దిశ దశ, భూపాలపల్లి:
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ గురించి ఆరా తీసేందుకు మరో కమిటీ క్షేత్ర స్థాయిలో పర్యటన చేస్తోంది. ప్రస్తుత పరిస్థితులపై అధ్యయనం చేస్తున్న ఈ కమిటీ నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీకి నివేదిక ఇవ్వనుంది. రక్షణ, పునరుద్ధరణ, పర్యవేక్షణ పనుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ కమిటీ మేడిగడ్డపై సమగ్ర వివరాలు సేకరించనుంది. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం మేడిగడ్డకు చేరుకున్న ఈ కమిటీ 7వ బ్లాకు ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఈఎన్సీ అనిల్ కుమార్ నేతృత్వంలోని నలుగురు సభ్యులున్న ఈ కమిటీ వివరాలను సేకరిస్తోంది. కమిటీలో ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ నిపుణులు నాగేందర్ రావు, మేహన్, రామగుండం సర్కిల్ చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డిలు బ్యారేజీ ఏఢో బ్లాకును పరిశీలించారు. ఈ బ్లాకులోని గేట్ల కటింగ్, గ్రౌటింగ్, పనులను పరిశీలించారు. అలాగే డ్యాం అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ లో పడ్డ గుంతల గురించి అడిగి తెలుసుకున్న కమిటీ ప్రతినిదులు గ్రౌటింగ్ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. గేట్ల సమీపంలో 5 మీటర్ల మేర కోర్ కటింగ్ చేసి కాంక్రీట్ ఇంజెక్ట్ చేస్తున్నారు.