ఆ రీచ్ ను క్లోజ్ చేయండి
నవాబుపేట వాసులు వినతి
పెద్దపల్లి జిల్లాలోని మానేరు నదిలో రీచుల నుండి ఇసుక తరలించవద్దని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (ఎన్జీటీ) ఇచ్చిన స్టే ఆధారంగా ఇతర జిల్లాల్లోనూ కోర్టులను ఆశ్రయించే ప్రక్రియ మొదలైంది. ఇప్పటికే కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని ఇసుక రీచులకు వ్యతిరేకంగా ఆందోళన మొదలైన నేపథ్యంలో తాజాగా చిగురమామిడి మండలానికి చెందిన వారు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉప నదులను నుండి ఇసుక రీచుల ఏర్పాటుకు వ్యతిరేకంగా పోరాటం మొదలవుతోంది. పెద్దపల్లి జిల్లాలోని ఇసుక రీచులకు వ్యతిరేకంగా మానేరు పరిరక్షణ సమితి ప్రతినిధులు గొట్టి ముక్కుల సురేష్ రెడ్డి, కర్ణాకర్ రెడ్డిలు ఎన్జీటీని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఎన్విరాన్ మెంట్ క్లియరెన్స్ (ఈసీ) లేకుండా మానేరు నది నుండి ఇసుక తరలించేందుకు ఎలాంటి హక్కు లేదని, కేంద్ర పర్యావరణ చట్టాలు కూడా ఇవే స్పష్టం చేస్తున్నాయని ఎన్జీటీకి విన్నవించారు. ఈ నేపథ్యంలో ఎన్జీటీ పెద్దపల్లి జిల్లా మానేరు నుండి ఇసుకను తరలించవద్దని స్టే ఇచ్చింది దీంతో జిల్లాలోని చాలా వరకు రీచులను ఎక్కడికక్కడ క్లోజ్ చేయాల్సి వచ్చింది. టీఎస్ఎండీసీ అధికారులు కూడా ఇదే విషయాన్ని రీచుల యజమానులకు చెప్పి ఇసుక తరలింపును కొన్ని చోట్ల నిలిపివేశారు. అయితే ఎన్జీటీ ఇచ్చిన ఈ స్టేను ఆధారం చేసుకుని తాజాగా కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబేపేట గ్రామానికి చెందిన కొందరు హై కోర్టును ఆశ్రయించారు. ఈసీ లేకుండానే ఇక్కడ ఇసుక తవ్వకాలకు డిసిల్ట్రేషన్ పేరిట అనుమతులు ఇచ్చారని, ఈ ఇసుకను గ్రామ అవసరాలకు మాత్రమే వినియోగించుకోవల్సి ఉంటుంది కానీ ఇతర ప్రాంతాలకు తరలించకూడదంటూ పిటిషన్ లో హైకోర్టుకు విన్నవించారు. అయితే ఈ పిటిషన్ ను కరీంనగర్ జిల్లా సాండ్ కమిటీకి సిఫార్సు చేయడంతో రెండు రోజుల క్రితం నవాబుపేటకు చెందిన పిటిషనర్లతో జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ సమావేశం అయ్యారు. సాండ్ కమిటీ సమావేశంలో భాగంగా వారితో వివరాలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. నవాబుపేటలోని ఎల్లమ్మగడ్డ వాగులో ఇసుక తవ్వకాలకు అనుమతించడం సరికాదని వారు కలెక్టర్ కు విన్నవించారు. నిభందనలకు విరుద్దంగా డిసిల్ట్రేషన్ జరుపుతున్న తీరును ఆపాలని, ఇందు కోసం ఇచ్చిన అనుమతులను కూడా రద్దు చేయాలని కోరారు. ఈ సమావేశంలో మైనింగ్, ఇరిగేషన్, భూగర్భ జలాల అధికారులు పాల్గొన్నారు. పరిస్థితి ఇలాగే ఉన్నట్టయితే ఇతర ప్రాంతాల్లోని రీచులకు వ్యతిరేకంగా కూడా ఎన్జీటీ లేదా కోర్టులను ఆశ్రయించేందుకు సమాయత్తం అయ్యే అవకాశాలు లేకపోలేదు.