రియల్ వ్యాపారులకు మావోయిస్టుల వార్నింగ్….

దిశ దశ, కరీంనగర్:

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు చోట్ల జరిగిన క్రయ విక్రయాలపై మావోయిస్టు పార్టీ కన్నెర్ర చేస్తోంది. ఆయా ప్రాంతాల్లో మాజీల మధ్యవర్తిత్వంలో భూముల దందాలకు తెరలేపారంటూ పలువురిపై ఆరోపణలు గుప్పించింది. మావోయిస్టు పార్టీ జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి (జఎఎండబ్లుపి) డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ ఈ మేరకు విడుదల చేసిన లేఖలో పలు ప్రాంతాల్లో జరిగిన భూ దందాలపై ఆరోపణలు గుప్పించింది. గతంలో భూస్వాముల నుండి పేదలు లాక్కోగా పెత్తందార్లు పట్టణాలకు వలస పోయారని, కొంతమంది ఇండ్లు కూడా నిర్మించుకున్నారని వెంకటేష్ తెలిపారు. అయితే భూ స్వాములు కూడా ఇక ఆ భూములు తమకు దక్కవని భావించి పేద, మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధరకు అమ్ముకున్నారన్నారు. అయితే భూముల ధరలు పెరగడంతో భూస్వాములు మళ్లీ జోక్యం చేసుకుని పోలీసుల ద్వారా బెదిరింపులకు గురి చేసి ఆ భూములను స్వాధీనం చేసుకున్నారని వెంకటేష్ ఆరోపించారు. ఈ భూములను కొంతమంది మాజీలు మధ్యవర్తులుగా మారి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్మిస్తున్నారన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్లు వేసి కోట్లాది రూపాయలు గడిస్తున్నారని మావోయిస్టు వెంకటేష్ ఆరోపించారు. హుస్నాబాద్ పట్టణంలో బొప్పిరాజు లక్ష్మీకాంతరావుకు చెందిన భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారి, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, సిద్దిపేట జడ్పీ వైస్ ఛైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, కాంతాల రాజిరెడ్డి, ఏనుగు సురేందర్ రెడ్డి, కౌలు సుగుణాకర్ రెడ్డి సంపత్ యాదవ్ లు ఎమ్మెల్యే అనుచరులుగా ఉంటూ భూములు కొనుగోలు చేసి ప్లాట్లు చేసు అమ్ముతున్నారన్నారు. హుస్నాబాద్ కు చెందిన మర్యాల రాజశేఖర్ రెడ్డి, మర్యాల తిరుమల్ రెడ్డి, కొండూరి చంద్ర శేఖర్, అయిలేని రాజిరెడ్డి (మహ్మదాపూర్)లతో పాటు మరికొంత మంది రియల్ వ్యాపారులు భూములు విక్రయిస్తున్నారన్నారు. కమలాపూర్ మండలానికి చెందిన ఏవి శరత్ కుమార్, ఏవి రంగారావులకు చెందిన 160 ఎకరాల భూమిని, గూడురు మాదాటి చిన్న కేశవరెడ్డి, రామచంద్రారెడ్డిలకు చెందిన వందల ఎకరాల భూమిని మాజీలు మధ్యవర్తులుగా ఉంటూ క్రయ విక్రయాలు జరిపిస్తున్నారన్నారు. జమ్మికుంట పట్టణంలోని 629 సర్వే నెంబర్ లో గల ప్రభుత్వ భూమిని కమిషన్లు ఇస్తూ కొంతమంది కబ్జా చేస్తున్నారన్నారు. అలాగే జమ్మికుంట పట్టణంలో టీడీపీ హయాంలో నిరుపేదలు ఇండ్ల స్థలాల కోసం పోరాడి గుడిసెలు వేసుకోగా కొంతమందికి 80 గజాల చొప్పున భూమి కెటాయించారని మావోయిస్ట పార్టీ నేత వెంకటేష్ వివరించారు. అయితే స్థానిక ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అనుచరులు జిఓ నెంబర్ 59 పిని ఉపయోగించుకుని 10 నుండి 15 గుంటల చొప్పున స్థలాన్ని కబ్జా చేసుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ మునిసిపల్ ఛైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు ఇదే జీఓను ఆధారం చేసుకుని ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నాడని వెంకటేష్ వెల్లడించారు. రాజేశ్వర్ రావు అనుచరులు గుంటి సామ్రజ్యం, కౌన్సిలర్ గాజుల భాస్కర్, గర్రెపల్లి అరుణ్, దేశిని కోటి, బోల్ల స్వామి, బోల్ల సదానందం, పాతకాల రమేష్ రెడ్డి, దొడ్డి సదానందం, ఇల్లందకుంట బీఆర్ఎస్ పార్టీ ఎంపీపీ సరిగమల పావని, వెంకటేష్ లకు ప్రభుత్వ భూములను రెగ్యులరైజ్ చేయకుండా నిరుపేదలకు కెటాయించాలని వెంకటేష్ డిమాండ్ చేశారు. ఈ ప్రాంతంలో గన్ కల్చర్ కూడా పెరిగిపోయిందని కొంతమంది బాధితులకు తుపాకులు కూడా చూపెడుతూ భూములు స్వాధీనం చేసుకుంటున్నారని వెంకటేష్ ఆరోపించారు. భూ దందాలకు తెరలేపిన వారంతా కూడా వైఖరిని మార్చుకోవాలని వెంకటేష్ స్పష్టం చేశారు.


You cannot copy content of this page