దిశ దశ, మానకొండూరు:
తమ ప్రాంతం మీదుగా నేషనల్ హైవే నిర్మాణంతో రవాణా సౌకర్యం మెరుగవుతున్నదన్న సంతోషం కన్నా సరికొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయని ఆ గ్రామ వాసుల్లో ఆందోళన ఎక్కువ అవుతోంది. నేషనల్ హైవే అథారిటీ అధికారులు రోడ్డు నిర్మాణం కోసం భూ సేకరణ జరిపిన తరువాత స్థానికంగా ఉన్న నీటి నిలువ ప్రాంతాలను చదును చేసుకున్నారు. దీంతో నీరు నిలచే పరిస్థితి లేకపోవడంతో గ్రామంలోకి వస్తున్నాయి. మానకొండూరు మండలం చెంజర్ల క్రాసింగ్ సమీపంలోని కొన్ని ఇండ్లలోకి నీళ్లు వచ్చి చేరాయి. ఇండ్ల మీదుగా నీటి ప్రవాహం సాగుతుండడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉధృతంగా వస్తున్న ఈ వరద వల్ల కొట్టుకపోయే ప్రమాదం కూడా ఉందని స్థానికులు తెలిపారు. భారీ వర్షం పడినప్పుడల్లా ఈ పరిస్థితి పునారావృతం అవుతోందని చెంజర్ల వాసులు చెప్తున్నారు. వరద నీరు ముంచెత్తుతున్న తీరు గురించి అధికారులకు సమాచారం ఇచ్చినప్పుడు బాధితులకు పంచాయితీ భవనంలో పునరావసం కల్పిస్తున్నారు. అయితే సమస్య పరిష్కారం కోసం చొరవ చూపడం లేదని గ్రామస్థులు అంటున్నారు. గతంలో ఎంపీఓ క్షేత్ర స్థాయి పరిశీలన చేసి వరద నీరు దిగువకు వెల్లేందుకు అనువుగా కాలువ తవ్వించాలని సూచించినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. దీంతో వర్షం కురిసినప్పుడల్లా గ్రామస్థులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. శాశ్వత పరిష్కారం కోసం అధికారులు చొరవ చూపాలని కోరుతున్నారు.