కరీంనగర్ పోలీసుల దూకుడు…
దిశ దశ, కరీంనగర్:
శంఖంలో పోస్తే తీర్థం అవుతుందంటారు… కానీ కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు మాత్రం శఖంలో పోసినా ఆ తీర్థం కలుషితమనిపిస్తే మాత్రం వదిలిపెట్టేది లేదంటూ చేతల్లోనే చూపిస్తున్నారు. కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి బాధ్యతలు తీసుకున్న తరువాత సివిల్ మ్యాటర్ ముసుగేసి మరీ నేరాలకు పాల్పడిన వారి భరతం పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధితులు ఇస్తున్న ఫిర్యాదులను పరిశీలిస్తున్న ఎకానామిక్స్ అఫెన్సెస్ వింగ్ లోతుగా అధ్యయనం చేసి… డాక్యూమెంట్ ఎవిడెన్స్ సేకరించిన తరువాతే చట్టపరమైన చర్యలకు శ్రీకారం చుడుతోంది. అయితే కరీంనగర్ పోలీసుల నుండి తప్పించుకోవాలంటే అధికార పార్టీలో చేరితే సేఫ్ అవుతామని భావించినప్పటికీ లాభం మాత్రం ఉండడం లేదు. నేరం చేశారని డాక్యూమెంట్ల ద్వారా తేలితే చాలు క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి వెనకాడేది లేదని కుండబద్దలు కొడుతున్నారు. మంగళవారం కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని వివిధ స్టేషన్లలో మూడు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో నిందితులను అరెస్ట్ చేయగా కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.
రికార్డులు మార్చి…
కరీంనగర్ సమీపంలోని చింతకుంటలో పామ్ రాజ్ దేవరాజ్ కు 106 ఎకరాల 8 గంటల వ్యవసాయ భూమి ఉండేది. ఈ భూమిని విక్రయించుకోగా 20 గుంటల స్థలం మిగిలి ఉంది. అయితే ఈ భూమికి సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో పట్టాదారు పేరు మారిపోయి న్యాలమడుగు చిన వీరయ్య పేరు చేరింది. అయితే చింతకుంట సర్పంచ్ గా వ్యవహరించిన పిట్టల రవిందర్ వీరయ్య అనే పేరుగల మరో వ్యక్తి కొడుకు రాజయ్య పేరిట తప్పుడు విరాసత్ చేయించారు. ఇందుకు అప్పుడు ఎమ్మార్వోగా ఉన్న మోహన్ రెడ్డి కూడా పిట్టల రవిందర్ కు సహకరించారు. రెవెన్యూ రికార్డుల్లోకి రాజయ్య పేరిట భూమి బదలాయింపు ప్రక్రియ పూర్తికాగానే 2009లో ఆదిరెడ్డి పేరిట మార్చి 2010లో పిట్టల రవిందర్ తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. బాధితుడు దేవిదాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడు పిట్టల రవిందర్ ను కోర్టులో హాజరు పర్చగా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.
ఒకే భూమిని పలువురికి విక్రయించి…
తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మొగిలిపాలెం గ్రామంలోని ఓ భూమిని పలువురికి విక్రయించిన కేసులో కార్పోరేటర్ భర్త ఆకుల ప్రకాష్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. తొమ్ముడ్రు నర్సింహారావు వద్ద 1998 లో ప్లాటును కొనుగోలు చేశాడు. నర్సింహారావు 1998 లో సర్వే నంబర్ 159/F లో 10 గుంటలు , 161/F లో 09 గుంటలు . 162/F లో 14 గుంటలు మొత్తం 33 గుంటలు కరీంనగర్ జిల్లా వల్లంపహాడ్ లో గల భూమిని ఖరీదు చేసి ప్లాట్ లుగా విభజించి పలువురికి విక్రయించగా సంపత్ కొనుగోలు చేశాడు. ఈ భూమికి పంబంధించిన తప్పుడు `విక్రయ దస్తావేజు రిజిస్ట్రేషన్ చేయించుకుని, కరీంనగర్ గోదాం గడ్డకు చెందిన అబ్దుల్ హఫీజ్ కు 33 గుంటలు
గుత్తాగా విక్రయించారు. అందులో సర్వే నెంబర్ 159/F లో గల 10 గుంటల భూమిని కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన 7వ డివిజన్ కార్పోరేటర్ భర్త ఆకుల ప్రకాష్ పేరిట రిజిస్ట్రేషన్ చేశాడు. ఈ భూమిలో 3 గుంటలు , కరీంనగర్ కట్టరాంపూర్ కు చెందిన ఉప్పు సురేష్ కు, కరీంనగర్ వావిలాలపల్లికి చెందిన కట్ట రమ్యలు తక్కువ ధరకు కొనుగోలు చేసి అసలు విక్రయదారులను భూమిలో్కి రానివ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ ఏ ప్రదీప్ కుమార్ కేసు నమోదు చేసి నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి దుర్బుద్ధితో భూమిని కాజేయాలని ప్రయత్నించిన మరియు సహకరించిన ఐదుగురిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో కార్పోరేటర్ భర్త ఆకుల ప్రకాష్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చగా 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.
నకిలీ సాదా బైనామాతో…
కరీంనగర్ చొప్పదండి మండలం వెదురుగట్ట గ్రమానికి చెందిన పంబాల శ్రీనివాస్ తీగలుగుట్టపల్లి లోని కార్తికేయనగర్ లో తన తండ్రి సింగరేణి ఉద్యోగం విరమణ పొందడంతో వచ్చిన డబ్బుతో సర్వే నెంబర్ 233/E లో గల ప్లాట్ నెంబర్ 120/A గల 200 చదరపు గజాలు శ్రీమతి గట్టు లక్ష్మి పేరిట గల ఇంటి నివేశన స్థలాన్ని కొనుగోలు చేశారు.. ఈ స్థలం లో ఇంటి నిర్మాణానికి 2022లో మున్సిపాలిటీ ద్వారా అనుమతి కూడా తీసుకుని నిర్మాణం మొదలు పెట్టారు. కరీంనగర్ కాపువాడకు చెందిన తిరుపతి, విష్ణువర్ధన్, మంద నగేష్, తీగలగుట్టపల్లికి చెందిన కొమ్ము భూమయ్య లు భూమి వద్దకు వచ్చి ఈ భూమి మంద నగేష్ దని… గతంలో ఈ భూ యజమాని బద్రుద్దీన్ నుండి మంద నగేష్ సాదా బైనామా ద్వారా కొనుగోలు చేశారని చెప్పారు. ఇందుకు నకిలీ విక్రయం పత్రం కూడా చూపడంతో ఇట్టి భూమిని వదిలేయాలంటే రూ. 20 లక్షలఇవ్వాలని లేదంటే ఈ భూమి దక్కకుండా చేస్తామని బెదిరించారు. అయితే డబ్బు చెల్లించుటకు గడువు కోరిన బాధితుడు వీరి గురించి వాకడు చేయగా… తన వద్దకు వచ్చిన తిరుపతి విష్ణువర్ధన్ పై కరీంనగర్ వన్ టౌన్ లో 09 పైగా కేసులు ఉండడంతో రౌడీ షీట్ ఓపెన్ అయిందని తెలిసింది. అయితే అప్పటికే వారికి భయపడి 2022 డిసెంబర్ నెలలో రూ. 3.5 లక్షలు, 2023 జనవరిలో రూ. 75 వేలు ఫోన్ పే ద్వారా చెల్లించానని బాధితుడు వివరించాడు. మరోసారి రూ. 75 వేలతో కలిపి మొత్తం రూ. 5 లక్షలు చెల్లించాడు. మిగతా రూ. 15 లక్షలు కూడా ఇవ్వాల్సిందిగా అనేక మార్లు ఇబ్బందులకు గురిచేశారు. మరోసారి గడువు కోరిన బాధితుడు సాదా బైనామా గురించి తెలుసుకోగా కావాలనే తప్పుడు సాదా బైనామా, నకిలీ విక్రయ ఒప్పంద పత్రాలను సృష్టించారని తెలుసుకున్నాడు. అప్పటి నుండి వారికి డబ్బులు ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్న క్రమంలో అతని ఇంటికి వచ్చి మిగతా డబ్బు ఇవ్వకపోతే చంపుతామని హెచ్చరించారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నకిలీ పత్రాలు సృష్టించిన వారిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో తిరుపతి విష్ణువర్దన్, మంద నగేష్ లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచాగా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశించింది.