కరీంనగర్ కార్పోరేషన్ లో మారిన తీరు..! బల్దియా సమావేశంలో బుజ్జగింపుల పర్వం

దిశ దశ, కరీంనగర్:

అధికారంలో ఉన్నామన్న ధీమానో ప్రతిపక్ష సభ్యులను పరిగణనలోకి తీసుకోవడం ఎందుకు అనుకున్నారో ఏమో కానీ ప్రతిపక్ష సభ్యులంటే విలువ ఇచ్చిన దాఖలాలే లేవు నాడు. కానీ ఆ నాటి పరిస్థితులకు పూర్తి భిన్నంగా సాగింది కరీంనగర్ కార్పోరేషన్ మీటింగ్. అధికార పక్ష సభ్యులు హాడావుడిగా ఏక వాక్య తీర్మాణంతో ఏజెండాలోని అంశాలకు ఆమోదం తెలిపి ప్రతిపక్ష సభ్యుల వాదనలకు ఏ మాత్రం విలువ కూడా ఇవ్వని సందర్భాలు ఎన్నో. అయితే సోమవారం జరిగిన కరీంనగర్ బల్దియా మీటింగ్ మాత్రం అప్పటి పరిస్థితులకు పూర్తి భిన్నంగా సాగింది.

బీజేపీ సభ్యుడి హల్ చల్… 

బీజేపీ కార్పోరేటర్ పెద్దపల్లి జితేందర్ సోమవారం నాటి సమావేశంలో హల్ చల్ చేశారు. స్మార్ట్ సిటీ అభివృద్ది కోసం గత సెప్టెంబర్ లోనే కేంద్ర ప్రభుత్వం తన వాటా వంద కోట్లు మంజూరు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు విడుదల కాలేదని మండి పడ్డారు. సెప్టెంబర్ లో కేంద్రం 100 కోట్ల నిదులు అలాట్ చేసిన తరువాత ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండి వంద కోట్లు మంజూరు చేయించుకోవడంలో కార్పోరేషన్ పాలకవర్గం ఫెయిల్ అందని జితేందర్ ఆరోపించారు. అప్పుడే వంద కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్టయితే కరీంనగర్ అభివృద్ది మరింత జరిగేది కదా అని అన్నారు. స్మార్ట్ సిటీకి కేంద్రం ఇస్తానని చెప్పినట్టుగానే మరో వంద కోట్లు కెటాయిస్తే బల్దియా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వ వాటాను ఇప్పించుకోవడంలో ఫెయిల్ అయిందని విమర్శించారు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయిందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని దీంతో ఈ వంద కోట్లు ఎలా అలాట్ చేయించుకుంటారని జితేందర్ ప్రశ్నించారు. నాడు స్క్రాప్ అంటూ కించపర్చిన పొన్నం ప్రభాకర్ ఇప్పుడు మంత్రి అయ్యారని… వంద కోట్లు మంజూరు చేయాలని కోరేందుకు ఆయన వద్దకు ఏ మొఖం పెట్టుకుని వెల్తారని ప్రశ్నించారు. అంతేకాకుండా గత నాలుగేళ్లుగా జరిగిన ఇంటి నిర్మాణాల అనుమతలపై విచారణ జరపాలని తాము కూడా అక్రమ నిర్మాణాలను చూపిస్తామని ఇందుకు కార్పోరేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలని జితేందర్ డిమాండ్ చేశారు. అలాగే వివిధ కేసుల్లో అరెస్ట్ అయి జైలు కెళ్లిన కార్పోరేటర్లను వెంటనే భర్తరఫ్ చేయాలని కూడా జితేందర్ కోరారు. ఈ సందర్భంగా పోడియం వద్ద నిరసన తెలపడంతో పాలకవర్గ ప్రతినిధులు ఆయన్ని సముదాయించడం గమనార్హం.

తెలంగాణ తల్లి విగ్రహంపై…

కరీంనగర్ వన్ టౌన్ సమీపంలోని తెలంగాణ తల్లి విగ్రహాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని కార్పోరేటర్, బీఆర్ఎస్ నేత సర్దార్ రవిందర్ సింగ్ డిమాండ్ చేశారు. గతంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహా్ని తొలగించిన అధికారులు తిరిగి యథా స్థానంలో ఏర్పాటు  చేయాలన్నారు. లేనట్టయితే ఆందోళనలు చేపడ్తామని రవిందర్ సింగ్ హెచ్చరించారు.

You cannot copy content of this page