తన ఇంటి ముందే బైఠాయించిన రాజేందర్
దిశ దశ, హైదరాబాద్:
మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను మేడ్చల్ జిల్లా పోలీసులు అడ్డుకున్నారు. ఈ రోజు డబుల్ బెడ్రూం ఇళ్ల కెటాయింపులు చేయకపోవడంపై నిరసన వ్యక్తం చేసేందుకు ఇంటి నుండి బయటకు వస్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. గురువారం ఉదయమే శామీర్ పేటలోని ఈటల రాజేందర్ ఇంటికి చేరుకున్నబలగాలు ఆయన ఆందోళన బయలు దేరిన క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తమ నిరసనను యథావిధిగా కొనసాగిస్తామని తేల్చి చెప్పిన రాజేందర్ తన ఇంటి ముందే బైఠాయించారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయడంలో చూపిస్తున్న వివక్షపై ఆయన మండిపడ్డారు. పేదల సంక్షేమం కోసం చేపట్టాల్సిన పనులపై దృష్టి పెట్టకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తుండడంపై ఈటల రాజేందర్ అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నాయకులను అరెస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన అక్రమ అరెస్టులు చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి రివాజుగా మారిపోయిందని విమర్శించారు. ప్రజా స్వామ్యంలో నిరసనలను తెలిపే హక్కు ప్రతిపక్షాలకు ఉందని, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా ప్రతిపక్షాలకు ఉందన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. ప్రతిపక్షాలను ఎక్కడికక్కడ కట్టడి చేయిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఈటల రాజేందర్ దుయ్యబట్టారు. తమను నిర్భందించినంత మాత్రాన తమ పోరాటం ఆగదని, తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరని తేల్చి చెప్పారు. తమకు అరెస్టులు కొత్త కాదని, అధికార పక్షం తీరు మార్చుకోకపోతే ప్రజలనే మార్చివేస్తారంటూ ఈటల వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేసిన బీజేపీ శ్రేణులను బేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
