వ్యక్తి స్వేచ్ఛకు భంగం…
పర్సనల్ డాటా ఎలా చేరుతోంది..?
దిశ దశ, కరీంనగర్:
అప్పు ఇచ్చువాడు వైద్యుడు లేని ఊర్లో ఉండకూడదన్నది ఓ నానుడి… అయితే ఇప్పుడా పరిస్థితులకు పూర్తి భిన్నంగా సాగుతున్నాయి. ఫైనాన్స్ రంగంలోకి కార్పోరేట్ కంపెనీల అడుగు పెట్టిన తరువాత సీన్ పూర్తిగా మారిపోయింది. సాఫీ జీవనం సాగిస్తున్న సామాన్యుడి పరిస్థితి అయోమయంగా తయారైంది. ఓ బ్యాంకుతో లావాదేవీలు జరిపితే చాలు ఇతర బ్యాంకుల నుండి కాల్స్ వస్తూనే ఉంటాయి.
DSAలతో…
అప్పు తీసుకునే వరకూ వదిలిపెట్టకుండా వరసగా ఫోన్లూ చేస్తూనే ఉంటాయి ప్రేవేట్ ఏజెన్సీలు. ఆయా ఫైనాన్స్ కంపెనీలు ప్రైవేటు ఏజెన్సీలను పెట్టుకుని మరీ ఫోన్లు చేయిస్తున్న తీరు సామాన్యునికి సంకట పరిస్థితులు కల్పిస్తున్నాయి. Direct Selling Agent (DSA)ల ద్వారా బ్యాంకులందించే సేవలపై అవగాహన కల్పిస్తూ రుణాలు అవసరం ఉన్నవారికి సహకారం అందించేందుకు ఏర్పాటు అయ్యాయి ఈ ఏజెన్సీలు.ఇందుకు రిజర్వూ బ్యాంకు ఆఫ్ ఇండియా దాని అనుసంధానంగా ఉన్న NBFC వంటి సంస్థల అనుమతి ఇస్తున్నాయి. అయితే ఈ విధానమే ఇప్పుడు సామాన్యుడి స్వేచ్ఛను హరిస్తున్నట్టుగా తయారైంది. కార్పోరేట్ ఫైనాన్స్ కంపెనీలు అందించే సేవలకు సంబంధించిన లోన్లు, క్రెడిట్ కార్డుల, రూపే కార్డులు ఇలా సవాలక్ష రకాలకు సంబంధించిన అంశాలపై వినియోగదారులకు గాలం వేసే బాధ్యతలు DSAలకు అప్పగిస్తున్నాయి ఆయా సంస్థలు. ప్రైవేటు ఏజెన్సీల చేతిలో బ్యాంకులతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరి డాటా చేరుతున్న తీరు ఆందోళన కల్గిస్తోంది. మారమూల గ్రామంలో ఉన్న వారయినా సరే ఫైనాన్స్ రంగంతో అనుబంధం ఉంటే చాలు ఆయా ఫైనాన్స్ కంపెనీల చేతుల్లోకి డాటా చేరిపోతోంది. వాస్తవంగా వినియోగదారునికి అవగాహన కల్పించేందుకు, రుణాలు పొందేందుకు అవసరమైన సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన DSAలు ఇప్పుడు సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ సంస్థలు ఆయా ఫైనాన్స్ రంగ సంస్థలతో పర్మిషన్ తీసుకున్న తరువాత ప్రత్యేకంగా ఉద్యోగులను నియమించుకుని మరీ సామాన్యులకు ఎరవేసే పనికి పూనుకుంటున్నాయి. DSAలలో పనిచేస్తున్న వారు వినియోగదారుల CBILL స్కోర్ చూసి… గుడ్ స్కోర్ ఉంటే చాలు ఫోన్లు చేస్తూ ఇబ్బందులు పెట్టడం పరిపాటిగా మారింది. మేం ఫలానా బ్యాంకు నుండి మాట్లాడుతున్నామంటూ DSAల ప్రతినిధులు ఫోన్లు చేస్తుంటేనే ఉంటున్నారు. CBILL score బావుందా లేదా అన్న విషయాన్ని Onlineలో చెక్ చేసుకుని చకచకా ఫోన్లు చేసేస్తున్నారు. ప్రభుత్వ, ప్రేవేట్ రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారి జీతభత్యాల వివరాలు కూడా DSAల వద్దకు చేరుకుంటున్నాయాంటే ఏ స్థాయిలో వ్యక్తిగత వివరాలను కార్పోరేట్ ఫైనాన్స్ వ్యవస్థ చేతుల్లోకి వెలుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
10 నుండి 20…
ఇకపోతే ఉదయం 10 దాటిందంటే చాలు సిబిల్ స్కోర్ బావున్న వారు, వేతనాలు భారీగా అందుకునే వారి ఫోన్లు మోగుతూనే ఉంటాయి. సాయంత్రం వరకు కూడా ఆయా ఏజెన్సీలు ఫోన్లు చేస్తూనే ఉంటాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఫైనాన్స్ కంపెనీలతో టైఅప్ అయిన ఈ ఏజెన్సీలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయనే చెప్పాలి. ఒక్కో రోజు 10 నుండి 20కి పైగా కాల్స్ ఆయా ఫైనాన్స్ రంగ సంస్థలకు సంబంధించిన ఏజెన్సీల ప్రతినిధుల ఫోన్లు రిసివ్ చేసుకోవల్సిన పరిస్థితి దాపురించింది. DNB విధానంతో ఇలాంటి కాల్స్ ను నిరోధించుకునే విదానం అమల్లో ఉందని ట్రాయ్ చెప్తోంది. అయితే ఈ విధానం గురించి దేశంలో ఎంతమందికి అవగాహన ఉందో కూడా ఆలోచించాలి. అయితే ఇక్కడ తనకు కాల్స్ రాకుండా సామాన్యుడు జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కార్పోరేట్ ఫైనాన్స్ కంపెనీలు, ప్రైవేట్, గవర్నమెంట్ సెక్టార్ లలో పనిచేస్తున్న వారి డాటా అంతా ప్రైవేటు సంస్థల వద్దకు చేరడం సేఫ్టీయేనా కాదా అన్న విషయంపై తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది.
సైబర్ క్రిమినల్స్ చేతుల్లోకి…
ఇకపోతే సైబర్ క్రిమినల్స్ ప్రపంచాన్నే గడగడలాడిస్తున్నారు. వీరి చేతుల్లోకి డాటా ఎలా చేరుతుందో తెలియదు కానీ స్మార్ట్ ఫోన్లు వాడే సామాన్యులు అప్రమత్తంగా ఉండకతప్పడం లేదు. స్మార్ట్ ఫోన్లలోని డాటా సేకరించి క్రిమినల్స్ అకౌంట్లను ఖాలీ చేస్తున్నారన్న విషయాన్ని మాత్రమే ఇప్పటికి సైబర్ సెక్యూరిటీ వింగ్ గుర్తించింది. కానీ స్మార్ట్ ఫోన్లు లేని కాలంలో కూడా డెబిట్ కార్డుల బ్లాక్ అయ్యాయంటూ ఫోన్లు చేసి అకౌంట్ల నుండి డబ్బులు బదిలీ చేసుకున్న ఘటనలూ ఉన్నాయన్న విషయం గమనించాల్సిన అవసరం ఉంది. కార్పోరేట్ ఫైనాన్స్ సంస్థలు ఏర్పాటు చేసుకుంటున్న DSA నిర్వాహకులు మాత్రమే అగ్రిమెంట్స్ చేసుకుంటున్నాయి. కానీ అందులో పని చేస్తున్న ఉద్యోగులను నియమించుకునేది మాత్రం సదరు ఏజెన్సీ నిర్వాహకులేనన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఆయా ఏజెన్సీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల నుండి కూడా డాటా లీకయ్యే అవకాశాలపై కూడా దృష్టి సారించాలి. అంతేకాకుండా కేవలం స్మార్ట్ ఫోన్ల ద్వారా మాత్రమే సైబర్ క్రిమినల్స్ డాటా తీసుకుంటున్నారా లేక ఆయా కార్పోరేట్ కంపెనీల సాఫ్ట్ వేర్ వేర్ ద్వారా స్మార్ట్ గా కలెక్ట్ చేసుకుంటున్నారా అన్న విషయాలపై కూడా ఆరా తీయాల్సిన అవసరం ఉంది.
కట్టడి చేయాల్సిందే: అడ్వకేట్ పరమేశ్వర్
డాటా చౌర్యంపై దృష్టి సారించి కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. సాధారణ వ్యక్తుల పూర్తి వివరాలు ప్రతి ఫైనాన్స్ కంపెనీలకు చేరుతుండడంతో అప్పులిస్తామని లోన్ యాప్స్ ప్రతినిధులు, క్రెడిట్ కార్డులు ఇస్తామని ఫైనాన్స్ కంపెనీల ఉద్యోగులు ఫోన్లు చేస్తున్న తీరు ఆందోళన కల్గిస్తోంది. వ్యక్తి స్వేచ్ఛకు భంగం కల్గిస్తున్న తీరుపై రిజర్వూ బ్యాంక్, ట్రాయ్ దృష్టి సారించి డాటా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెల్లకుండా చర్యలు చేపట్టాలి. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసే విధంగా కార్పోరేట్ ఫైనాన్స్ సంస్థలు వ్యవహరిస్తున్న తీరు ఆక్షేపణీయంగా మారింది. చట్టాలకు పని చెప్పి కార్పోరేట్ సంస్థలు ఏర్పాటు చేసకుంటున్న ఏజెన్సీల విషయంలో నిబంధనలు కఠినతరం చేయాలి. లోన్ యాప్స్ ద్వారా రుణాలు పొంది కొంతమంది అధిక వడ్డీలు చెల్లించలేక ఆత్మహత్య చేసుకున్న సందర్భాలూ ఉన్నాయి. కాబట్టి డాటా చౌర్యం కాకుండా ఉండేందుకు కార్పేరట్ ఫైనాన్స్ రంగాన్ని కట్టడి చేయాలి.