జీఎస్టీ ఎగవేతకు భారీ స్కెచ్… బినామీల పేరిట లైసెన్సులు..?

పాలిషింగ్ గ్రానైట్ విక్రయాల్లో దళారుల దందా…

దిశ దశ, కరీంనగర్:

వందలాదిగా వెలిసిన యూనిట్ల మాటున అసలేం జరుగుతోంది..? సర్కారు ఆదాయానికి దళారులు గండి కొడ్తున్న తీరు ఎలా సాగుతోంది..? జీఎస్టీ తక్కువ వసూళ్లకు కారణమేంటీ..?

పాలిషింగ్ యూనిట్లు…

కరీంనగర్ జిల్లాలో వందలాదిగా ఏర్పాటయిన గ్రానైట్ కటింగ్, పాలిషింగ్ యూనిట్లలో సాగుతున్న క్రయ విక్రయాల్లోకి దళారులు రంగ ప్రవేశం చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. వీరు వినియోగదారులకు లాభం చేకూర్చుతున్నామన్న ముసుగు తొడిగి సర్కారు ఆదాయానికి భారీగా గండి కొడుతున్నట్టుగా తెలుస్తోంది. కటింగ్, పాలిషింగ్ చేసిన గ్రానైట్ అమ్మకాలపై 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇందులో సగానికి తక్కువ డబ్బులు వసూలు వేసి బిల్లులు ఇచ్చే విధానం కొనసాగుతున్నట్టుగా సమాచారం. వినియోగదారులు కూడా తమకు సగానికి పైగా డబ్బు ఆదా అవుతుండడంతో జీఎస్టీ ఎగవేతకు సై అంటున్నట్టుగా సమాచారం. దీంతో రోజూ ప్రభుత్వం రూ. లక్షల్లో ఆదాయాన్ని కోల్పోతుండగా, నిబంధనల మేరకు నడుపుతున్న యూనిట్ల యజమానులు రుణాలు చెల్లించలేక ఇక్కట్లు పడుతున్నారు.

నకిలీ బిల్లులా..?

అంతా ఆన్ లైన్ లోనే సాగుతున్నప్పటికీ వినియోగదారుల నుండి మాత్రం 35 నుండి 40 శాతం వరకు జీఎస్టీ వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పారదర్శకంగా సాగుతున్నప్పటికీ 18 శాతం జీఎస్టీ వసూలు చేయకుండా ఎలా వ్యాపారం కొనసాగిస్తున్నారన్నదే అంతు చిక్కకుండా పోతోంది. లక్ష రూపాయల బిల్లుపై రూ. 18 వేలు చెల్లించాల్సి ఉండగా, రూ. 7 వేల వరకు చెల్లించినా బిల్లులు ఇస్తామని కొంతమంది దళారులు దర్జాగా చెప్తున్నారు. దీంతో ప్రభుత్వం సగానికి పైగా జీఎస్టీ రూపంలో రావల్సిన ఆదాయన్ని కోల్పోతోంది. కొంతమంది గ్రానైట్ పాలిషింగ్, కటింగ యూనిట్లకు సంబంధించిన వారు ఈ అక్రమ దందాకు తెరలేపారని గ్రానైట్ జోన్ అంతా కోడై కూస్తున్నా పట్టించుకునే వారు లేకుండా పోయారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఈ దళారులు బిల్లులు చెల్లిస్తున్నట్టుగా ఆన్ లైన్ లో చూపిస్తున్నప్పటికీ వినియోగదారుల నుండి మాత్రం 18 శాతం జీఎస్టీ వసూలు చేయకపోవడానికి కారణం ఏంటన్నదే పజిల్ గా మారింది. సాంకేతికతలో లోని లోపాలను అంది పుచ్చుకుని తక్కువ జీఎస్టీ వసూలు చేస్తున్నారా లేక మరేదైనా మార్గంలో అక్రమాలకు పాల్పుడతున్నారా అన్న చర్చ కూడా గ్రానైట్ పరిశ్రమల వర్గాల్లో సాగుతోంది.

బినామీలా..?

అయితే జీఎస్టీ లైసెన్సులు బినామీల పేరిట తీసుకుని జీఎస్టీ పేరిట తక్కువగా వసూలు చేస్తున్నారన్న ప్రచారం కూడా సాగుతోంది. కొంతమంది అమాయకులను మచ్చిక చేసుకుని వారి పేరిట జీఎస్టీ లైసెన్స్ తీసుకుని బిల్లులు ఇస్తున్న దళారులు సదరు లైసెన్స్ దారున్ని బ్లాక్ లిస్టులోకి చేర్చినా తాము మాత్రం సేఫ్ జోన్ లో ఉంటామన్న ధీమాతో దందా కొనసాగిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. సామాన్యుల పేరిట లైసెన్సులు ఉండడం వల్ల సంబంధిత శాఖ అధికారులు ప్రభుత్వ ఆదాయిని గండి పడిన విషయపై దాడులు చేసినట్టయితే లైసెన్స్ దారుడు డబ్బు చెల్లించే స్థితిలో లేడన్న కారణంతో కేసును క్లోజ్ చేస్తారని భావించే ఈ వ్యూహానికి తెరలేపినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఒక వేళ ఇదే నిజమైతే మాత్రం దళారులు స్కెచ్ వేసి సర్కారు ఖజానకు ఏ స్థాయిలో తూట్లు పొడుస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

విచారణ చేపడితే…

కరీంనగర్ జిల్లాలోని గ్రానైట్ కటింగ్, పాలిషింగ్ యూనిట్లకు చెందిన కొంతమంది ప్రభుత్వ ఆదాయాన్ని దారి మళ్లిస్తున్న విషయపై సమగ్రంగా విచారణ చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. జీఎస్టీ ఎగవేస్తున్న తీరుపై సాంకేతికతతో పాటు బినామీ లైసెన్స్ దారుల పేరిట సాగిస్తున్న అక్రమ దందాకు పుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇవే కాకుండా వేరే ఇతర మార్గాలు ఏమైనా ఎంచుకుని జీఎస్టీ పేరిట తక్కువ నగదు వసూలు చేస్తున్న గుట్టును రట్టు చేయాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ప్రభుత్వానికి కూడా పెద్ద ఎత్తున ఆదాయం సమీకరించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా సర్కారు ఆదాయానికి గండి పెట్టిన వారిపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకున్నట్టయితే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కావన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పరిశ్రమల యజమానులు గతంలో ఈ విషయాన్ని పసిగట్టి జీఎస్టీ ఎగవేస్తున్న తీరుపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. ఈ మేరకు జీఎస్టీ తక్కువ చెల్లిస్తున్న తీరును కట్టడి చేసేందుకు పూనుకోవడంతో అప్పుడు ప్రభుత్వానికి ఆదాయం కూడా బాగా పెరిగింది. నిబంధనల మేరకు నడుపుతున్న పరిశ్రమల వద్ద గ్రానైట్ కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతుండకపోవడంతో రుణాల తాలుకు వాయిదాలు కూడా చెల్లించే పరిస్థితి లేకుండా పోతోందని ఆందోళన చెందిన వారు కట్టడి చర్యలకు శ్రీకారం చుట్టారు. అయితే కొంతకాలానికి షరా మామూలే అన్నట్టుగా మారిపోవడంతో పరిశ్రమల యజమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

You cannot copy content of this page