ఈటల అనుచరుల చూపు… కాంగ్రెస్ వైపు..?

 

దిశ దశ, హుజురాబాద్ కరస్పాండెంట్:

బీజేపీ రాష్ట్ర నాయకుడు ఈటల రాజేందర్ ఇలాకాలో పార్టీ శ్రేణులు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఆయన అనుచరవర్గంగా ముద్రపడిన వారంతా తమ భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు జరుపుతున్నాయి. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఈటల రాజేందర్ ఓటమి చెందడం… స్థానిక సంస్థల ఎన్నికలు వస్తుండడంతో పొలిటికల్ ఫ్యూచర్ గురించి ఆలోచించి వేరే పార్టీలోకి చేరాలన్న ఆలోచనలో్ఉన్నట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. గత నాల్గైదు రోజులుగా సమీకరణాలు జరుపుతున్న ఈటల అనుచరులు ఆయనతో చర్చించిన తరువాత తుది నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలుస్తోంది.

కాంగ్రెస్ వైపు…

హుజురాబాద్ నియోజకవర్గంలోని ఈటల రాజేందర్ అనుచరుల గణం అంతా కూడా తర్జనభర్జనలు పడుతోంది. తమ రాజకీయ భవిష్యత్తు ఎలా అన్నా అంతర్మథనంలో కొట్టుమిట్టాడుతున్నట్టుగా కనిపిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఒక ఎత్తైతే… ఈటల రాజేందర్ ఓటమి చెందడంతో స్థానిక సంస్థల్లో తాము గెలుస్తామా లేదా అన్న అనుమానం వారిని వెంటాడుతున్నట్టుగా కనిపిస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ వారినే గెలిపించేందుకు ప్రజలు మొగ్గు చూపే అవకాశాలు కూడా ఉండడంతో కాంగ్రెస్ పార్టీలో చేరితే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలో పడిపోయినట్టుగా సమాచారం. వచ్చే స్థానిక ఎన్నికల నాటి వరకే కాంగ్రెస్ పార్టీలో చేరినట్టయితే తమ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్టయితే లాభిస్తుందని భావిస్తున్నట్టుగా సమాచారం. దీంతో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకే మొగ్గు చూపుతున్న ద్వితీయ శ్రేణి నాయకులు ఈటలతో భేటి అయిన తరువాత ఓ నిర్ణయానికి రావాలన్న యోచనలో ఉన్నట్టు తెలిసింది. ఈటల ఎమ్మెల్యేగా గెలిచినట్టయితే ఈ పరిస్థితి ఉండేది కాదని… హుజురాబాద్ ఎమ్మెల్యేగా కౌశిక్ రెడ్డి గెలవడం కూడా వారి అంచనాలను తలకిందులు చేసినట్టయింది. దీంతో ప్రత్యామ్నాయ పార్టీ వైపు అడుగులు వేస్తే ఎలా ఉంటుంది అన్న సమాలోచనల్లో ఈటల క్యాడర్ పడిపోయిందన్న చర్చ జరుగుతోంది.

పొన్నం ఎఫెక్ట్…

కరీంనగర్ ఎంపీగా, సీనియర్ కాంగ్రెస్ నాయకుడయిన పొన్నం ప్రభాకర్ ఎఫెక్ట్ కూడా ఈటల అనుచరులను వెంటాడుతున్నట్టుగా సమాచారం. తాజా ఎన్నికల్లో హుస్నాబాద్ ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా రాష్ట్ర మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టిన పొన్నం ప్రభాకర్ కు సన్నిహితులుగా ఉన్న వారంతా కూడా ఆయనపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలో చేరాలన్న యోచనలో ఉన్నట్టు సమాచారం. చాలా కాలంగా పొన్నం ప్రభాకర్ తో ఉన్న వ్యక్తిగత అనుభందం కూడా తమకు కలిసి వస్తుందని ఇప్పుడే కాంగ్రెస్ పార్టీలో చేరినట్టయితే ఆయన కూడా గుర్తింపు ఇచ్చే అవకాశాలు తప్పకుండా ఉంటాయన్న అభిప్రాయంతో ఈటల అనుచరగణం ఉన్నట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రతిపాదనను పొన్నం వద్ద కూడా తీసుకొచ్చి సానుకూలత వచ్చిన తరువాత జాయిన్ అయితే బావుంటదని ఆలోచిస్తున్న వారూ లేకపోలేదు. ఇక్కడి నుండి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రణవ్ కన్నా ఎక్కువగా పొన్నం ప్రభాకర్ కే హుజురాబాద్ పై పట్టు ఉంటుందని దీనివల్ల ఆయనతో చర్చలు జరిపిన తరువాత ప్రణవ్ తో మంతనాలు సాగించాలన్న భావనలో కొంతమంది క్యాడర్ ఉన్నట్టుగా సమాచారం. ఏది ఏమైనా ఈటల రాజేందర్ అనూహ్య ఓటమి ఆయన అనుచరుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చిందన్న వేదన వ్యక్తం అవుతుండడం విశేషం.

You cannot copy content of this page