విస్తరిస్తున్న డ్యామేజ్… ఐదు పిల్లర్ల వరకూ పాకిన పగుళ్లు..?

7వ బ్లాక్ లోనే అసలు సమస్య

దిశ దశ, భూపాలపల్లి:

మేడిగడ్డ బ్యారేజ్ పగుళ్ల క్రమక్రమంగా విస్తరిస్తున్నట్టుగా తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు ఒకటి రెండు పిల్లర్ల వరకే పరిమితం అయిన పగుళ్లు దాదాపు ఐదు పిల్లర్ల వరకు పాకినట్టుగా తెలుస్తోంది. డ్యామేజ్ ఎఫెక్ట్ మొత్తం 7వ బ్లాకు మొత్తం విస్తరించే అవకాశం ఉన్నట్టుగా ఇంజనీరింగ్ అధికారులు అంచనా వేస్తున్నట్టు సమాచారం. ప్రధానంగా 7వ బ్లాక్ మొత్తాన్ని తొలగించి నూతన నిర్మాణాలు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 20వ పిల్లర్ కుంగుపోతున్న తీరును గమనిస్తే మొత్తానికే కుప్పకూలిపోయే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది.

4వ బ్లాక్ లో ఇలా…

అయితే ప్రాజెక్టు నిర్మాణ సమయంలో మేడిగడ్డ మీదుగా రోజుకు 10 లక్షల క్యూసెక్కుల వరకు వరద నీరు దిగువకు వెల్లింది. ఈ క్రమంలో 4వ బ్లాకులో ఏర్పడిన సమస్యను గుర్తించిన ఇంజనీర్లు అక్కడ పకడ్భందీగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఇక్కడి సాయిల్ ను ప్రత్యేకంగా పరీక్షా కేంద్రాలకు పంపించి పిల్లర్ల నిర్మాణం కోసం తీసుకోవల్సిన చర్యలపై సలహాలు తీసుకున్నారు. ఈ మేరకు కాంక్రీట్ పిల్లర్లను మిగతా పిల్లర్లకంటే అదనంగా రెండున్నర మీటర్ల లోతు నుండి వేయాలని నిపుణులు సలహా ఇచ్చారు. ఈ మేరకు 4వ బ్లాకులోని 11 పిల్లర్లను కూడా ఇదే విధానంతో నిర్మాణం చేయడంతో అక్కడ బ్యారేజీ పటిష్టంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే అనూహ్యంగా 7వ బ్లాకులోని 20వ పిల్లర్ కుంగిపోవడం ఆరంభించడం ఇంజనీరింగ్ అధికారులను ఆందోళన కల్గించింది. పటిష్టంగా ఉంటుందనుకున్న ప్రాంతంలోని పిల్లర్లకు పగుళ్లు తేలడం ఏంటన్నదే అంతుచిక్కకుండా పోయింది. దీంతో ఇంజనీరింగ్ అధికారులు, ఎల్ అండ్ టి ఇంజనీర్లు ఈ విషయంపై తర్జనభర్జనలు పడుతున్నారు. కాంక్రీట్ బెడ్ నిర్మాణంలో తప్పు జరిగిందా లేక, ఫ్లడ్ ఎక్కువ కావడం వల్ల ఈ సమస్య ఉత్పన్నం అయిందా అన్నదే పజిల్ గా మారిపోయింది. వరద ఉధృతంగా వెల్లిన ఇతర పిల్లర్లలో ఎలాంటి సాంకేతిక సమస్య ఏర్పడకపోగా కేవలం 7వ బ్లాకులోనే ఈ పరిస్థితి ఎదురు కావడం ఏంటన్నదే అంతుచిక్కకుండా పోయింది. ఈ విషయంపై దేశంలోని అత్యున్నతమైన నిపుణులతో చర్చించేందుకు ఇరిగేషన్, ఎల్ అండ్ టి ప్రతినిధులు చర్చించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. అయితే బుధవారం నుండి మాత్రం తాత్కాలికంగా మరమ్మత్తులు చేపట్టే పనిలో కాళేశ్వరం ప్రాజెక్టు అధికారులు నిమగ్నం అయ్యారు. ఒకటి రెండు నెలల్లో ఇందుకు సంబంధించిన అంచనాలను తయారు చేసి నూతన నిర్మాణాలు చేపట్టాలని యోచిస్తున్నట్టుగా సమాచారం. 7వ బ్లాక్ కు సంబంధించిన సాయిల్ ను కూడా ల్యాబ్ కు టెస్ట్ కోసం పంపించేందుకు కూడా అధికారులు సమాయత్తం అవుతున్నట్టుగా తెలుస్తోంది.

ఈ సారి నో లిఫ్ట్..?

అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్ లో సమస్య ఏర్పడడంతో ఈ సారి ఈ బ్యారేజ్ లో బ్యాక్ వాటర్ నిలువ ఉంచే అవకాశాలు లేవు. బ్యాక్ వాటర్ అంతా కూడా దిగువకు పంపించినట్టయితే అసలు సమస్యను గుర్తించి ప్రత్ర్యామ్నాయ చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయని భావించిన అధికారులు మేడిగడ్డ ఖాళీగా ఉంచనున్నారు. దీంతో మేడిగడ్డ నుండి మాత్రం ఎగువ ప్రాంతాలకు అనుకున్నంత మేర నీటిని లిఫ్ట్ చేసే అవకాశాలు లేవని తెలుస్తోంది. మరమ్మత్తుల ప్రక్రియ అంతా పూర్తయిన తరువాత క్రమక్రంగా నీటిని నిలువ ఉంచి బ్యారేజ్ తట్టుకునే సామర్థ్యానికి చేరుకుందా..? ఇతర పిల్లర్ల పరిస్థితి ఎలా ఉంది అన్న అంశాలను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు జాగ్రత్త పడాలన్న యోచనలో అధికార యంత్రాంగం ఉన్నట్టుగా తెలుస్తోంది.

You cannot copy content of this page