ఓట్లడిగినా అంతే… గద్దెనెక్కినా అంతే… ఆయన స్టైల్ ఇంతే…

మంత్రి పొన్నం ప్రభాకర్ తీరు…

దిశ దశ, హుస్నాబాద్:

నిన్న మొన్నటి వరకు జరిగిన ఎన్నికల్లో ఆయన అభ్యర్థిగా వాకర్స్ తో కలిసి మమేకం అయ్యారు. తనను ఆదరించాలని అభ్యర్థిస్తూ ఓటర్లను ఆకట్టుకున్నారు. ఆయన మాటలను విశ్వసించిన అక్కడి ప్రజలు ఆ నేతను అక్కున చేర్చుకుని అసెంబ్లీకి పంపించారు. నాలుగున్నర దశాబ్దాలుగా పార్టీతో పెనవేసుకున్న బంధం ఆయనకు కలిసివచ్చి మంత్రిని చేసింది. అయినా ఆయన శైలి మాత్రం రోటీన్ గా నే సాగుతోంది. మంత్రి హోదాతో దర్పం ప్రదర్శించకుండా ప్రజలతో మమేకం అవుతున్నారు.

పొన్నం ప్రభాకర్ స్టైల్  అంతే

తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పొన్నం ప్రభాకర్ తన సొంత నియోజకవర్గంలో సోమవారం పర్యటించారు. మంగళవారం వేకువ జాము నుండే ఆయన కార్య రంగంలోకి దూకారు. సోమవారం నాటి పర్యటనలో హుస్నాబాద్ ప్రజలు ఆదరించిన తీరును మరిచిపోనని, మీ రుణం తీర్చుకుంటానంటూ భావోద్వేగంగా ప్రసంగించారు. ఎదిగిన కొద్ది ఒదగాలన్న నానుడిని ఒంట పట్టించుకున్న పొన్నం ప్రభాకర్ మంత్రిగా సెక్యూరిటీ నడుమ ప్రజలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించలేదు. అధికారం వచ్చిందన్న ధీమాతో వ్యవహరించడం లేదు. తనను అక్కున చేర్చుకున్న హుస్నాబాద్ బిడ్డలతో కలిసి తిరిగేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రచారం సమయంలో ఎలా అయితే ప్రజల్లో కలిసిపోయి ఓట్లు అభ్యర్థించారో ఇఫ్పుడు కూడా అదే పద్దతిని పాటిస్తున్నారు. సెక్యూరిటీని దూరంగా పెట్టి మార్నింగ్ వాకింగ్ చేస్తూ హుస్నాబాద్ వాసులను కలుస్తూ ముందుకు సాగారు. ఉదయం ఆరు గంటలకే హుస్నాబాద్ అంబేడ్కర్ సెంటర్ నుండి తన కార్యచారణను అమలు చేసే పనిలో నిమగ్నం అయ్యారు పొన్నం ప్రభాకర్, అధికారం వచ్చిందన్న రీతికి దూరంగా ప్రజలతో, పార్టీ శ్రేణులతో కలిసి పట్టణమంతా కలియ తిరిగిన తీరు అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో పొన్నం ప్రభాకర్ అంటే సామాన్య జీవనానికే ప్రాధాన్యత ఇస్తారన్న విషయాన్ని చేతల్లో చూపించారు. తన వద్దకు జనం రావడం కాదు… తానే జనం మధ్య ఉంటానంటూ పొన్నం మార్నింగ్ వాకింగ్ తోనే నిరూపించారు. ఏది ఏమైనా ఇదే విధానంతో పొన్నం ప్రభాకర్ ముందుకు సాగితే హుస్నాబాద్ లో తిరుగులేని నాయకుడనిపించుకుంటాడంటూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంటున్నాయి.

You cannot copy content of this page