అనుమతులు ఉంటే అర్థరాత్రి తవ్వకాలు ఎందుకో..?

వరద కాలువ అస్తిత్వానికే సవాల్…

దిశ దశ, చొప్పదండి:

రైతుల పాలిట వరప్రదాయిని అవుతుందని నిర్మించిన వరద కాలువ అస్తిత్వానికి సవాల్ గా మారింది. అక్రమార్కులు వరద కాలువ పరిసర ప్రాంతాల్లో మట్టి కోసం తవ్వకాలు జరుపుతున్న తీరు ఆందోళన కల్గిస్తోంది. బాజాప్తాగా మిషన్లను ఏర్పాటు చేసి మరీ మట్టి తవ్వకాలు జరుపుతున్న తీరు రైతులను కలవరపెడుతోంది. సాగునీటి వనరుల వద్ద ఎలాంటి తవ్వకాలు జరకూడదన్న విధానానికి స్వస్తి పలుకుతూ కొంతమంది అక్రమార్కులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు.

డ్రీమ్ ప్రాజెక్ట్…

శ్రీ రాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తరువాత వరద కాలువ నిర్మించినట్టయితే కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాలకు సాగు నీటిని తరలించాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. పివి నరసింహ రావు చేసిన ఈ ప్రతిపాదనకు దశాబ్దాల తరువాత కార్యరూపం దాల్చింది. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి వ్యవహరించినప్పుడు ఈ వరద కాలువ నిర్మాణానికి మోక్షం కల్గింది. వరద కాలువ ద్వారా నీటిని దిగువ ప్రాంతానికి తరలించే ప్రక్రియకు శ్రీకారం చుట్టడంతో మెట్ట ప్రాంతానికి నీటిని సరఫరా చేయడంతో పాటు వరద కాలువ నీటి వల్ల సమీప ప్రాంతాల్లో భూగర్భ జలాలు కూడా పెరిగాయి. అంతేకాకుండా మత్యకారులు కూడా చేపల వేటతో ఉపాధి పొందుతుండడంతో కేవలం రైతాంగానికే కాకుండా వివిధ వర్గాల వారికి ఈ వరద కాలువ వరప్రదాయినిగా మారిపోయింది.|

తవ్వకాలతో…

రామడుగు మండలం మీదుగా వెల్తున్న ఈ వరద కాలువకు సంబంధించిన మట్టిని చాలా మంది దర్జాగా తరలించుకపోతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమకు అధికారులు అనుమతులు ఇచ్చారని అందుకే మట్టిని తీసుకెల్తున్నామని చెప్పుకుంటున్నారు. అయితే ఇరిగేషన్ విభాగం నిబంధనల ప్రకారం ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువల వద్ద నిలువ ఉంచిన మట్టిని కానీ, రాళ్లను కాని తరిలించుకపోయేందుకు ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని తెలుస్తోంది. ఇరిగేషన్ విభాగం అదికారులు కానీ, రెవెన్యూ అధికారులు కూడా వీటి తవ్వకాల కోసం పర్మిషన్ ఇచ్చే సాంప్రాదాయమే ఉండదని సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు వరద కాలువను ఆనుకుని ఉన్న మట్టిని రవాణా చేసుకునేందుకు ఎలా అనుమతులు ఇస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది. నీటి పారుదల శాఖ కెనాల్స్ పక్కన నిర్మించే రోడ్లపై రైతులు కంకర కానీ గ్రావెల్ కానీ వేయాలన్నా అధికారుల అనుమతులు తీసుకుంటుంటారు. అయితే మట్టి, బండ రాళ్లను తరలించుకపోయేందుకు మాత్రం అనుమతులు ఇచ్చే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అధికారులు ప్రత్యేక అవసరాల కోసం అనుమతులు ఇచ్చినా సాయంత్రం ఉధయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల్లోగా మాత్రమే తవ్వకాలు చేసుకునేందుకు అనుమతులు ఇస్తారన్నది వాస్తవం. జలవనరుల వద్దకు రాత్రి వేళల్లో  కొన్ని జీవరాశులు అవాసం ఏర్పాటు చేసుకుంటుంటాయి. రాత్రి వేళల్లో తేమ శాతం ఎక్కువగా ఉండే జల వనరుల పరిసర ప్రాంతాల్లో అవాసం ఏర్పాటు చేసుకుని పగటి పూట ఆహారం కోసం వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటాయి. దీంతో రాత్రి వేళల్లో తవ్వకాలు జరిపినట్టయితే జీవ రాశుల ఉనికి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంటుందని ఆ సమయంలో తవ్వకాలకు అనుమతులు ఇవ్వరని తెలుస్తోంది. జిల్లాలోని పలు మండలాల మీదుగా వెల్తున్న వరద కాలువ పక్కన ఉన్న మట్టిని తరలించుకపోయేందుకు రాత్రి వేళల్లో కూడా మిషనరీని ఉపయోగించి తవ్వకాలు జరుపుతున్న తీరు కూడా విస్మయానికి గురి చేస్తోంది.

అస్తిత్వానికే సవాల్…

వరద కాలువ కోసం తవ్వకాలు జరిపినప్పుడు తొలగించిన మట్టి, బండరాళ్లను కాలువకు పక్కన వేస్తుంటారు. దీనివల్ల కాలువకు ఎలాంటి డ్యామేజీ ఉండదని, కొంతకాలం తరువాత కాలువకు రక్షణ కవచంగా మారుతుందని తెలుస్తోంది. అంతేకాకుండా భారీగా వరదలు వచ్చినప్పుడు కాలువకు ఇరువైపు ప్రాంతాల మీదుగా నీటి ప్రవహాం ఉధృతంగా ప్రవహించినా ఆ నీరు కాలువలోకి చేరకుండా ఉంటుంది. ఈ విధానం వల్ల వరధ ఉధృతితో కూడా కాలువకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉంటుందన్న ఆలోచనలతో ఈ పద్దతిని అవలంభిస్తారన్న అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. అయితే రామడుగు మండలంలో పలు చోట్ల వరద కాలువ మట్టిని తరలించుకపోయేందుకు అధికారులు అనుమతులు ఇవ్వడం వాస్తవమేనా కాదా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. తవ్వకాలు జరిపినప్పుడల్ల కూడా స్థానికులు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసే ప్రయత్నం చేసినా సంబంధిత అధికారులు రెస్పాండ్ కావడం లేదన్న ఆవేదన రైతాంగంలో వ్యక్తం అవుతోంది. వరద కాలువ సమీపంలోని మట్టి తవ్వకాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని రైతాంగం డిమాండ్ చేస్తోంది.

You cannot copy content of this page