ఆ విధానమూ నష్టాన్ని తెచ్చి పెడుతోందా..? ఇంజనీర్ల డిమాండ్ కు కారణం అదేనా..?

దిశ దశ, భూపాలపల్లి:

నీటి పారుదల శాఖలోని అన్ని విభాగాలను ఒకే గొడుకు కిందకు తీసుకరావడం  ఇబ్బందిగా మారిందా..? ఆపరేషన్స్ నిర్వహించే విషయంలో ఇంజనీర్లు అవస్థలు  పడుతున్నారా..? ప్రాక్టికల్ గా ఎదురవుతున్న సమస్యలతో సతమతమవుతున్నారా..? అంటే అవుననే అంటున్నారు ఇరిగేషన్ విభాగంలో పని చేస్తున్న ఇంజనీర్లు.

ఒకే గొడుగు కిందకు…

గతంలో చిన్న, మధ్య, భారీ తరహా నీటి పారుదల విభాగాలు వేర్వేరుగా ఉండేవి. ఆయా వనరుల సామర్థ్యాన్ని బట్టి చెరువులు సంబంధిత విభాగాలు పర్యవేక్షించే విధానం కొనసాగేది. దీంతో నీటి వనరుల పర్యవేక్షణ సాఫీగా సాగేది. కానీ తెలంగాణ ఆవిర్భావం తరువాత తీసుకున్న నిర్ణయంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఇంజనీర్లు అంటున్నారు. ఒకే గొడుకు కిందకు ఆయా విభాగాలను చేర్చడంతో అన్ని రకాల వనరులపై అజమాయిషీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారీ ప్రాజెక్టుల పరిధిలో పనిచేస్తున్న ఇంజనీర్లు చిన్న తరహా విభాగం పరిధిలో ఉండే చెరువులు కుంటలను కూడా పర్యవేక్షించాల్సి వస్తోంది. ఈ విధానంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోని ఇంజనీర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టు వద్ద పనిచేసినప్పుడు అనేక రకాలుగా ఇంజనీర్లు అవస్థలు పడక తప్పడం లేదు. భారీ నీటి పారుదల విభాగంలో ఇంత కాలం పనిచేసిన ఇంజనీర్ల పర్యవేక్షణలోనే మైనర్ ఇరిగేషన్ పరిధిలోని కుంటలు, చెరువులను చేర్చారు. అయితే ఇందుకు తగినట్టుగా క్షేత్ర స్థాయిలో పనిచేయాల్సిన ఏఈఈలు, వర్క్ ఇన్స్ పెక్టర్లను మాత్రం అవసరానికి తగ్గట్టుగా నియమించలేదు. దీంతో చాలా ప్రాంతాల్లో అధికారులే ఫీల్డ్ విజిట్ కు వెల్లాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. వర్షాకాలంలో సహజంగా వరదలు వచ్చే అవకాశం ఉన్న నదుల వద్ద 24 గంటల పాటు ఫ్లడ్ పరిస్థితిని అంచనా వేయాల్సి ఉంటుంది. ఇదే సమయంలో చిన్న, మధ్య తరహాకు చెందిన వనరులను కూడా పర్యవేక్షించాల్సి ఉంటుంది. దీంతో వరద ఉధృతిని అంచనా వేసే క్రమంలో ఇతర నీటి వనరులను విస్మరించక తప్పని పరిస్థితి ఎదురవుతోంది. దీంతో ఏదో ఒకరకమైన డ్యామేజీని ఎదుర్కొక తప్పని సరి పరిస్థితులే ఉన్నాయి తప్ప వాటిని కంట్రోల్ చేసే అవకాశం లేకుండా పోతోంది. ఇలాంటి ఎన్నో రకాల ఇబ్బందులు ఉత్పన్నం అవుతున్న నేపథ్యంలో నీటి పారుదల శాఖను పునర్ వ్యవస్థీకరించాలన్న డిమాండ్ పెరిగింది.

మంత్రి శ్రీధర్ బాబుకు వినతి

నీటి పారుదల శాఖను పునర్ వ్యవస్థీకరణ చేయాలన్న డిమాండ్ ను బలంగా వినిపిస్తున్నారు ఇంజనీర్లు. తెలంగాణ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని కాటారం మండల కేంద్రంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును కలిసి వినతి పత్రం అందించారు. జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్ల్లి జిల్లాల్లోని ఇతర నీటి వనరులను పర్యవేక్షించాల్సి వస్తున్నందున పనిభారం ఎక్కువ కావడంతో పాటు పర్యవేక్షణ కూడా సమస్యగా మారిందని అంటున్నారు. ఫీల్డ్ లో ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఇరిగేషన్ విభాగాన్ని రీ ఆర్గనైజ్ చేయాలని అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఏ రామచందర్ ఆ వినతి పత్రం ద్వారా అభ్యర్థించారు.

You cannot copy content of this page