SAND: తనిఖీ కేంద్రాలు సరే… అక్రమ రవాణా మాటేమిటో..?

ఇసుక దందాపై సరికొత్త చర్చ

దిశ దశ, భూపాలపల్లి:

గోదావరి, మానేరు నదుల్లో ఏర్పాటు చేసిన ఇసుక రీచుల నుండి జీరో దందా కట్టడి చేసేందుకు పకడ్బందీ చర్యలు తీసుకున్నా లాభం లేదా..?  మూడు చోట్ల ప్రత్యేకంగా తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ అందరి కళ్లు గప్పి పట్టణాలకు జీరో ఇసుక ఎలా వెళ్తోందన్నదే పజిల్ గా మారింది.

తనిఖీ కేంద్రాలు…

జిల్లాలోని కాటారం మండలం మండలం మద్దులపల్లి, గంగారాం క్రాస్ రోడ్, పెద్దపల్లి జిల్లా మంథని సమీపంలోని ఎక్లాస్ పూర్ వద్ద TGMDC తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసి ఇసుక అక్రమ రవాణా కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. కొన్నేళ్ల క్రితం ఏర్పాటు చేసిన చెకింగ్ పాయింట్స్ వద్ద TGMDC అధికారులు కాంట్రాక్టు విధానం ద్వారా నియమించుకున్న  తనిఖీలు చేయిస్తున్నారు. అయితే ఈ చెకింగ్ పాయింట్స్ ఉన్నప్పటికీ లారీల్లో జీరో దందా సాగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరగాలని యోచిస్తున్న అదికారులు కట్టడి చర్యలు తీసుకుంటున్నప్పటికీ అక్రమంగా తరలిపోతున్న ఇసుక మాత్రం తన దారి తాను చూసుకుంటూ పట్టణాలకు చేరుకుంటుండడమే విస్మయం కల్గిస్తోంది. గతంలో హైదరాబాద్ నగరానికి వెల్లే పలు ప్రధాన రహధారులతో పాటు ఇతర మార్గాల గుండా వెల్తున్న ఇసుక లారీలను విజిలెన్స్ అధికారులు, ఆర్టీఏ అధికారులు పట్టుకున్న ఘటనలే ఇసుక జీరో దందాకు నిదర్శనమని చెప్పవచ్చు.

వే బిల్లులకే పరిమితం…

అయితే ప్రతి రీచు వద్ద ప్రత్యేకంగా ధర్మ కాంటాలను ఏర్పాటు చేయాలన్న నిబంధనలు ఉన్నాయి. ఈ వే బ్రిడ్జిల వద్ద తూకం వేసిన తరువాతే లారీలు బయటకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఎన్నీ రీచుల వద్ద ధర్మ కాంటాలు ఉన్నాయి..? ఉన్న వాటిలో ధర్మ బద్దమైన తూకం సాగుతోందా అన్నది తూనికలు కొలతల శాఖ, TGMDC అధికారులకే తెలియాలి. ప్రతి రీచులోనూ అదనపు బకెట్ల దందా కొనసాగిస్తున్న విషయం బహిరంగ రహస్యమే. లారీ సామర్థ్యానికి మించి రెండు నుండి మూడు బకెట్ల ఇసుక లోడ్ చేస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. అయితే అధికారులు ఏర్పాటు చేసిన ఈ తనిఖీ కేంద్రాల వద్ద కేవలం లారీ నంబర్, వే బిల్లులో ఉందా లేదా అని సరి చూసుకుని మాత్రమే పంపించాల్సి ఉంటుంది. కానీ లారీల్లో తరలిపోతున్న ఇసుక పరిమితికి మించి ఉందా లేదా అని తనిఖీ చేసే అవకాశం మాత్రం లేదు. కేవలం వే బిల్లులు రీ సైక్లింగ్ కాకుండా ఉండేందుకు మాత్రమే చెకింగ్ పాయింట్స్ ఉపయోగ పడుతున్నాయని అధికారులు చెప్తున్నారు. అయితే ఇక్కడ కొన్ని లారీలకు నెంబర్ ప్లేట్లు మార్చి కూడా ఇసుక తరలిస్తున్న సంఘటనలు కూడా లేకపోలేదు. గతంలో కాటారం సబ్ డివిజన్ పోలీసులు లారీ నంబర్లు మార్చి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న విషయాన్ని బహిర్గతం చేశారు. లారీల ఛాసిస్ నెంబర్ల ఆధారంగా తనిఖీలు చేసినట్టయితే అసలు విషయంలో వెలుగులోకి వస్తుందని అంటున్నారు కొందరు. అంతేకాకుండా తనిఖీ కేంద్రాల కళ్లుగప్పి కూడా కొన్ని వాహనాలు జీరో దందా కొనసాగిస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏడాది క్రితం కాటారం సర్కిల్ పోలీసులు నైట్ పెట్రోలింగ్ డ్యూటీ చేస్తున్నప్పుడు మల్హర్ మండలం మీదుగా రుద్రారం వరకు తరలిపోతున్న లారీలను గుర్తించిన సంగతి తెలిసిందే. జీరో ఇసుక దందా కొనసాగిస్తున్నారని గుర్తించిన పోలీసు అధికారులు రుద్రారం రహదారితో పాటు తాడిచర్ల, మల్లారం పరిసర ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేయడంతో జీరో దందా గుట్టు రట్టయింది. అయితే అక్రమంగా తరలిపోతున్న ఇసుక వాహనాలను కట్టడి చేసేందుకు TGMDC ప్రత్యక్ష్య కార్యాచరణ ఎందుకు చేపట్టడం లేదన్నది అంతుచిక్కకుండా పోతోంది. జీరో దందా, ఓవర్ లోడ్ విధానానికి బ్రేకులు వేసినట్టయితే ప్రభుత్వానికి అదనంగా సగానికి సగం ఆధాయం పెరిగే అవకాశాలు ఉంటాయన్నది బహిరంగ రహస్యమే. అయినా TGMDC చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తున్న తీరు విస్మయపరుస్తోంది.

You cannot copy content of this page