నేతల తల రాతలు మారడం ఖాయం
దిశ దశ, హైదరాబాద్:
మహిళా బిల్లు అమల్లోకి రావడం ఖాయంగా మారిపోయింది. అన్ని పార్టీలు కూడా మహిళా బిల్లుకు ఆమోద ముద్ర వేసే అవకాశం ఉన్నందున ఉభయ సభల్లోనూ ఈ బిల్లు పాస్ కావడం లాంఛనమే. అయితే బిల్లు అమలు చేస్తే మాత్రం రాష్ట్రంలో కొంతమంది నాయకుల తలరతాలు తలకిందులుగా మారిపోయే ప్రమాదంలో పడింది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 39 లేదా 40 సీట్లను మహిళలకు కెటాయించాల్సి ఉంటుంది. ఈ నియోజకవర్గాలు ఏవీ అనేది మాత్రం గణాంకాలు తీసిన తరువాత తేలనున్నప్పటికీ… మహిళలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు మాత్రం రిజర్వేషన్ కోటాలోకి చేరిపోతాయి. దీంతో ఆయా నియోజకవర్గాల్లో తమ భవిష్యత్తుపై కలలు కని ప్రజల్లోకి వెల్లిన నాయకులు తెరమరుగు కాక తప్పని పరిస్థితి ఎదురుకానుంది. ప్రత్యామ్నాయంగా తమ కుటుంబ సభ్యులను ప్రత్యక్ష్య రాజకీయాల్లోకి ఏంట్రీ ఇప్పించక తప్పనిసరి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆయా నేతల కుటుంబాలకు చెందిన మహిళలు తమకు ఆసక్తి లేదని వెనక్కి తగ్గితే మాత్రం ప్రత్యామ్నాయ నాయకురాళ్లను బరిలో నిలపక తప్పదు.
బీఆర్ఎస్ పరిస్థితి..?
అయితే అభ్యర్థుల ప్రకటనలో అన్ని పార్టీల కంటే ముందు వరసలో నిలిచిన బీఆర్ఎస్ పార్టీ మహిళా బిల్లు అమలయితే మాత్రం ఆయా స్థానాల్లో మహిళా అభ్యర్థులను ప్రకటించాల్సిందే. దీంతో ఆయా నియోజకవర్గాల వారిగా ఉన్న మహిళా నాయకురాళ్లకు అవకాశం కల్పించాల్సి వస్తుందన్నది నిజం. అయితే ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లోని అభ్యర్థులు క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి వెల్లి ప్రచారం చేసుకునే పనిలో నిమగ్నమైన క్రమంలో మహిళా బిల్లు వారికి ఇబ్బందికర పరిస్థితులను తెచ్చిపెట్టిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒకే ఇంటి నుండి భార్యా, భర్తలు, లేదా వారి కుటుంబంలోని మహిళలు ప్రత్యక్ష్య రాజకీయాల్లో ఇప్పటికే ఉన్నట్టయితే వారి పేర్లను పరిశీలించాలన్న ప్రతిపాదనలు అధిష్టానం ముందు ఉంచే అవకాశాలు ఉన్నాయి.
కొత్త దరఖాస్తులు తీసుకుంటారా..?
ఇకపోతే రాష్ట్రంలోని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కూడా అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించే విషయంలో వేగంగానే వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే ఈ రెండు పార్టీలు కూడా ఆశావాహుల నుండి దరఖాస్తులు తీసుకునే ప్రక్రియకు శ్రీకారం చుట్టాయి. కాంగ్రెస్, బీజీపీల నుండి టికెట్లు ఆశిస్తున్న నాయకులంతా కూడా దరఖాస్తులు చేసుకున్నప్పటికీ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. అయితే మహిళా బిల్లు పాస్ అయినట్టయితే ప్రత్యామ్నాయ నాయకత్వం కోసం కొత్తగా దరఖాస్తులు తీసుకునే ప్రక్రియకు ఈ రెండు పార్టీలు శ్రీకారం చుడుతాయా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మహిళా రిజర్వేషన్ అమలయ్యే నియోజకవర్గాల నుండి అయినా ఆశావాహుల నుండి అప్లికేషన్లు తీసుకునే విషయంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకత్వం ఎలాంటి నిర్షయం తీసుకుంటాయో తేలాలంటే వేచి చూడక తప్పదు.