అక్కడ దోస్తీ… ఇక్కడ కుస్తీ…

అంతుచిక్కని ఎంఐఎం వ్యూహం

కరీంనగర్ విషయంలోనే ఎందుకిలా..?

దిశ దశ, కరీంనగర్:

ఆ రెండు పార్టీలు చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. రెండు పార్టీల అధినేతల మధ్య ఉన్న అవగాహన గురించి కూడా అందరూ బాహాటంగా చర్చించుకుంటున్నదే. పొత్తుల ఎత్తుతో పాటు అన్నింటా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, మిత్ర పక్షానికి మధ్య ఉన్న సాన్నిహిత్యం అంతా ఇంతాకాదు. ఇటీవల కాలంలో రెండు పార్టీల అధినేతలు విమర్శలు చేసుకున్నా అంతగా ప్రభావం చూపలేదు. అయితే రాష్ట్ర నాయకత్వంతో సమన్వయంతో ఉంటూ… జిల్లా లీడర్లు మాత్రం కయ్యానికి కాలు దువ్వుతుండడం విచిత్రంగా మారింది. ఇందుకు కరీంనగర్ వేదికగా మారడం సరికొత్త చర్చకు దారి తీసింది.

బీఆర్ఎస్ వర్సెస్… ఎంఐఎం…

అధికార బీఆర్ఎస్ పార్టీకి, ఎంఐఎం పార్టీకి మధ్య వైరం ముదిరి పాకాన పడినట్టుగా కనిపిస్తోంది. ఇంతకు ముందు మంత్రి గంగుల కమలాకర్ లక్ష్యంగా ఎంఐఎం నాయకుడు సయ్యద్ గులాం అహ్మద్ చేపట్టిన కార్యక్రమాలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ నేపథ్యంలో మంత్రి కూడా ఘాటుగానే స్పందించడంతో పరస్పర విమర్శలు చేసుకున్నారు. ఆ తరువాత ఎవరి పనుల్లో వారు నిమగ్నం కావడంతో ఇదంతా టీ కప్పులో తుపానులా విబేధాలు సమిసిపోయాయని భావించారంత. అయితే అనూహ్యంగా రేకుర్తి ఇండ్ల కూల్చివేత ఘటన చోటు చేసుకోవడంతో మళ్లీ గంగుల వర్సెస్ ఎంఐఎం అన్నట్టుగా పంచాయితీ మొదలైంది. ఇండ్ల కూల్చివేత విషయంలో మంత్రి గంగుల కమలాకర్ ను టార్గెట్ చేసుకున్న ఎంఐఎం ఆరోపణల పర్వానికి దిగింది. స్థానిక నేతలే కాకుండా ఆ పార్టీ ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్ కూడా రేకుర్తిని సందర్శించి ఘాటుగా స్పందించారు. ఇంతకు ముందు కూడా ఎంఐఎం నాయకులు రేకుర్తి ఇండ్ల కూల్చివేత విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎంఐఎం వ్యూహం ఏంటో అంతుచిక్కకుండా పోతోంది. బీఆర్ఎస్ పెద్దలతో సాన్నిహిత్యంగా మెదులుతూన్న ఎంఐంఎ లీడర్లు కరీంనగర్ విషయంలో మాత్రం ఎడ మొఖం పెడ మొఖం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కరీనంగర్ నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి గంగుల కమలాకర్ ను టార్గెట్ చేసుకుని పావులు కదుపుతున్నారెందుకన్నదే మిస్టరీగా మారిపోయింది. ఈ విషయంపై అటు బీఆర్ఎస్ ఇటు ఎంఐఎం పార్టీలలో కూడా తీవ్రంగా చర్చ సాగుతోంది.

కరీంనగర్ వేదికగా ‘తలాక్’?

9 ఏళ్లుగా అప్రతిహతంగా స్నేహాన్ని కొనసాగిస్తున్న బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు వ్యవహరిస్తున్న తీరు మిస్టరీగా మారిపోయింది. కరీంనగర్ సమీపంలోని రేకుర్తిలో జరిగిన ఇండ్ల కూల్చివేతపై పదే పదే ఎంఐఎం ఆందోళన వక్తం చేస్తున్న తీరు హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చించి సమస్యను పరిష్కరించుకునే అవకాశం ఉన్నప్పటికీ రేకుర్తి కేంద్రంగా పావులు కదుపుతుండడం దేనికి సంకేతమో అన్నదే అర్థం కాకుండా పోయింది. అంది వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని కరీంనగర్ లో తమ బలం, బలగం అంతా చేతల్లో చూపించేందుకు ఎంఐఎం ప్రత్యక్ష్యం పోరుకు సిద్దపడిందా అన్న చర్చ తీవ్రంగా సాగుతోంది. అయితే కరీంనగర్ అంశం ఝటిలింగా మారినట్టయితే వచ్చే ఎన్నికల నాటికి రెండు పార్టీల మధ్య పొత్తులు ఉండే అవకాశాలు లేవని స్ఫష్టం అవుతోంది. రేకుర్తి అంశం చిలికి చిలికి గాలి వానలా మారినట్టయితే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ తో దోస్తీకి ఎంఐఎం తలాక్ చెప్పే అవకాశాలే మెండుగా ఉన్నాయి. మరో వైపున కరీంనగర్ లో మైనార్టీలు పెద్ద సంఖ్యలో ఉన్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఇక్కడ పాగా వేయాలన్న తహ తహ కూడా స్థానిక నేతల్లో నెలకొంది. పార్టీ ముఖ్య నాయకుడు సయ్యద్ గులాం అహ్మద్ వచ్చే ఎన్నికల్లో కరీంనగర్ నుండి ఎమ్మెల్యేగా బరిలో నిల్చోవలన్న ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎంఐఎం ప్రతి విషయాన్ని అందిపుచ్చుకుని ప్రజా క్షేత్రంలో పోరుబాట పడుతోందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దాదాపు పాతికేళ్ల క్రితమే కరీంనగర్ నుండి మునిసిపల్ ఛైర్మన్ గా ఎంఐఎం అభ్యర్థిగా వాహజోద్దీన్ బరిలో నిలిస్తే రెండో స్థానంలో నిలిచారు. ఇప్పుడా బలం ఏ స్థాయిలో పెరిగిందో అంచనా వేసుకున్న ఎంఐఎం పాగా వేసేందుకు భారీ స్కెచ్ వేసినట్టుగా తెలుస్తోంది. ఎంఐఎం అంటే పాత బస్తీకే పరిమితం అయిందన్న వాదనలు తెరపైకి తీసుకొస్తున్న నేపథ్యంలో ఇతర జిల్లాల్లో కూడా తమ సత్తా ఏంటో చూపినట్టయితే ఆరోపణలు చేస్తున్న పార్టీలకు సమాధానం చెప్పినట్టు అవుతుందన్న అంశాన్ని కూడా పార్టీ చీఫ్ బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ ముందు ఉంచాలని జిల్లా నాయకత్వం యోచిస్తున్నట్టు సమాచారం. ఏది ఏమైనా ఇటీవల కాలంలో ఎంఐఎం వ్యూహం ఏంటన్నదే పజిల్ గా మారిందని చెప్పక తప్పదు.

You cannot copy content of this page