మహారాష్ట్ర, చత్తీస్ గడ్ లలో వరస ఎదురు కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటుండడంతో తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. ఇందులో భాగంగానే ప్రాణహిత, గోదావరి తీరం వెంట ప్రత్యేకంగా కూంబింగ్ చేపట్టినట్టుగా సమాచారం. లోకసభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర పారా మిలటరీ బలగాలతో పాటు ఆయా రాష్ట్రాల బలగాలు జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగానే తెలంగాణ సరిహద్దుల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్న క్రమంలో ఎన్ కౌంటర్ చోటు చేసుకుందని పోలీసు వర్గాల సమాచారం. ఈ ఘటనలో ఒక లైట్ మిషన్ గన్ (ఎల్ఎంజి), ఒఖ ఎకె 47, ఒక 12 బోర్ తుపాకి లభ్యమైనట్టుగా సమాచారం. అయితే ఎదురు కాల్పుల్లో మరణించిన వారి వివరాలు తెలియరావల్సి ఉంది. కర్రెగుట్ల ఎన్ కౌంటర్ నేపథ్యంలో సరిహధ్దు ప్రాంతాల్లోని ఐదు జిల్లాల్లో పోలీసు అధికారులు హై అలెర్ట్ ప్రకటించారు.

You cannot copy content of this page