దిశ దశ, హైదరాబాద్:
శాంతి భద్రతల పరిరక్షణలో నిమగ్నం కావల్సిన పోలీసు విభాగంలో పోస్టింగుల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన తప్పిదాలే ఓటమికి ప్రధాన కారణమన్న చర్చ సాగుతోంది. పోస్టింగుల విషయంలో సిఫార్సు లేఖల విధానంతో తెలంగాణ పోలీసు శాఖ ప్రత్యక్ష్యంగా అధికార పార్టీ నాయకులు శాసించే పరిస్థితికి చేరిపోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ విధానాన్ని అమలు చేస్తామని కుండ బద్దలు కొట్టడంతో పాటు సిఫార్సు లేఖలు ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని సమర్థించిన తరువాత నుండే పరిస్థితి చేయి దాటిపోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. పోలీసు విభాగంలోని పోస్టులను విఫణి వీధిలో పెట్టి వేలం వేసినంత పని చేశారన్న విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో రోజురోజుకు పోస్టింగ్ కోసం ఇచ్చే సిఫార్సు లేఖల ధరలు పెరుగుకుంటూ పోయాయన్న అభిప్రాయాలు బహిరంగంగానే వ్యక్తం అయ్యాయి. క్రిమినల్స్ విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన పోలీసులు అచేతనులుగా మారిపోయి చట్టాన్ని అధికార పార్టీ నేతలకు అప్పగించినంత పని అయిపోయిందన్న ఆరోపణలు వచ్చాయి. తామఃంతా మంచే చేస్తున్నామన్న అభిప్రాయాలతో ఉన్న కేసీఆర్ సహా ప్రభుత్వంలోని పెద్దలు వెనక జరుగుతున్న వాస్తవాలను గమనించే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో పోస్టును బట్టి డిమాండ్ పెంచుకుంటూ పోవడంతో పోస్టింగ్ పొందిన అధికారులు కూడా తాము చేసిన అప్పులు తీర్చేందుకు సమాజం పైనే రుద్దాల్సి వచ్చిందన్న విషయం తెలంగాణాలోని ప్రతి సామాన్యుడు కూడా గుర్తించాడు… కానీ ప్రభుత్వ పెద్దలు మాత్రం గమనించలేకపోయారు. అంతా బావుందన్న భ్రమల్లో పరిభ్రమించిన బీఆర్ఎస్ పార్టీలోని ముఖ్య నాయకులు వాస్తవ విషయాలను ఏ మాత్రం పట్టించుకున్న పాపన పోలేదు. అధికార దర్పం… తమ చుట్టూ రక్షణ వలయం… గులాభి మయం… నడుమ ఉన్నాం అన్న విషయాలు తప్ప గ్రౌండ్ రియాల్టి ఏంటీ అన్నది మాత్రం గమనించలేకపోయారన్న విమర్శలు వచ్చాయి. కొన్ని స్టేషన్లలో అయితే ఏడాదికి రెండు మూడు బదిలీలు కూడా జరిగిన సందర్బాలు ఉన్నాయంటే డిమాండ్ ఏ స్థాయిలో పలికిందో అర్థం చేసుకోవల్సిన అవశ్యకత ఉంది. ఒక దశలో పోలీసు అధికారుల పరిస్థితి ఎలా మారిందంటే సిఫార్సు లేఖలు అందుకుని పోస్టింగ్ పొందినా తనను బదిలీ చేయించేందుకు మరోకరు రాకుండా ఉండాలన్న తపన తీవ్రంగా పెరిగిపోయిన పరిస్థితి తయరైంది. దీంతో శాంతి భద్రతల పరిరక్షణ అటుంచిన కొంతమంది అధికారులు తమ కుర్చీని రెండేళ్ల పాటు కాపాడుకోవడానికే ప్రాధాన్యత ఇవ్వాల్సి వచ్చిందన్న వాదనలూ ఉన్నాయి. కొంతమంది అధికార పార్టీ నేతలు అడ్వాన్స్ తీసుకునే పద్దతికి కూడా శ్రీకారం చుట్టి తీరా వేళకు అంతకన్నా ఎక్కువ ముట్ట చెప్పిన వారికి పోస్టింగులు ఇచ్చారన్న విమర్శలు కూడా లేకపోలేదు.
అన్ని సవ్యంగా ఉన్నాయా..?
ఇకపోతే అన్ని సవ్యంగా సర్దుబాటు జరిగిన తరువాత పోస్టింగ్ పొందిన అధికారులు ఐపీసీ, సీఆర్పీసీ అమలు చేయడం కంటే బీఆర్ఎస్ నాయకులు చెప్పిన తీరుగా చట్టాలను మార్చాల్సి వచ్చిన సందర్భాలు ఎన్నెన్నో. సామాన్య బాధితుడు వెల్తే సివిల్ కేస్ అయితే… బీఆర్ఎస్ నాయకుడి రికమండేషన్ తో వెల్తే మాత్రం క్రిమినల్ కేసుగా మారిపోయిన ఘటనలు కోకొల్లలు. తమకు అనుకూలంగా లేని వారిని కూడా క్రిమినల్ కేసుల పేరిట పోలీస్ స్టేషన్లకు పిలిపించి హింసించారన్న విమర్శలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా భూ దందాల్లో అయితే ఇష్టారీతిన సాగించారన్నది ఓపెన్ సీక్రెట్. భూ దందాల్లో తమకు వ్యతిరేకంగా ఉన్నారన్న అక్కసుతో అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు కూడా క్రిమినల్ కేసుల పేరిట ఠాణాల చుట్టూ ప్రదక్షిణలు చేశారంటే పోలీసులను ఏ స్థాయిలో వినియోగించుకున్నారో అర్థం చేసుకోవచ్చు. కరీంనగర్ చెందిన ఓ దళారి వ్యవహరించిన తీరుతో ప్రొఫెషనల్స్ కూడా ఆర్థికంగా కుదేలయిపోయారంటే అక్కడి ప్రజా ప్రతినిధి ఆయన్ని ఏ స్థాయిలో అందలం ఎక్కించారో అర్థం చేసుకోవచ్చు. లేని భూమిని ఉన్నదిగా చూపించి ఫేక్ డాక్యూమెంట్లతో రిజిస్ట్రేషన్ చేసి కోట్లలో దండుకున్న బ్యాచులను కూడా వెనకేసుకొచ్చుకున్న చరిత్ర బీఆర్ఎస్ నాయకులకే దక్కింది. దీంతో నిందితులు దర్జాతనం వెలగబెడ్తుంటే బాధితులే నిందితులుగా మారిపోయి పోలీసు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అయినప్పటికీ సర్కారు పెద్దలు తమ చెప్పు చేతల్లో ఉన్నారని దళారులు ఇష్టారీతిన వ్యవహరించారన్న విమర్శలు ఉన్నాయి. ఇకపోతే వరంగల్ లాంటి మహానగరంలో ఎన్ఆర్ఐలు భూములు కొనుగోలు చేసుకున్నా వాటిని ఆక్రమించుకున్న ఘటనలలు లెక్కకు మించినవే ఉన్నాయి. దీంతో విదేశాల్లో స్థిరపడిన తెలంగాణ వాసులు ఇక్కడ భూములు కొనుగోలు చేయాలంటేనే జంకిన పరిస్థితి తయారైంది. ఎన్ఆర్ఐలు స్టేషన్ల చుట్టూ తిరిగి తమకు అన్యాయం జరిగిందన్నా నిందితుడు గులాభి కండువా వేసుకున్నాడు కాబట్టి పోలీసులు ఏమీ చేయలేకపోయారన్నది వాస్తవం. సోషల్ మీడియాలో ప్రతిపక్ష పార్టీల వారు షేర్ చేస్తే క్రిమినల్ కేసులు… అధికార పార్టీ వారు దిగజారుడుతనాన్ని ప్రదర్శించినా పట్టించుకున్న పాపాన పోయిన వారే లేరు. విపక్షం నాయకులపైనే చట్టాలు ఉపయోగించాలి కానీ అధికార పక్షం ఏం చేసినా కళ్లు మూసుకోవాలి అన్న పరిస్థితులు తెలంగాణా రాష్ట్రం అంతా తయారైంది. దీంతో బీఆర్ఎస్ సర్కారు హయాంలో సామాన్యుడు కూడా న్యాయం కోసం ఠాణా మెట్లెక్కకుండా తన బాధను దిగమింగుకుని కుమిలిపోయాడు. అంతేకాకుండా అధికార పార్టీ నేతలు కక్ష్యగడితే ఏ స్థాయి వారైనా క్రిమినల్ కేసుటు పెట్టేందుకు వెనకాడని దుస్థితికి స్టేషన్లు చేరుకున్నాయంటే వారు ఏ స్థాయిలో శాసించే పరిస్థితికి వచ్చారో అర్థం చేసుకోవచ్చు. చివరకు 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చి పంపించాల్సిన కేసుల్లో కూడా ప్రతిపక్ష పార్టీ నాయకులే అయినా, పలుకుబడి లేని వారే అయినా కోర్టు ముందు హాజరు పర్చాలని ఆదేశించే స్థాయికి అధికార పక్షం నాయకులు చేరుకున్నారు. దీంతో చట్టాలు అధికార పార్టీ వారికి చుట్టాలుగా మారిపోతే సామాన్యుడికి మాత్రం అందకుండా పోయాయన్న వాదనలు ఉన్నాయి. ఒకప్పుడు దేశానికే రోల్ మోడల్ అన్న రీతిలో ఉన్న తెలంగాణ పోలీసులు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పతనం వైపు తీసుకెళ్లారన్న విమర్శలు బాహాటంగానే వినిపించాయి. నక్సల్స్ ఏరివేతలో ప్రాణాలకు తెగించి పనిచేసిన ఘన చరిత్రను గడించిన తెలంగాణ పోలీసులు నేడు అబాసుపాలయ్యేలా వ్యవహరించిందే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అన్నది జగమెరిగిన సత్యం. క్రిమినల్స్ లో దడ పుట్టించాల్సిన పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేయడమే కాకుండా తమ అధికారాన్ని కోల్పోవడానికి మూల కారణం కూడా అయిందన్న వాస్తవాన్ని గ్రహించాల్సిన అవసరం ఉంది.