బీసీ నినాదంలోనూ… మిగిలింది అగ్రవర్ణాలే..!

దిశ దశ, కరీంనగర్:

బీసీ నినాదం అత్యంత బలంగా వినిపించింది… ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తెరపైకి వచ్చిన ఈ వాదం గెలుపోటములను శాసిస్తుందేమోనని ప్రధాన పార్టీల నాయకలు ఆందోళన చెందగా బీసీ నేతలు కూడా తమ మార్క్ రాజకీయాలకు కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వేదికగా నిలుస్తాయని అంచనా వేశారు. పోలింగ్ ముగిసిన తరువాత కూడా బీసీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ గెలవడం పక్కా అన్న చర్చే జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. జాతీయ పార్టీలు రెండూ కూడా ‘‘రెడ్డి’’ సామాజిక వర్గానికి చెందిన వారికే టికెట్లు ఇచ్చాయన్న ప్రచారం కూడా విస్తృతంగా జరిగింది. దీంతో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు తెరమరుగైపోతారని భావించారంతా.

కౌంటింగ్ తరువాత…

సమాజంలో బీసీ నినాదం వినిపించినంత బలం ఓటు విషయానికి వచ్చేసరికి బలహీన పడిపోయినట్టుగా స్పష్టం అయింది. బీసీ కార్డు ప్లే చేసేందుకు ఎన్నికల సమయంలోనే ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి మరీ తమ వ్యూహాలకు పదును పెట్టారు బీసీ సంఘాల ముఖ్య నేతలు. దీంతో తమ పని అయిపోయినట్టేనా అన్న కలవరం అభ్యర్థుల్లో మొదలైంది. కానీ కౌంటింగ్ జరిగిన తరువాత సొసైటీలో వచ్చిన టాక్ కు బీసీ అభ్యర్థి అయిన ప్రసన్న హరికృష్ణకు వచ్చిన ఓట్లకు ఏ మాత్రం పొంతన లేకుండా పోయింది. గెలుస్తాడని బల్లగుద్ది మరీ చెప్పుకున్నప్పటికి ఆయన మూడో స్థానానికి పరిమితమై ఎలిమిషన్ రౌండ్ లో తెరమరుగు కావల్సి వచ్చింది. బీసీ వాదం బలంగా వినిపించడంలో విఫలం అయ్యారా లేక అగ్రవర్ణాల ప్రభావం ఇంకా బీసీలపై ఉందా అన్న విషయంపై పోస్టుమార్టం చేసుకోవల్సిన ఆవశ్యకత ఏర్పడింది బీసీ సంఘాల నేతలకు. ప్రసన్న హరికృష్ణకు వచ్చిన ఓట్లు ఎన్ని..? పట్టభద్ర ఓటర్లలో బీసీలు ఎంతమంది ఉన్నారో బేరీజు వేసుకుని ముందుకు సాగాల్సిన ఆవశ్యకత ఉంది. బీసీని ముఖ్యమంత్రి చేయాలన్న నినాదం కూడా వినిపిస్తున్న వారు బీసీ సమాజంలో తీసుకరావల్సిన మానసిక మార్పు ఏంటో గుర్తించాల్సిన అవసరాన్ని ఈ ఎన్నికలు తేల్చి చెప్పాయి. సెమినార్లు, అంతర్గత సమావేశాలు, అగ్రవర్ణాలే లక్ష్యంగా విమర్శలు చేయడం కాకుండా సామాజిక మార్పు కోసం ప్రయత్నిస్తే తప్ప బీసీ వాదాన్ని ఓటుగా మల్చుకునే అవకాశం ఉండదన్న విషయాన్ని గుర్తెరగాలని కరీంనగర్ గ్యాడ్యూయేట్స్ ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చిన తీర్పు స్పష్టం చేస్తోంది.

You cannot copy content of this page