దిశ దశ, జగిత్యాల:
కాంగ్రెస్ పార్టీలో కాకలు తీరిన యోధుడికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం షాకిచ్చినట్టయింది. మాట వరసకైనా తనకు చెప్పకుండా సిట్టింగ్ ఎమ్మెల్యేను తీసుకున్నారని కినుక వహించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో సోమవారం చోటు చేసుకున్న పరిణామాలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఇబ్బందికరంగా మారాయి. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి తెలియకుండానే సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ని చేర్చుకోవడం ఆయనతో పాటు అనుచర వర్గానికి కూడా మింగుడుపడకుండా పోయింది. సోమవారం ఉదయం నుండే జీవన్ రెడ్డి అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చి ఆయనను కలుస్తున్నారు. సంఖ్యాబలం ఉన్నప్పుడు పార్టీ ఫిరాయించే వారిని ఎందుకు ప్రోత్సహిస్తున్నారో అర్థం కావడం లేదని జీవన్ రెడ్డి రెండు మూడు రోజుల క్రితమే కామెంట్ చేశారు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని జాయిన్ చేసుకున్నప్పుడు ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశం అయ్యాయి. అయితే తాజాగా జీవన్ రెడ్డి సొంత ఇలాకా అయిన జగిత్యాల శాసనసభ్యుడిని చేర్చుకోవడమే ఆయనకు షాకిచ్చినట్టుగా కాగా… కనీసం ఓ మాటగా చెప్పకపోవడంతో కినుక వహించారు. అంటు అభిమానులు. ఇటు సన్నిహితులకు జీవన్ రెడ్డి ఎలాంటి సమాధానం చెప్పలేకపోతున్నారు. తనకు చెప్పకుండా తీసుకోవడం బాధిస్తోందన్న సంకేతాలను మాత్రం ఆయన స్పష్టం చేశారు. అయితే అధిష్టానం కూడా సముచిత ప్రాధాన్యత ఉంటుందని జీవన్ రెడ్డితో చెప్తున్నప్పటికీ ఆయన మాత్రం అధిష్టానం నిర్ణయాన్ని స్వాగతించడం లేదు. మద్యాహ్నం నుండే ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్ లు జీవన్ రెడ్డి ఇంటికి చేరుకుని ఆయనతో మాట్లాడినప్పటికీ వెనక్కి తగ్గినట్టుగా మాత్రం కనిపించడం లేదు. దీంతో అదిష్టానం ప్రత్యేకంగా మంత్రి శ్రీధర్ బాబును రంగంలోకి దింపింది. జీవన్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యంతో ఎలాగైనా ఆయన్ని మెప్పించి ఒప్పించాలని శ్రీధర్ బాబును జగిత్యాలకు పంపించినట్టుగా తెలుస్తోంది.
పీసీసీ..?
అయితే మరోసారి పీసీసీ చీఫ్ రేసులో జీవన్ రెడ్డి పేరు వినిపిస్తోంది. ఆయనకు తెలియకుండా డాక్టర్ సంజయ్ కుమార్ ను పార్టీలో చేర్పించుకున్న నేపథ్యంలో ఆయనను బుజ్జగించిన తరువాత పీసీసీ బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే జగిత్యాల క్యాడర్ విషయంలో ఎలాంటి స్వేచ్చ ఇస్తారు, తన అనుచరుల భవిష్యత్తు ఏంటీ అన్న విషయంపై పార్టీ పెద్దలు స్పష్టత ఇస్తేనే శాంతించే అవకాశం ఉన్నట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది.