ఫిరాయింపులకు బ్రేకేసే పనిలో రాజేందర్..?
దిశ దశ, హైదరాబాద్:
నిన్న మొన్నటి వరకు అధిష్టానం తీరుపై అసహనం వ్యక్తం చేసి రాష్ట్ర పార్టీతో అంటీ ముట్టనట్టుగా వ్యవహరించిన మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్ తో బీజేపీ నేత ఈటల రాజేందర్ ప్రత్యేకంగా చర్చలు జరిపారు. ఆదివారం చంద్ర శేఖర్ ఇంటికి వెల్లిన ఈటల కొద్దిసేపు పర్సనల్ గా చర్చలు జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఇద్దరు కూడా రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి అవసరమైన చర్యలు ఏంటీ..? ఉద్యమ కాలంలో తెలంగాణ ఎలా ఉండాలోనని కలలు కన్న విధంగా తయారు చేయాలంటే తీసుకోవల్సిన చర్యల గురించి మాట్లాడుకున్నామని మీడియా ముందు ప్రకటించారు. నిన్నటి వరకు పార్టీ బాగాలేదనా..? ఇప్పుడు పార్టీ బాగాలేదని మీరు అనుకుంటున్నారా అని మీడియా ప్రతినిధులు మాజీ మంత్రి చంద్ర శేఖర్ ను ప్రశ్నించగా అలాంటి వ్యక్తిని చిల్లరగా అడగడం సరికాదంటూ ఈటల కౌంటర్ ఇచ్చారు. ఏబీసీడీల వర్గీకరణ విషయంలో కూడా బీజేపీ నాయకత్వం సానుకూలంగా ఉన్నదని, కర్ణాటకలో కూడా ఈ మేరకు హామీ ఇచ్చిన దృష్ట్యా తెలంగాణాలో కూడా ఇదే విధానాన్ని కొనసాగించే అవకాశాలు ఉన్నాయని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.
లక్ష్యం అదేనా..?
ఈటల రాజేందర్ ఫిరాయింపు దారులను కట్టడి చేసే పనిలో నిమగ్నం అయ్యారని చంద్రశేఖర్ తో చర్చలు జరిపిన నేపథ్యంలో స్ఫష్టం అవుతోంది. ఇప్పటికే బీజేపీకి చెందిన సీనియర్లు ఇతర పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారన్న ప్రచారం విస్తృతంగా సాగుతోంది. మరి కొంతమంది నాయకులు సైలెంట్ గా ఉండిపోవడం కూడా వేరే విధమైన సంకేతాలు వస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి అయోమయంగా మారిపోయిందన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో దిదుబాటు చర్యలకు ఈటల రాజేందర్ దిగినట్టుగా అర్థమవుతోంది. మొదటి సారిగా మాజీ మంత్రి ఏ చంద్ర శేఖర్ తో చర్చలు జరిపి ఆయన్ను పార్టీలో కొనసాగించే విధంగా మెప్పించి ఒప్పించినట్టుగా సమాచారం. దీంతో పార్టీపై కినుక వహించిన ఏ చంద్రశేఖర్ ఇప్పుడు తన పంథా మార్చుకుని బీజేపీలోనే కొనసాగే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తోంది.
మిగతా వారితోనూ…?
అయితే బీజేపీని వీడేందుకు ప్రయత్నిస్తున్న మిగతా నాయకులను కూడా బుజ్జగించి పార్టీలో సముచిత స్థానం ఉంటుందన్న హామీ ఇచ్చి వారు కాషాయం జెండా వీడకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకునే పనిలో ఈటల నిమగ్నం అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా భావిస్తున్నారు. పార్టీకి దూరంగా ఉంటూ వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తమ భవిష్యత్తును ఆలోచించుకుంటున్న నాయకులకు సర్దిచెప్పి పార్టీలోనే కొనసాగే విధంగా ఒప్పించేందుకు ఈటల రంగంలోకి దిగారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈటల రాజేందర్ మిగతా నాయకులను కూడా ఇదే విధంగా కలిస్తారా లేక ఉద్యమ ప్రస్థానంలో చంద్రశేఖర్ తో ఉన్న సాన్నిహిత్యం కారణంగానే ఆయనతో చర్చలు జరిపారా అన్నది మాత్రం భవిష్యత్తులో తేలనుంది.