ఓ వైపున చెక్ పోస్టులు… మరో వైపున లారీల పార్కిగ్…

హైవేపై రాకపోకలకు అంతరాయం…

దిశ దశ, చెన్నూరు:

ఇసుక అక్రమ రవాణాను నిలువరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఓవర్ లోడ్ విధానాన్ని కట్టడి చేయడంతో పాటు లారీలను తనిఖీ చేసేందుకు ప్రత్యేకంగా చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేసింది.

హైవేపై…

అన్ని ప్రధాన రహదారుల్లో ఏర్పాటు చేసిన ఈ చెక్ పోస్టుల వల్ల ఆర్టీఏ నిబంధనలు కఠినంగా అమలు అవుతున్నాయి. దీంతో గత కొద్ది రోజులుగా ఇసుక ఓవర్ లోడ్ విధానంపై రవాణా విభాగం అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి అదనపు ఆదాయం వస్తున్నప్పటికీ ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయన్న విషయాన్ని అధికారులు గమనించాల్సిన అవసరం ఉంది. ఇసుక లారీలను తనిఖీ చేసేందుకు ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు హైవే పక్కనే ఉండడంతో లారీలను ఇష్టారీతిన నిలిపివేస్తున్నారు. హైవేపై లారీలను నిలిపి వేస్తున్న చెక్ పోస్టు యంత్రాంగం ఓవర్ లోడ్, వే బిల్లులను పరిశీలించి పంపిస్తున్నాయి. ఈ సందర్భంగా లారీలు చెక్ పోస్ట్ సమీపంలోనే నిలిపి ఉంచుతుండడంతో ఇతర వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు సమీపంలోని కొల్లూరు క్వారీ నుండి ఇసుక తరలించే లారీలను తనిఖీ చేసేందుకు ఏర్పాటు చేసిన చెక్ పోస్టు వద్ద తరుచూ ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. క్వారీకి వెల్లే లారీలు, క్వారీల నుండి లోడ్ చేసుకుని వచ్చే లారీల రాకపోకలతో పాటు పొరుగు రాష్ట్రాలతో అనుసంధానం చేసిన హైవే కావడంతో ఇతర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మహారాష్ట్ర, చత్తీస్ గడ్ రాష్ట్రాల నుండి చెన్నూరు మీదుగా హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్ ప్రాంతాలకు వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. మరోవైపున మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అహేరీ, సిరొంచ రోడ్డు నిర్మాణం సాగుతున్నందున నాగపూర్ ప్రాంతం నుండి సిరొంచ, చత్తీస్ గడ్ రాష్ట్రాలకు వెల్లే వాహనాలను చంద్రపూర్, మంచిర్యాల, చెన్నూరు మీదుగా దారి మళ్లిస్తున్నారు. దీంతో సాధారణ వాహనాల రాకపోకలకంటే ఎక్కువగా ఈ నేషనల్ హైవే మీదుగా రద్దీ పెరిగింది. తరుచూ ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.

పార్కింగ్ అక్కడే…

ఇకపోతే కొల్లూరు ఇసుక రీచు వద్ద ప్రత్యేకంగా పార్కింగ్ స్థలం లేకపోవడం కూడా ఇబ్బందికరంగా మారింది. ఇసుక రవాణా కోసం ఈ రీచుకు చేరుకుంటున్న లారీలన్ని కూడా నేషనల్ హైవే పక్కన నిలిపివేస్తున్నారు. కిలోమీటర్ల కొద్ది లారీలు జాతీయ రహదారిపై నిలిపివేస్తుండడం వల్ల కూడా ఈ ప్రాంతం మీదుగా రాకపోకలు సాగిస్తున్న వారు ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవంగా TGMDC ప్రతి రీచు వద్ద పార్కింగ్ స్థలాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ కొల్లూరు క్వారీ వద్ద మాత్రం అలాంటి చర్యలు తీసుకున్నట్టుగా కనిపించడం లేదు. ఈ రీచుకు వస్తున్న లారీలకు అనుగుణంగా రీచ్ పరిసర ప్రాంతంలో ప్రత్యేకంగా పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేసినట్టయితే నేషనల్ హైవేపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడే అవకాశం ఉండదని స్థానికులు అంటున్నారు. అధికారులు నేషనల్ హైవేపై ఎదురవుతున్న ఇబ్బందులను నిలువరించేందుకు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్న అభ్యర్థిస్తున్నారు పలువురు వాహనదారులు.

You cannot copy content of this page