ఇద్దరు నక్సల్స్ మృతి
పోలీస్ అమరవీరుల దినోత్సవం నాడే ఘటన
దిశ దశ, దండకారణ్యం:
చత్తీస్ గడ్ దండకారణ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, పోలీసులకు ఎదురు కాల్పుల ఘటన చోటు చేసుకుంది. శనివారం ఉదయం కంకేర్ జిల్లా కొయిలిబెడ అటవీ ప్రాంతంలో డీఆర్జీ బలగాలకు, మావోయిస్టు నక్సల్స్ కు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న బలగాలకు మావోయిస్టులు ఎదురు కావడంతో ఈ ఘటన చోటు చేసుకుందని కంకేర్ జిల్లా పోలీసు అధికార వర్గాలు తెలిపాయి. కాల్పులు నిలిచిపోయిన తరువాత ఘటన స్థలంలో ఇద్దరు నక్సల్స్ మృతదేహాలను, ఒక ఇన్సాస్ ఆయుధం, ఒక బర్మర్ రైఫిలో పాటు మరికొన్ని వస్తువులు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కొయిలిబెడ అటవీ ప్రాంతంలో డీఆర్జీ బలగాలు సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయని పోలీసులు చెప్తున్నారు. అయితే ఎన్ కౌంటర్ లో మరణించిన నక్సల్స్ వివరాలు, తెలియరావల్సి ఉంది. దేశ వ్యాప్తంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్న క్రమంలోనే దండకారణ్య అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు చోటు చేసుకోవడం సంచలనంగా మారింది.