ఈటల మాటల తూటాలు…

కొరకరాని కొయ్యలా మారాడా..?

నాడు అలా… నేడు ఇలా…

దిశ దశ, హైదరాబాద్:

రాష్ట్రంలో సీనియర్ నాయకుల్లో ఒకరైన ఆయన నోటి నుండి వచ్చిన మాటలు సంచలనాలకు దారి తీస్తున్నాయి. ఎప్పుడూ బ్యాలెన్స్ గా మాట్లాడేందుకు ప్రాధాన్యం ఇచ్చే ఆయన ఒక్కోసారి చేస్తున్న వ్యాఖ్యలు చర్చకు దారి తీస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీలను ఇరుకున పెట్టే విధంగా మాట్లాడుతారని పేరున్న ఆయన ఒక్కోసారి చేస్తున్న వ్యాఖ్యలు సొంత పార్టీ వైఫల్యాలను ఎత్తి చూపుతున్నాయి. తాజాగా చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని అటుగా మల్లించాయి. అప్పుడు ఆ పార్టీ అగ్రనేతే లక్ష్యంగా చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని లేపితే ఇప్పుడు కాషాయం దండును ఇరుకున పెట్టే విధంగా చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి.

అప్పుడు…

తెలంగాణ ఆవిర్భావం తొలినాళ్లలో నెంబర్ 2 అన్న రేంజ్ లో కార్యకలాపాలు కొనసాగించిన ఈటల రాజేందర్ 2018 అసెంబ్లీ ఎన్నికల తరువాత చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయనే చెప్పాలి. రెండో సారి కొలువుదీరిన సర్కారులో ఈటలకు మంత్రి పదవి ఇచ్చే విషయంలో అధిష్టానం విముఖత చూపడంతో ఆయన వ్యక్తం చేసిన అసహనం అంతాఇంతా కాదు. చివరకు హుజురాబాద్ లో నిర్వహించిన ఓ సమావేశంలో గులాభి జెండాకు ఓనర్లం మేం అంటూ కామెంట్ చేయడం సంచలనంగా మారింది. ఉద్యమ కాలంలో పనిచేయని వారికి క్యాబినెట్ లో అవకాశం కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న విషయాన్ని చెప్పకనే చెప్పిన ఈటల చేసిన వ్యాఖ్యలు ఉద్యమకారులను తట్టి లేపాయి. దీంతో గులాభి అధినేత కేసీఆర్ జోక్యం చేసుకోవడంతో మీడియా సంయమనం పాటించాలంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. దీంతో ఈటల రాజేందర్ కు అధిష్టానానికి కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడిందన్న విషయం తేటతెల్లం కాగా ఈటల పయనమెటోనన్న విషయంపై తర్జనభర్జనలు సాగాయి. ఆయన పార్టీలో కొనసాగే పరిస్థితి లేదన్న వాదనలు బలంగా వినిపించినప్పటికీ రెండేళ్ల పాటు నెట్టుకొచ్చారు. చివరకు అసైన్డ్ భూముల వ్యవహారంతో క్యాబినెట్ నుండి బర్తరఫ్ కావడం, పార్టీని వీడి బీజేపీలో చేరడం చకాచకా జరిగిపోయింది.

ఇప్పుడు…

బీజేపీలో చేరే ముందే ఈటల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నికల్లో అధికార పార్టీ ఎత్తులను చిత్తు చేస్తూ ఏడోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు రాజేందర్. ఆయనకు పార్టీ చేరికల కమిటీ బాధ్యతలు అప్పగించిన బీజేపీ జాతీయ నాయకత్వం ఫిరాయింపుదారులను ప్రోత్సహించేందుకు నడుం బిగించాలని నిర్దేశించింది. ఈ క్రమంలో ఈటల రాజేందర్ ఇతర పార్టీల నుండి బీజేపీలోకి చేరాలన్న ప్రతిపాదనలు పలువురి ముందు ఉంచుతున్నా సానుకూల ఫలితాలు రావడం లేదు. దీంతో ఇతర పార్టీల నుండి చేరేందుకు రాకపోవడానికి కారణం బీజేపీలో కోవర్టులు ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. తాజాగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బీజేపీలో చేర్పించుకునేందుకు ఈటల రాజేందర్ తీవ్రంగా ప్రయత్నించారు. అయితే ఈటల ప్రతిపాదనలకు సానుకూలత రాకపోగా ఆయన్నే తనతో కలిసి నడవాలన్న రీతిలో రిటర్న్ కౌన్సిలింగ్ చేస్తున్నారని రాజేందర్ మీడియా ముందు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఖమ్మంలో బీజేపీ బలంగా లేదని అక్కడ కాంగ్రెస్ గట్టి పోటి ఇచ్చే అవకాశం ఉందని కూడా ఛిట్ చాట్ లో అన్నారు. ఈటల చేసిన ఈ వ్యాఖ్యలు బీజేపీతో పాటు ఇతర పార్టీల్లో కూడా సరికొత్త చర్చకు దారి తీశాయి. బీజేపీ బలపడుతోందని, వచ్చే ఎన్నికల్లో తమదే పైచేయంటూ ఆ పార్టీ ముఖ్య నేతలు ఘంటా పథంగా చెప్తున్న క్రమంలో ఈటల రాజేందర్ చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. పార్టీ నేతల ప్రచారం అంతా వట్టిదేనన్నరీతిలో అదే పార్టీలో కొనసాగుతన్న సీనియర్ నేత ఈటల వ్యాఖ్యానించడం పార్టీ వర్గాలను కూడా ఆశ్చర్యానికి గురి చేశాయి. పార్టీ బలహీనంగా ఉందన్న బలహీనమైన వ్యాఖ్యలు మీడియా ముందు చేయడం వల్ల పార్టీ వైపు వచ్చే వారు వెనకడుగు వేసే అవకాశాలు కూడా ఉంటాయన్న వాదనలు కూడా వినిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి బూస్ట్ ఇచ్చినట్టుగా కూడా ఈటల కామెంట్లు ఉండడంతో ఆ పార్టీ కూడా తనకు అనుకూలమైన ప్రచారం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మరోవైపున బీఆర్ఎస్ పార్టీ కూడా ఈటల రాజేందర్ వ్యాఖ్యలు బీజేపీ దీనస్థితికి అద్దం పడుతున్నాయన్న ప్రచారాన్ని కూడా చేస్తోంది. దీంతో ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలోనే హాట్ టాపిక్ గా మారిపోయాయి.

You cannot copy content of this page