రెంటికి చెడ్డా రేవడి… ఈటల రాజేందర్… ’బండి‘ని టార్గెట్ చేసిన వారంతా ఓటమి

దిశ దశ, హైదరాబాద్:

రాష్ట్ర రాజకీయాల్లో తనదైన మార్కు రాజకీయాలు చేసేందుకు పావులు కదిపిన ఆ నేత అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. సొంత నియోజకవర్గంతో పాటు మరో చోట కూడా కన్నేసిన ఆయన్ను రెండు చోట్ల కూడా ప్రజలు అక్కున చేర్చుకోలేదు. బీజేపీలో తన బ్రాండ్ ఇమేజ్ పెంచుకునే దిశగా వ్యహరించిన సీనియర్ నేత వైఫల్యాలపై చర్చలు సాగుతున్నారు. తెలంగాణ ఉద్యమ ప్రస్థానం నుండి తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న ఈటల రాజేందర్ 2004 నుండి కమలాపూర్, హుజురాబాద్ నియోజకవర్గాల్లో అప్రతిహతంగా గెల్చుకుంటూ వస్తున్నారు. 2021లో టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తో విబేధాలు పొడసూపడంతో బీజేపీలో చేరిన ఈటలను ఓడించేందుకు తెలంగాణ ప్రభుత్వం సర్వ శక్తులు ఒడ్డినా ఆయనే గెలిచారు. దీంతో తెలంగాణాలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈటల రాజేందర్ బీజేపీలోనూ కీలక నేతగా ఎదిగారు. తాజా ఎన్నికల్లో రాజేందర్ సొంత నియోజకవర్గం హుజురాబాద్ తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేసిన గజ్వేల్ నుండి బరిలో నిలిచారు. అయితే ఆయనకు రెండు నియోజకవర్గాల ఓటర్లు షాకివ్వడం సంచలనంగా మారింది. అత్యంత బలమైన ప్రత్యర్థి కేసీఆర్ పై పోటీ చేయడం ఒక సవాల్ కాగా ఆయన స్టార్ క్యాంపెనర్ గా కూడా రాష్ట్రమంతా కలియతిరిగారు. దీంతో ఈటల రాజేందర్ హుజురాబాద్ పై ప్రత్యేక దృష్టి సారించలేకపోవడం ఆయనకు పెద్ద మైనస్ గా మారిపోయింది. మరోవైపున ఈటలను ఎలాగైనా ఓడించాలన్న లక్ష్యంతో ఉన్న అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులు రెండు చోట్ల కూడా వ్యూహాత్మక ఎత్తులు వేసి సఫలం అయ్యారు.

‘బండి’ వ్యతిరేకులంతా ఔట్…

బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా వ్యహరించిన బండి సంజయ్ కి వ్యతిరేకంగా బీజేపీలో జట్టు కట్టిన వారంతా కూడా ఓటమి పాలు కావడం గమనార్హం. హుజురాబాద్, గజ్వేల్ లో ఈటల రాజేందర్, కోరుట్లలో ధర్మపురి అరవింద్, దుబ్బాకల్ రఘునందన్ రావులు ఓడిపోవడం గమనార్హం. కరీంనగర్ నుండి పోటీ చేసిన బండి సంజయ్ ఒక్కరే టఫ్ ఫైట్ ఇచ్చి 3 వేల పై చిలుకు స్వల్ప ఓట్ల మెజార్టీతో ఓటమి పాలయ్యారు. కానీ మిగతా వారంతా కూడా అత్యధిక మెజార్టీతోనే ప్రత్యర్థులపై ఓడిపోవడం గమనార్హం. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్ష్య పదవిని అనూహ్యంగా తొలగించడం వెనక ఈటల, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్ ల హస్తం ఉందన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. ఆయనపై అధిష్టానానికి తప్పుడు సమాచారం ఇవ్వడం వల్లే రాష్ట్ర అధ్యక్ష్య పదవి నుండి తప్పించినట్టుగా బీజేపీ వర్గాలే చర్చికున్నాయి. అంతేకాకుండా నేషనల్ మీడియా కూడా రాష్ట్ర అధ్యక్షునిగా బండి సంజయ్ ని తొలగించిన జాతీయ నాయకత్వం తప్పు చేసిందని వ్యాఖ్యానించింది. ప్రజా సంగ్రామ యాత్రతో పాటు రాష్ట్రంలో ఏనాడు లేని విధంగా భారీ ఎత్తున బహిరంగ సభలు ఏర్పాటు చేయడంలో సంజయ్ సక్సెస్ అయ్యారు. తన హయంలో వచ్చిన ప్రతి ఎన్నికల్లోనూ పార్టీ బలాన్ని పెంచుకుంటూ పోవడంలో సంజయ్ వ్యూహాలు పనిచేశాయి. అయితే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ జాతీయ నాయకత్వం సంజయ్ ని తప్పించి ఘోర తప్పిదం చేసిందన్న అభిప్రాయాలను మీడియా వర్గాలు వ్యక్తం చేశాయి. గతంలో ఏ ఎన్నికల్లోనూ జాతీయ నాయకత్వం తెలంగాణాపై ఈ స్థాయిలో దృష్టి సారించిన దాఖలాలు లేవు. ఈ సారి ప్రధాని మోడీ బహిరంగ సభలకు హాజరు కావడం, అమిత్ షా, నడ్డా వంటి ముఖ్య నేతలు కూడా విస్తృతంగా పర్యటించడంతో బీజేపీ బలం పుంజుకుంటుందని భావించారంతా. అయితే బండి సంజయ్ ను బాధ్యతల నుండి తప్పించడంతో పార్టీ శ్రేణులతో పాటు రాష్ట్రంలోని వివిధ వర్గాల ఓటర్లలో ఒక రకమైన నైరాశ్యం నెలకొన్నట్టయింది. ఈ విషయంపై అధిష్టానం కూడా క్లారిటీ ఇవ్వకపోవడంతో సంజయ్ కి అన్యాయం చేశారన్న వాదన బలంగా వినిపించింది. రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ దూకుడుకు తగ్గట్టుగా జాతీయ నాయకులు ప్రచారం తోడైనట్టయితే ఫలితాలు కూడా తారుమారయ్యే పరిస్థితి ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా బండి సంజయ్ విషయంలో బీజేపీ జాతీయ నాయకత్వాన్ని తప్పుదారి పట్టించారని అంటున్న వారే ఎక్కువ అని చెప్పక తప్పదు.

You cannot copy content of this page